logo

ఇటు కమిటీ విచారణ.. అటు జీరో దందా

వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో జీరో దందాను నియంత్రించేందుకు ఓవైపు మార్కెట్‌ శాఖకు చెందిన ప్రత్యేక పరిశీలన బృందం విచారణ చేపడుతుండగానే, మరోవైపు కొంతమంది వ్యాపారులు జీరో దందా కొనసాగించారు.

Published : 06 Feb 2023 04:23 IST

మార్కెట్‌కు వచ్చిన మిర్చి

ఎనుమాముల మార్కెట్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో జీరో దందాను నియంత్రించేందుకు ఓవైపు మార్కెట్‌ శాఖకు చెందిన ప్రత్యేక పరిశీలన బృందం విచారణ చేపడుతుండగానే, మరోవైపు కొంతమంది వ్యాపారులు జీరో దందా కొనసాగించారు. ఇటీవల మార్కెట్‌లో నకిలీ తక్‌పట్టీలతో మార్కెట్‌ ఆదాయానికి గండిపడుతున్న అంశంపై ‘ఈనాడు’లో వచ్చిన వరుస కథనాలకు రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ స్పందించి జిల్లా స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే. తాజాగా బృందం మార్కెట్‌లో గేట్‌ ఎంట్రీలు, తక్‌పట్టీలు, బిడ్డింగ్‌ రిజిస్టరు, కొనుగోళ్ల తీరును పరిశీలిస్తున్న సమయంలో ఆర్కే ఎంటర్‌ప్రైజెస్‌, జైగణేశ్‌ ట్రేడింగ్‌ అడ్తీదారులకు సంబంధించిన మిర్చిని భారత్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యాపారి జీరో కాంటాలు నిర్వహిస్తూ దొరికిపోయారు. విచారణ కమిటీ అధికారి ప్రసాద్‌రావు ఆదేశాల మేరకు మార్కెట్‌ కార్యదర్శి రాహుల్‌ గ్రేడ్‌ 2 కార్యదర్శి, సహ కార్యదర్శి, మిర్చియార్డు సూపర్‌వైజర్‌కు మెమోలు జారీచేయడంతో పాటు సదరు వ్యాపారులను, దడవాయిని వారం పాటు సస్పెండ్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో మిర్చి యార్డు సూపర్‌వైజర్‌ నర్సింహ సెలవుల్లో వెళ్లిపోయారు.

తగ్గిన ఆదాయం

ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో వేల క్వింటాల మిర్చి పంటను రైతులు మార్కెట్‌కు తీసుకొస్తారు. ఈ రెండు నెలల్లోనే మార్కెట్‌లో రూ.కోట్లలో జీరో దందా జరుగుతోంది. సాధారణంగా మార్కెట్‌లో కొనుగోలు చేసిన పంట ఉత్పత్తుల ఆధారంగా వ్యాపారులు మార్కెటింగ్‌ శాఖకు సెస్‌, వాణిజ్య పన్నుల శాఖకు 5 శాతం చెల్లించాల్సి ఉంటుంది. మార్కెట్‌కు వస్తున్న పంట ఉత్పత్తుల మొత్తానికి పన్నుల వసూలు కావడం లేదు. సుమారు 30 నుంచి 40 శాతం పంట ఉత్పత్తులను రికార్డుల్లో చేర్చకుండానే వ్యాపారులు బయటికి తరలిస్తున్నారు. దళారులకు మార్కెట్‌లోని కొంతమంది అధికారులు, సిబ్బంది సహకరిస్తున్నారు. జోరుగా జీరోదందా కొనసాగుతుండడంతో ఈ ఏడాది మార్కెట్‌ ఆదాయ లక్ష్యం రూ.40 కోట్లు నిర్దేశించుకోగా, ఇప్పటివరకు రూ.25 కోట్ల మేర మాత్రమే సమకూరింది.


కఠిన చర్యలు తీసుకుంటున్నాం..
-బి.వి.రాహుల్‌, మార్కెట్‌ ఉన్నతశ్రేణి కార్యదర్శి

మార్కెట్‌లో పంట ఉత్పత్తులను రికార్డు చేయకుండా కొనుగోలు చేస్తున్న వ్యాపారులపై దృష్టిసారించాం. ఎలాంటి జీరో దందా జరగకుండా అధికారులను అప్రమత్తం చేశాం. గత వారంలో పంట ఉత్పత్తులను జీరోలో కొనుగోలు చేసిన వ్యాపారిని వారం పాటు మార్కెట్‌లో కొనుగోళ్లు చేయకుండా వేటు వేశాం. అప్రమత్తంగా లేని యార్డు అధికారులకు మెమోలు జారీచేశాం. ఎవరైనా జీరోదందాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని