logo

గురుకుల విద్యాలయంలో ర్యాగింగ్‌

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాలయంలో తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల మధ్య ర్యాగింగ్‌ జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 07 Feb 2023 06:04 IST

భూపాలపల్లి, న్యూస్‌టుడే : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాలయంలో తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల మధ్య ర్యాగింగ్‌ జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినీ ఫక్కీలో ఒక్కో విద్యార్థిని గదిలోకి తీసుకెళ్లి పదో తరగతి విద్యార్థులు దాడులకు పాల్పడినట్లు బాధిత విద్యార్థుల తల్లితండ్రులు తెలిపారు. ఈ ఘటన గత శనివారం రాత్రి 12 గంటలకు జరిగింది. గాయాలకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనార్టీ గురుకుల విద్యాలయంలో 394 మంది విద్యార్థులు చదువుతున్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు కింది అంతస్థు గదుల్లో, పదో తరగతి విద్యార్థులు మొదటి అంతస్థులోని గదుల్లో రాత్రి పూట నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో తొమ్మిదో తరగతి విద్యార్థుల గదిలోకి కొందరు పదో తరగతి విద్యార్థులు వచ్చి, వారిని నిద్రలేపి ఒక్కొక్కరిని మొదటి అంతస్థులోని గదిలోకి తీసుకెళ్లి.. సిగరెట్లు తేవాలని, డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ చేతులతో దాడులకు పాల్పడినట్లు తెలిపారు. ఇందులో ఓ విద్యార్థి ఎడమ చేయిపై గాయమైంది. ఇలా మొత్తం 11 మంది విద్యార్థులపై ర్యాగింగ్‌ చేసినట్లు తెలిసింది. తరగతి గదిలో సెల్‌ఫోన్లు వినియోగించడం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న రీజినల్‌ లెవల్‌ కన్సల్టెన్సీ(ఆర్‌ఎల్‌సీ) శ్రీపాల, విజిలెన్స్‌ అధికారులు సయ్యద్‌ మగ్బూల్‌ పాషా, అమ్జత్‌ అలీ చేరుకుని సోమవారం గురుకుల విద్యాలయంలో విచారణ చేపట్టారు. ఘటనపై పూర్తిగా విచారించిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆర్‌ఎల్‌సీ శ్రీపాల ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని