Telangana Budget 2023: ఆశలు నెరవేరేనా.. ప్రగతి అడుగులు పడేనా!
శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దీనిపై ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు గంపెడాశలు పెట్టుకున్నారు.
బడ్జెట్ కేటాయింపులపై ఓరుగల్లు వాసుల ఎదురుచూపులు
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి
శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దీనిపై ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధికల్పన, తదితర రంగాలకు పెద్దపీట వేయాలని కోరుతున్నారు.
విద్యకు ప్రాధాన్యం!
మన ఊరు- మనబడి కార్యక్రమం కింద పాఠశాల విద్యను బలోపేతం చేస్తోన్న ప్రభుత్వం ఈసారి దీనికి పెద్దఎత్తున నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి దశలో 1165 పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. నిధుల లేమితో పనులు జాప్యం అవుతున్నాయి. రెండో దశలో మరిన్ని పాఠశాలలను కేటాయిస్తే మౌలిక వసతులు మెరుగవుతాయి.
వైద్యం మెరుగు పడేనా..
మహబూబాబాద్ జిల్లాలో వైద్య కళాశాల నిర్మాణం పూర్తయ్యింది. ములుగు, భూపాలపల్లి, జనగామకు మంజూరైన వైద్యకళాశాల నిర్మాణాలు, మౌలిక సదూపాయాలకు నిధులు కేటాయించాల్సి ఉంది. అలాగే తొర్రూరు, మరిపెడ, ఏటూరునాగారం, మహదేవాపూర్, చిట్యాల, వెంకటాపురం సీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
పరిశ్రమలకు నిధులివ్వాలి..
* జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కల్లెంలో టెక్స్‌టైల్ పార్కులో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో పరిశ్రమల ఏర్పాటులో జాప్యం అవుతోంది.
* జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో లెదర్ పార్కు తెరిపించాలని స్థానికులు ఏళ్లుగా కోరుతున్నారు
* ములుగు జిల్లా మంగపేట మండలంలోని బిల్టు కర్మాగారం పునఃప్రారంభానికి ఏడేళ్లుగా కార్మికులు నిరీక్షిస్తున్నారు.
* ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాట్లపై కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. వీటి ఏర్పాటుకు ఉమ్మడి జిల్లాలో అనేక అవకాశాలున్నాయి. ఈసారి నిధులు వస్తే పనులు ముందుకు సాగుతాయి..
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలి..
వెంకటాపురం మండలంలో పాలెంవాగు ప్రాజెక్టు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయమే ప్రధాన ఆధారం. దాదాపు 12 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మిరప, తదితర పంటలు పండిస్తున్నారు. ఏటా రైతన్నకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అసంపూర్తి సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయిస్తే సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది.
* జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రధాన పనులు పూర్తయినా డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వలు, చెరువుల అనుసంధానం చేయాల్సి ఉంది.
* దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనులు పూర్తికాలేదు. ఇది పూర్తయితే పూర్తిస్థాయి ఆయకట్లు 6 లక్షల ఎకరాలకు నీటిని అందించవచ్చు. భూసేకరణ, కెనాల్, పెండింగ్ పనులకు నిధులు కేటాయించాలి.
* జనగామ జిల్లాలో దేవాదుల, ఎస్సారెస్పీ డిస్ట్రిబ్యూటరీ కాల్వలు పూర్తిచేయాలి.
* వెంకటాపురం మండలంలోని పాలెంవాగు ప్రాజెక్టును రూ.221 కోట్లతో మొదలుపెట్టారు. ఇప్పటివరకు రూ.204 కోట్లు ఖర్చు చేశారు. పెండింగ్ నిధులు కేటాయిస్తే మిగిలిన 18 కిలోమీటర్ల పిల్ల కాల్వలు పూర్తవుతాయి. జలాశయం వద్ద వంతెనను నిర్మించే పనులు పూర్తిచేస్తారు.
* వాజేడు మండలంలోని మోడికుంట వాగు ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు కూడా వచ్చాయి. నిధులు కేటాయిస్తే పనులు పట్టాలెక్కనున్నాయి.
రుణమాఫీపై..
ఉమ్మడి జిల్లా రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు రూ.1000 కోట్లు అవసరం ముంది. రూ.25 వేల వరకు రుణాలు మాఫీ కాగా ఆపైన రుణాలున్నవారు నిరీక్షిస్తున్నారు.
సొంత గూడు రావాలి..
ఉమ్మడి జిల్లాలో 21 వేల రెండు పడక గదుల ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 12 వేల వరకు పూర్తిచేశారు. కొన్నిచోట్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తికాక కేటాయించలేదు. నిధులు కేటాయిస్తే పెండింగ్ ఇళ్లు పూర్తయ్యే అవకాశం ఉంది. సొంత స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు మంజూరు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ పథకానికి నిధులు కేటాయిస్తే వేలాది మంది సొంతింటి కల నెరవేరుతుంది.
పర్యాటకం..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బొగత, లక్నవరం, పాండవులగుట్టలు, తదితర పర్యాటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ కనీస వసతులు కరవయ్యాయి. నిధులు కేటాయిస్తే ఎన్నో అద్భుత ప్రదేశాలకు పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
మరిన్ని..
* మహబూబాబాద్‌లో 2వ ఆర్వోబీకి రాష్ట్ర వాటా కింద 30 శాతం నిధులు కేటాయించాల్సి ఉంది. ఈ బడ్జెట్‌లో కేటాయిస్తే పనులు ప్రారంభమవుతాయి.
* జనగామ రంగప్ప చెరువు సుందరీకరణ, బండ్ విస్తరణ చేస్తే పది గ్రామాలవారికి రవాణాకు సులువు అవుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Crime News
కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని
-
Ap-top-news News
ఎమ్మెల్యే అనిల్ ఫ్లెక్సీకి పోలీసుల పహారా