logo

మోడువారిన జాతీయ రహదారి!

హైదరాబాద్‌- వరంగల్‌ నగరాలను కలిపే జాతీయ రహదారి 163 ప్రారంభమై రెండున్నరేళ్లు పూర్తవుతోంది. ఒకప్పుడు భారీ వృక్షాలతో కళకళలాడింది. ఇప్పుడు ఇరువైపులా ఇప్పుడు ఒక్క చెట్టూ కనిపించదు.

Published : 06 Feb 2023 04:23 IST

విస్తరించారు.. పచ్చదనం మరిచారు!
ఈనాడు, వరంగల్‌

ఇది నాలుగు వరుసలుగా విస్తరించిన జాతీయ రహదారి. దీనికి ఇరువైపులా ఒక్క పెద్ద చెట్టు కూడా కనిపించదు..

హైదరాబాద్‌- వరంగల్‌ నగరాలను కలిపే జాతీయ రహదారి 163 ప్రారంభమై రెండున్నరేళ్లు పూర్తవుతోంది. ఒకప్పుడు భారీ వృక్షాలతో కళకళలాడింది. ఇప్పుడు ఇరువైపులా ఇప్పుడు ఒక్క చెట్టూ కనిపించదు.

విస్తరణలో భాగంగా సుమారు 4700 భారీ వృక్షాలను నరికేశారు. ఇందులో వందల సంఖ్యలో వేప చెట్లు ఒక్కోటీ 50 ఏళ్ల పైబడినవి ఉండేవి. జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ).. చెట్లను తొలగించినందుకు ‘వాల్టా’ చట్టం కింద ఒక్కోదానికి రూ.500 పరిహారం అటవీశాఖకు చెల్లించింది. ఒక్కటి నరికేస్తే దాని స్థానంలో రెండు మొక్కలను పెంచాలనే నిబంధన ఉంది. రహదారి పనులు పూర్తయ్యాక అటవీ శాఖ నామమాత్రంగా మొక్కలను పెట్టి వదిలేసింది. వారి నిర్లక్ష్యం వల్ల అవి ఇప్పటికీ ఎదగలేదు.  


ఉద్యమం చేసినా లాభం లేదు

ఒకప్పుడు వరంగల్‌- హైదరాబాద్‌ జాతీయ రహదారికి ఇరువైపులా మర్రి, రావి, వేప లాంటి అనేక వృక్షాలు ఉండేవి. వాహనదారులు ప్రయాణంలో అలసట చెందితే కాసేపు పక్కకు నిలిపి, వాటి కింద సేదదీరేవారు. దీన్ని విస్తరించే సమయంలో భారీ వృక్షాలను తొలగించకుండా 2017లో ‘నీమ్స్‌ చిప్కో’ అనే స్వచ్ఛంద సంస్థ పెద్ద ఉద్యమమే చేపట్టింది. ఇందులో వరంగల్‌ నిట్ విద్యార్థులు భాగస్వాములయ్యారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో చెట్లను నరికేసే చోటకు వెళ్లి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. నరికివేయకుండా భారీ వృక్షాలను మరోచోటికి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాలని లోకాయుక్తను కూడా ఆశ్రయించారు. అధికారులు ఇవేవీ పట్టించుకోలేదు. మరోవైపు మళ్లీ మొక్కలను పెంచుతున్నారంటే అదీ లేదు. ఇటీవల కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ రహదారి మధ్యలో సుందరీకరణలో భాగంగా మొక్కలను పెంచుతోంది. ఇప్పటికే ఆరేపల్లి నుంచి పెద్దపెండ్యాల వరకు పనులు పూర్తయ్యాయి. ఇరువైపులా రావాల్సిన భారీ వృక్షాలు మాత్రం ఇప్పట్లో పెరిగే పరిస్థితి కనిపించడం లేదు.


మరోచోటికి మార్చవచ్చు

వృక్షాలను నరికేయడం తప్పకుంటే వాటిని మరో చోటికి మార్చే సాంకేతికత కూడా అందుబాటులోకి వచ్చింది. దీన్ని ట్రాన్స్‌లొకేషన్‌ అంటారు. ఇటీవల హైదరాబాద్‌ బీజాపూర్‌ జాతీయ రహదారి విస్తరణ సమయంలో కొన్ని వృక్షాలను అధికారులు, పర్యావరణ ప్రేమికుల సహకారంతో మరోచోటికి మార్చారు. వరంగల్‌ పాత కారాగారం కూల్చేసి ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. ఇక్కడ కూడా అనేక వృక్షాలను నరికేయకుండా ఈ ఆవరణలో మరోచోటికి మార్చారు.


ప్రత్యామ్నాయాలు వెతకాలి
- కొలిపాక ప్రకాశ్‌, వరంగల్‌

రహదారుల విస్తరణ అభివృద్ధిలో భాగమే. ఈ నెపంతో వందల ఏళ్లనాటి చెట్లను నరికేస్తున్నారు. మళ్లీ మొక్కలను పెట్టి సంరక్షించడంలో ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదు. ఇప్పుడు వికారాబాద్‌ వద్ద మర్రి చెట్లను తీసేసేందుకు రంగం సిద్ధమైతే నేను ఓరుగల్లు నుంచి మన్నెగూడెం వరకు పాదయాత్ర చేశాను. భవిష్యత్తు తరాలకు ఆస్తిపాస్తులు ఇవ్వకున్నా, మంచి పర్యావరణాన్ని కానుకగా ఇవ్వాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు