logo

రాజన్న పాలన తెస్తా.. మద్దతివ్వండి

పేదలందరికీ ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఆరోగ్యశ్రీ, అభయహస్తం వంటి పథకాలతో ప్రజలందరి గుండెల్లో దేవుడిగా నిలిచిన వైఎస్సార్‌ పాలనను ఆయన బిడ్డగా తీసుకొస్తానని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల అన్నారు.

Updated : 06 Feb 2023 05:22 IST

ప్రజలకు అభివాదం చెబుతూ పాదయాత్ర సాగిస్తున్న వైఎస్‌ షర్మిల

శివనగర్‌, న్యూస్‌టుడే: పేదలందరికీ ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఆరోగ్యశ్రీ, అభయహస్తం వంటి పథకాలతో ప్రజలందరి గుండెల్లో దేవుడిగా నిలిచిన వైఎస్సార్‌ పాలనను ఆయన బిడ్డగా తీసుకొస్తానని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల అన్నారు. ఆదివారం వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర నిర్వహించారు. వరంగల్‌ ఫోర్టు రోడ్డు ఖిలావరంగల్‌ పెట్రోల్‌ పంపు కూడలిలో షర్మిలకు ప్రజలు స్వాగతం పలికారు. దారి పొడవునా షర్మిలను చూసేందుకు ప్రజలు తరలి వచ్చారు. ఫోర్డురోడ్డులోని సన్‌షైన్‌ ఆసుపత్రి డాక్టర్‌ నరేష్‌కుమార్‌ వైద్యసిబ్బంది షర్మిలకు స్వాగతం పలికి సత్కరించారు. వరంగల్‌ ఇసుకఅడ్డా కూడలిలో ఆ పార్టీ వరంగల్‌ తూర్పు కన్వీనర్‌ మల్యాల సుమిత్‌గుప్తా షర్మిలకు భారీ గజమాలతో స్వాగతం పలికారు. షర్మిల మాట్లాడుతూ ఎన్నికల హామీలను విస్మరించిన కేసీఆర్‌ గాడిదకు తెల్లరంగు వేసి ఆవు అని నమ్మిస్తారని ప్రజలు మరోసారి మోసపోవద్దన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అందరికి ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పింఛన్లు, ఆరోగ్యశ్రీసేవలు అందిస్తామని, మహిళ పేరిట ఇళ్లు ఇస్తామన్నారు. బెల్టు షాపులను తొలగిస్తామన్నారు.  ఇసుకఅడ్డా నుంచి రైల్వేగేటు ప్లైఓవర్‌ బట్టల బజార్‌ మీదుగా యాత్రసాగించారు.

అండర్‌ బ్రిడ్జి వైపు దారి మూసివేత

వైఎస్‌ షర్మిల పాదయాత్ర సందర్భంగా వరంగల్‌ అండర్‌బ్రిడ్జి వైపు యాత్ర రాకుండా, బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు రాకుండా వన్‌వేలో మళ్లించారు. తూర్పు ఎమ్మెల్యే నివాసం ఉండటం వల్లనే యాత్ర ఆ దారిలో కొనసాగితే ఏదైనా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న భయంతో పోలీసులు ముందస్తుగా ఈ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. దారి మళ్ల్లింపుతో అండర్‌బ్రిడ్జి దారిలో వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని