logo

అక్రమ లేఅవుట్ల జోరు..

అనధికార లేఅవుటు స్థలాల్లో భవన నిర్మాణ అనుమతులు ఇవ్వకూడదని పురపాలక చట్టం 2019 చెబుతోంది.  మరోవైపు ‘లేఅవుటు రెగ్యులరైజేషన్‌ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్‌) భవిష్యత్తులో ఉండదని రాష్ట్ర పురపాలక శాఖ తేల్చి చెప్పింది.

Updated : 06 Feb 2023 05:11 IST

గ్రేటర్‌, పురపాలికల ఆదాయానికి గండి
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌, హసన్‌పర్తి, వర్ధన్నపేట, ఐనవోలు

వరంగల్‌ శివారులో అక్రమ లేఅవుటు హద్దురాళ్ల తొలగింపు

అనధికార లేఅవుటు స్థలాల్లో భవన నిర్మాణ అనుమతులు ఇవ్వకూడదని పురపాలక చట్టం 2019 చెబుతోంది.  మరోవైపు ‘లేఅవుటు రెగ్యులరైజేషన్‌ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్‌) భవిష్యత్తులో ఉండదని రాష్ట్ర పురపాలక శాఖ తేల్చి చెప్పింది. అయినా వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో విచ్ఛలవిడిగా అనధికార లేఅవుట్లు వెలుస్తున్నాయి. ఫలితంగా గ్రేటర్‌ వరంగల్‌, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా), ఉమ్మడి జిల్లాలోని పురపాలక సంస్థల ఆదాయానికి రూ.కోట్లలో గండి పడుతోంది. వీటి వెనుక రాజకీయ అండదండలుండటంతో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారు.

వ్యాపారుల నయా దందా

* గ్రేటర్‌, ‘కుడా’ పరిధిలో వందల సంఖ్యలో అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. స్థిరాస్తి వ్యాపారులు(రియాల్టర్లు) చాలా తెలివిగా ప్లాట్లు అమ్ముతున్నారు. అనధికార లేఅవుట్ల కోసం ఎకరాల చొప్పున భూములు కొనుగోలు చేసి ప్లాట్లు చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా రిజిస్ట్రేషన్‌ శాఖాధికారులకు ముడుపులు ముట్టజెప్పి గుంటల చొప్పున స్థలాలు అమ్ముతున్నారు. గతేడాది నుంచి నయా దందా మొదలు పెట్టారు. గుంటల చొప్పున అమ్మితే వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. తర్వాత భవన నిర్మాణ అనుమతులకు వాడుతున్నారు.

* వరంగల్‌ నగర పరిధిలోని విలీన గ్రామాల్లో ఎక్కువగా చిన్న చితక లేఅవుట్లు చేస్తున్నారు. అనుమతులు పొందకుండానే మూడో కంటికి తెలియకుండా స్థలాలు అమ్మేస్తున్నారు. వసంతపూర్‌, దూపకుంట, బొల్లికుంట, సింగారం, నక్కలపెల్లి, గాడిపెల్లి, స్తంభంపెల్లి, ధర్మారం, గొర్రెకుంట, పోతరాజుపల్లి, కొత్తపేట, పైడిపల్లి, ఆరెపల్లి, నాగారం, హసన్‌పర్తి, ఎల్లాపూర్‌, దేవన్నపేట శివారు, మడికొండ శివారు, భట్టుపల్లి, కడిపికొండ, తరాలపల్లి, తిమ్మాపూర్‌ విలీన గ్రామాల్లో అక్రమ లేఅవుట్ల జోరు ఎక్కువగా ఉంది.

హసన్‌పర్తి మండలం ముచ్చర్లలో ప్రభుత్వ శిఖం భూమిలోనే అక్రమంగా వెలిసిన వెంచర్‌

* ‘కుడా’ పరిధిలోని కమలాపూర్‌, ఎల్కతుర్తి, హుజురాబాద్‌ శివారు, స్టేషన్‌ఘన్‌పూర్‌, రఘునాథ్‌పల్లి, చిల్పూరుగుట్ట, ధర్మసాగర్‌, వర్దన్నపేట, ఐనవవోలు, గీసుకొండ మండల శివారుల్లో ఇదే విధానం ఉంటోంది.

* పున్నేలులో 20 ఎకరాలు, పంథినిలో 35, ఐనవోలులో 40, సింగారంలో 36 ఎకరాల్లో అక్రమ వెంచర్లు ఉన్నాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల్లో సర్వే నంబర్లు సరిచూసుకొని కొనుగోలు చేయాలని, లేకుంటే మోసపోతారని స్థానికులు పేర్కొంటున్నారు.  

* హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ముచ్చర్ల గ్రామంలో చెరువు శిఖం భూమినే పలువురు రియల్టర్లు అధికారుల అండతో కబ్జా చేసి ఆ భూమిలోనే వెంచర్‌ వ్యాపారానికి తెర లేపారు. చుట్టూ ప్రహరీని నిర్మించి తక్కువ ధరకే స్థలం అంటూ   ప్రచారం చేపట్టారు.

* హసన్‌పర్తి మండలం నాగారం పెద్ద చెరువు సమీపంలో పలువురు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్‌ పేరుతో భూదందా సాగిస్తున్నారు.

* హసన్‌పర్తి మండలం పెంబర్తిలో రియల్టర్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రియల్‌ ఎస్టేట్‌ దందా నడుపుతున్నారు.

నిబంధనలు ఇలా

* లేఅవుటు అనుమతులు పొందాలంటే ఆ స్థలంలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్తు స్తంభాలు, నీటి సరఫరా తదితర మౌలిక వసతులు కల్పించాలి.

* ‘నాలా’ పేరుమార్పిడి, డెవలప్‌మెంటు ఛార్జీలు చెల్లించాలి. ప్రజల అవసరాల కోసం 10 శాతం ఖాళీ స్థలాన్ని కేటాయించాలి.

* గ్రేటర్‌, పురపాలికలకు లేఅవుటు అనుమతుల రుసుములు ఒక ఎకరానికి సుమారు రూ.15-20 లక్షలు ఉంటుంది.

* జిల్లా కలెక్టర్లు లేఅవుటు అనుమతులు జారీ చేస్తారు. స్థానిక సంస్థల అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు.


వర్ధన్నపేట మండలం ఇల్లందలోని పాత పాలకేంద్రానికి చెందిన సుమారు ఆరెకరాల భూమిని ఇటీవల కొందరు కొనుగోలు చేశారు. పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకోకుండానే భూమిని ప్లాట్లుగా విభజించడంతో పాటు, రోడ్లు ఇతర పనులు చేపట్టారు. ఈ విషయమై ఎంపీడీవో రాజలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి రామారావును ‘న్యూస్‌టుడే’  వివరణ కోరగా.. సంబంధిత భూమికి ఎటువంటి అనుమతులు రాలేదని తెలిపారు. భూ వివాదం నేపథ్యంలో కోర్టులో కేసు నమోదైనట్లు చెప్పారు.


అక్రమ లేఅవుటు ప్లాట్లతో నష్టాలు

* భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వరు.

* అక్రమ లేఅవుట్‌లో కొనుగోలు చేసిన స్థలానికి ఒకవేళ టీఎస్‌-బీపాస్‌ ద్వారా భవన నిర్మాణ అనుమతి పొందాలంటే ఖాళీ స్థలం పన్ను (షాటు ఫాల్‌ ఆఫ్‌ ఓపెన్‌ ప్లేస్‌), ఫీనలైజేషన్‌ పన్ను, సర్‌ఛార్జీ పన్నులు చెల్లించాలి. ఇది మొత్తం రూ.లక్షల్లో ఉంటుంది.

* బ్యాంకుల ద్వారా రుణం లభించదు.

* భవిష్యత్తులో స్థలాలపై న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయి

* ఆక్రమణలకు అవకాశం ఉంటుంది.

* రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు స్తంభాలు, ఇతర మౌలిక వసతులు ఉండవు

ఎలా గుర్తించాలి

* కొంత మంది స్థిరాస్తి వ్యాపారులు లేఅవుటు అనుమతులున్నాయని వినియోగదారులను మోసం చేస్తున్నారు.

* లేఅవుటు అనుమతి పొందితే డీపీ నెంబరు అడగాలి. ఇది కలిగి ఉంటేనే అనుమతి ఉన్నట్లు గుర్తించాలి..

* లేఅవుటు కాలనీ నక్షా (ప్లాన్‌) చూడాలి.

* పార్కులు, ఖాళీ స్థలాల వివరాలు పరిశీలించాలి

* అంతర్గత రహదారి ప్లాన్‌లో చూసుకోవాలి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని