logo

నిరసన బాటలో భాషా పండితులు

చాలాకాలం తర్వాత ప్రభుత్వం చేపట్టిన పదోన్నతులు, బదిలీల్లో తమకు రిక్త హస్తమే చూపించారని భాషాపండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 05 Feb 2023 06:11 IST

పాఠం చెబుతున్న ఉపాధ్యాయుడు

దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్‌టుడే: చాలాకాలం తర్వాత ప్రభుత్వం చేపట్టిన పదోన్నతులు, బదిలీల్లో తమకు రిక్త హస్తమే చూపించారని భాషాపండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. తాము చేపట్టిన రెండంచెల ఆందోళనలో భాగంగా తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించమని, మలివిడతలో పోస్టుకార్డుల ఉద్యమం నిర్వహిస్తామని సంకేతాలిస్తున్నారు. రాష్ట్ర భాషోపాధ్యాయుల సంఘం ప్రతినిధి చక్రవర్తుల శ్రీనివాస్‌, ఆర్‌యూపీపీ, ఈఆర్‌యూపీ, టీఎస్‌ ఎస్‌ఎల్‌టీఏ, పీఈటీఎస్‌ సంఘాల నాయకులు రాఘవరెడ్డి, కృష్ణమూర్తి, విద్యాసాగర్‌ అందించిన వివరాలివి..


ప్రభుత్వ హామీ అమలయ్యేనా?

ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 8,630 మంది భాషా పండితులు పని చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో నిర్వహించిన తెలుగు మహాసభల సందర్భంగా వీరికి పదోన్నతులు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉన్నత పాఠశాలల్లో ఎస్జీటీలు ఉండకుండా అందరూ పాఠశాల సహాయకులే ఉండాలని పాఠశాలల్లోని ఎస్జీటీలను  అప్పుడే పదోన్నతులు లేదా బదిలీల ద్వారా సర్దుబాటు చేశారు. హోదా మాత్రం సెకండరీ గ్రేడు టీచర్లుగానే ఉంచారు. తమను పాఠశాల సహాయకులుగా గుర్తిస్తారని వారు మురిసిపోయారు. రెండేళ్ల తర్వాత వారి విద్యార్హతలు, వృత్తిపరమైన అభివృద్ధి తాలూకు ధ్రువపత్రాలను పరిశీలించారు. కొంత మంది ఉపాధ్యాయుల సేవా పుస్తకాల్లో కూడా పదోన్నతుల వివరాలు నమోదు చేశారు. ఒకటి రెండు రోజుల్లో పదోన్నతులు వస్తాయని పాఠశాలల్లో అభినందన సభలు నిర్వహించారు. రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల బాధ్యులతో సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేస్తామని చెప్పిందని, తర్వాత పట్టించుకోలేదని సంఘాల బాధ్యులు తెలిపారు.


విద్యార్థులకు బోధన నిలిపివేత

ఉన్నత పాఠశాలల్లో భాషా పండితులతో పాటు వ్యాయామోపాధ్యాయులు కూడా నష్టపోతున్నారు. వారు 2,479 మంది ఉన్నారు. ప్రభుత్వ ఉదాసీనత కారణంగా అర్హతలకు తగిన ఎదుగుదలలేక పాఠశాల సహాయకుల మాదిరిగా సేవలు అందిస్తూ ఎస్జీటీ స్థాయిలో కొనసాగుతున్నామని చెబుతున్నారు. తమ ఆవేదనను పోస్టుకార్డుల రూపంలో కోర్టులకు, ప్రభుత్వ పెద్దలకు విన్నవించనున్నట్లు తెలిపారు. ఈనెల 1 నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించడం నిలిపివేశారు. త్వరలో జరగనున్న పదో తరగతి ప్రీ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు దూరంగా ఉంటామని, ఆందోళనలు చేపడతామని సంఘాల నాయకులు చెప్పారు.


మొదటి నుంచీ అసమానతలే..

- చక్రవర్తుల శ్రీనివాస్‌, రాష్ట్ర భాషోపాధ్యాయుల సంఘం బాధ్యుడు

ఆరేళ్లుగా పాదయాత్రలు, అభ్యర్థనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు పాఠశాల సహాయకులుగా పదోన్నతి కల్పించకపోతే తొమ్మిది, పదో తరగతుల విద్యార్థులకు పాఠాల  బోధనను నిలిపివేస్తామని చెప్పినా సానుకూలంగా స్పందించడం లేదు. పాఠశాలల విద్యార్థులకు భాషాశాస్త్రాల బోధన అవసరముందా లేదా అన్నది ప్రభుత్వమే నిర్ణయించాలి. మమ్మల్ని ప్రతిసారీ తప్పుదోవ పట్టిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు