logo

రహదారులు రక్తసిక్తం

ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా శనివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రహదారి ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు.

Published : 05 Feb 2023 06:11 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా శనివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రహదారి ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. ములుగు, జనగామ, మహబూబాబాద్‌, హనుమకొండ జిల్లాల పరిధిలో జరిగిన ఈ ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. సంఘటన స్థలాల్లో బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి.  


ఆటో బోల్తా పడి ఇద్దరు కూలీల దుర్మరణం..

16 మందికి గాయాలు

బానోత్‌ జ్యోతి,మల్లెబోయిన సునీత

తాడ్వాయి, న్యూస్‌టుడే: తాడ్వాయి మండలంలోని నార్లాపురంలో శనివారం ఆటో విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని బోల్తా పడి ఇద్దరు మహిళా కూలీలు మృతిచెందారు. మరో 16 మందికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. గోవిందరావుపేట మండలం మొద్దులగూడేనికి చెందిన 18 మంది మహిళలు తాడ్వాయి మండలం మేడారంలో వరినాట్లు వేసేందుకు ఉదయం ఆటోలో బయలుదేరారు. మేడారానికి చెందిన చిడెం నాగార్జున తన ఆటోలో కూలీలను తీసుకొస్తూ నార్లాపురంలోని ఓ మూలమలుపు వద్ద వేగంగా విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మల్లెబోయిన సునీత(40) అక్కడికక్కడే మృతిచెందారు. మేడారం చిన్నజాతర విధుల్లో ఉన్న సీసీఎస్‌ సీఐ రవీందర్‌, ఎస్సై వెంకటేశ్వర్‌రావు ప్రమాదస్థలికి చేరుకు ని క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించారు.  బానోత్‌ జ్యోతి(40) వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. మిగిలిన 16 మంది చికిత్స పొందుతున్నారు. పస్రా సీఐ శంకర్‌ సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతురాలు సునీత భర్త రఘు ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.


శాస్త్రవేత్త మృతితో విషాదం

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాననుకున్న  శాస్త్రవేత్తను మృత్యువు శాశ్వతంగా దూరం చేసింది. సుబేదారి ఠాణా పరిధిలో తిరుమల్‌ జంక్షన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్‌ జిల్లాలో వ్యవసాయ పత్తి పరిశోధన సంస్థలో సీనియర్‌ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న వజ్రా తిరుమల్‌రావు (47) మృతి చెందారు. ఇన్‌స్పెక్టర్‌ షుకూర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ అమరావతినగర్‌లో నివాసం ఉంటున్న తిరుమల్‌రావు శుక్రవారం ఆదిలాబాద్‌ నుంచి బయలుదేరి అర్ధరాత్రి హనుమకొండ బస్టాండ్‌లో దిగారు. ఇంటికి వెళ్లేందుకు ఆన్‌లైన్‌ ద్వారా ద్విచక్ర వాహనాన్ని బుక్‌ చేసుకున్నారు.  వాహనంపై వెళ్తుండగా, తిరుమల జంక్షన్‌ వద్దకు రాగానే రాంగ్‌రూట్‌లో వచ్చిన కారు ఢీకొట్టింది. వాహనం నడుపుతున్న రాకేశ్‌తో పాటు తిరుమల్‌రావు కింద పడ్డారు. రాకేశ్‌కు కాలు విరిగింది. వెనక కూర్చున్న తిరుమల్‌రావు తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రులను 108 వాహనంలో వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.


ప్రాణస్నేహితులను బలిగొన్న అతివేగం

ప్రశాంత్‌, బొడ్డు నవీన్‌

కొడకండ్ల, న్యూస్‌టుడే: వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం ఉదయం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయిలోని పెట్రోల్‌బంక్‌ వద్ద జనగామ-సూర్యాపేట ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. కొడకండ్ల ఎస్సై కొంరెల్లి కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గ్రామానికి చెందిన నాటి ప్రశాంత్‌ (19), బొడ్డు నవీన్‌ (20) చిన్ననాటి నుంచి స్నేహితులు. తిర్మలగిరిలో డిగ్రీ చదువుతున్నారు. ప్రశాంత్‌ ఖాళీ సమయాల్లో జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు.  శనివారం ఉదయం ద్విచక్రవాహనంపై ఫణిగిరి నుంచి దేవరుప్పులకు వెళ్తుండగా.. జనగామ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ ఢీకొట్టడంతో మరణించారు. ద్విచక్రవాహనం ధ్వంసం కాగా మృతదేహాలు చెల్లా చెదరుగా పడిపోయాయి.

* ఇద్దరివీ వ్యవసాయాధారిత కుటుంబాలే. ప్రశాంత్‌ తల్లిదండ్రులకు ఆయన ఒక్కడే కుమారుడు  మరో కుమార్తె ఉంది. నవీన్‌కు తల్లిదండ్రులతో పాటు ఒక సోదరుడు ఉన్నారు. ఇద్దరి మృతితో ఫణిగిరిలో విషాదఛాయలు అలముకున్నాయి.   కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.  


మృతుడు వెంకన్న

ద్విచక్రవాహనం అదుపుతప్పి.. మరిపెడ పట్టణ శివారు కాలిపోయిన తండా సమీపంలో జాతీయ రహదారిపై ద్విచక్రవాహన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఎస్సై పవన్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లో నివాసముంటున్న సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం బికుమల్లకు చెందిన కాశబోయిన వెంకన్న (39) మరిపెడలోని ఎల్లంపేట గ్రామంలో బంధువులు నిర్వహించిన శుభకార్యానికి హాజరయ్యారు.  ద్విచక్రవాహనంపై ఎల్లంపేట నుంచి మరిపెడకు వస్తున్న క్రమంలో వాహనం అదుపుతప్పి పాదచారుడిని ఢీకొట్టింది.  పాదచారుడితో పాటు వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి.  మహబూబాబాద్‌ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ వెంకన్న మృతిచెందారు. 

న్యూస్‌టుడే, మరిపెడ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు