logo

రిజిస్ట్రేషన్లకు ఇంటి పన్ను రశీదు చాలు!

గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో నెల రోజులుగా నిలిచిపోయిన చరాస్తుల రిజిస్ట్రేషన్ల వివాదం కొలిక్కి వచ్చింది.

Published : 05 Feb 2023 05:59 IST

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో నెల రోజులుగా నిలిచిపోయిన చరాస్తుల రిజిస్ట్రేషన్ల వివాదం కొలిక్కి వచ్చింది. కొత్త పురపాలక చట్టం-2019 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరపాలక, పురపాలక సంస్థల పరిధిలో ఇంటి పన్ను చెల్లించిన రశీదు ఆధారంగా చరాస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, ఈ విధానాన్ని హనుమకొండ, వరంగల్‌ జిల్లాల పరిధిలో అమలుపరచాలని రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ శాఖాధికారులను కమిషనర్‌ ప్రావీణ్య కోరారు. శుక్రవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘సాంకేతిక సమస్య..స్తంభించిన పాలన’ కథనంతో రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులతో కమిషనర్‌ మాట్లాడారు. ఇక నుంచి ఓనర్‌షిప్‌, అసెస్‌మెంటు కాపీ, నో డ్యూ సర్టిఫికెట్లు జారీ చేయరని, చరాస్తుల రిజిస్ట్రేషన్లకు ఇంటిపన్ను రశీదు ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. బల్దియా ఇ-ఆఫీస్‌ విధానం ఎత్తివేశామని, డేటా మొత్తం సీజీజీలోకి అప్‌లోడ్‌ చేశారని, కొన్ని రోజులు సాంకేతిక కారణాలు వచ్చాయని, ఇక నుంచి అన్ని సక్రమంగా ఉంటాయని కమిషనర్‌ స్పష్టం చేశారు. మైగ్రేషన్‌తో క్షేత్రస్థాయిలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే తక్షణమే సంబంధిత అధికారులు హైదరాబాద్‌లోని సీజీజీ ప్రతినిధులతో మాట్లాడాలని ఆదేశించారు.


ధ్రువీకరణ పత్రాలుండవు

గతంలో మాదిరిగా ఓనర్‌షిప్‌, అసెస్‌మెంటు కాపీలు, నో డ్యూ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయరని బల్దియా కమిషనర్‌ ప్రావీణ్య స్పష్టత ఇచ్చారు. ఇంటి పన్ను చెల్లించే రశీదు ఆధారంగా యజమాని అని గుర్తించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఇదే విధానం అమలవుతుందన్నారు. పాత భవనాల అసెస్‌మెంటు 1984, 1993 కాపీలు బల్దియా ప్రధాన కార్యాలయంలో రికార్డుల ఆధారంగా జారీ చేస్తారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని