logo

పులకించిన మానుకోట

మానుకోట ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.. వీధుల్లో పండగ వాతావారణం నెలకొంది.. బొడ్రాయి పునఃప్రతిష్ఠ వేడుకలు మిన్నంటగా దూరప్రాంతాల్లో ఉన్నవారు.. బంధువులు.. అతిథులతో పట్టణమంతా సందడి నెలకొంది..

Published : 06 Feb 2023 04:10 IST

మిన్నంటిన బొడ్రాయి పునఃప్రతిష్ఠ సంబురాలు

కొలువుదీరిన బొడ్రాయి దేవత

మహబూబాబాద్‌,  న్యూస్‌టుడే: మానుకోట ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.. వీధుల్లో పండగ వాతావారణం నెలకొంది.. బొడ్రాయి పునఃప్రతిష్ఠ వేడుకలు మిన్నంటగా దూరప్రాంతాల్లో ఉన్నవారు.. బంధువులు.. అతిథులతో పట్టణమంతా సందడి నెలకొంది.. జిల్లా కేంద్రంలో ఐదు రోజులుగా సంప్రదాయబద్దంగా, నిర్వహిస్తున్న ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. స్థానికులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ప్రతి ఇల్లు బంధుమిత్రులతో కళకళలాడింది. వేదమంత్రోచ్ఛారణలు, బొడ్రాయి మాతా నామస్మరణలతో పట్టణమంతా మారుమోగింది. బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన ముగింపు సందర్భంగా నాభిశిల జలాభిషేకం, పోతురాజు దారుశిల్పం, నాభిశిలకు ధాన్యాదివాసంతో భక్తులు భక్తిభావంతో తన్మయత్వం చెందారు. పురపాలక సంఘం ఛైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున యంత్రస్థాపనతో బొడ్రాయి మాతను పునఃప్రతిష్ఠించారు. అష్ట దిక్పాలకుల పూజ, మహాబలి నివేదన, పూర్ణాహుతి, కుంభాభిషేకం గావించిన అనంతరం గ్రామంలోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఒక్కో కుటుంబం నుంచి బోనం సమర్పించారు. ఉదయం రెండు గంటల పాటు పట్టణంలో ఎనిమిది ప్రధాన రహదారులను అష్టదిగ్బంధనం చేసి పట్టణ పొలిమేరల్లో బలిముద్ద వేశారు. విశ్వబ్రాహ్మణులు, వేదబ్రాహ్మణులు శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చేశారు. శివసత్తుల పూనకాలు, బైండ్ల పూజారులు, పోతురాజు విన్యాసాలతో పట్టణమంతటా పండగవాతావరణంతో నిండిపోయింది. పట్టణ పోలీసులు నలుమూలల భారీ బందోబస్తు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని గ్రామ దేవతల వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

బోనం సమర్పించేందుకు వస్తున్న పట్టణ ప్రజలు

పూజలు చేసిన ప్రముఖులు

జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకలు స్థానిక శాసనసభ్యుడు బానోతు శంకర్‌నాయక్‌ పర్యవేక్షణలో ఆద్యంతం ప్రశాంతవాతారణంలో కొనసాగాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా వేడుకను నిర్వహించారు. ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ కేంద్ర సహాయమంత్రి పోరిక బలరాంనాయక్‌, డోర్నకల్‌ శాసనసభ్యులు డీఎస్‌.రెడ్యానాయక్‌, జిల్లా కలెక్టర్‌ కె.శశాంక, ఎస్పీ శరత్‌చంద్రపవార్‌, ప్రముఖ సినీ హాస్యనటుడు రఘు వేడుకలకు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని