logo

Telangana News: కొడుకుకి ఆస్తి కట్టబెట్టి.. ఉద్యోగం ఇప్పించినా..!

30 ఏళ్లు సింగరేణిలో పనిచేశారు.. ముందస్తు పదవీవిరమణ చేశారు.. వారసత్వం కింద కొడుకుకు ఉద్యోగం ఇప్పించారు.. వృద్ధాప్యంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదు.

Updated : 07 Feb 2023 09:27 IST

ఆవేదన వ్యక్తం చేస్తున్న గందె వెంకటయ్య, లక్ష్మి

30 ఏళ్లు సింగరేణిలో పనిచేశారు.. ముందస్తు పదవీవిరమణ చేశారు.. వారసత్వం కింద కొడుకుకు ఉద్యోగం ఇప్పించారు.. వృద్ధాప్యంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదు. ఇది ఓ కుమారుడి ఘనకార్యానికి తండ్రి పడుతున్న ఆవేదన.. కని పెంచి పెద్దచేసింది.. ఇటీవల గుండె శస్త్ర చికిత్సకు రూ.10లక్షలు ఖర్చయింది.. ఆదరించమని అడిగితే కొట్టి పంపించాడు.. ఇది తల్లి ఆవేదన.. వివరాల్లోకెళ్తే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన గందె వెంకటయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. వెంకటయ్య సింగరేణిలో పని చేశారు. అదే ఉద్యోగాన్ని ముందస్తు పదవీవిరమణ చేసి కొడుకు రవికి కట్టబెట్టారు. ప్రస్తుతం రవి భూపాలపల్లిలోని సింగరేణిలో పని చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి సంపాదించిన రెండున్నర ఎకరాల భూమినీ ఇచ్చారు. తీరా వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులను చూసుకోవడం లేదు. లక్ష్మీకి ఇటీవల గుండెకు శస్త్రచికిత్స అయింది. రూ. 10 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇందుకోసం అప్పులు చేశారు. వాటిని తీర్చమంటే దుర్భాషలాడుతూ కొట్టి ఇంటి నుంచి పంపించాడా కొడుకు. చేసేది ఏం హనుమకొండ జిల్లా కాజీపేటలో ఉంటున్న కూతురు వద్దకు వచ్చారు. తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తన కుమారుడిలో మార్పు తీసుకొచ్చి.. మంచిగా చూసుకునేలా చూడాలని కోరుతూ వృద్ధ దంపతులు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో పాలనాధికారి సిక్తా పట్నాయక్‌కు వినతి పత్రం అందించారు. దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్‌ సమస్యకు పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు.

న్యూస్‌టుడే, హనుమకొండ కలెక్టరేట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని