logo

భూ హక్కు.. ఎప్పటికి దక్కు!

చిన్న, సన్నకారు రైతులకు సాదాబైనామా దరఖాస్తుల ద్వారా భూ హక్కు లభిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.

Published : 07 Feb 2023 06:04 IST

సాదాబైనామా దరఖాస్తులకు మోక్షమెప్పుడో..?
న్యూస్‌టుడే, భూపాలపల్లి

మీ సేవ కేంద్రం వద్ద సాదాబైనామా దరఖాస్తులు చేసుకునేందుకు వచ్చిన రైతులు (పాతచిత్రం)

చిన్న, సన్నకారు రైతులకు సాదాబైనామా దరఖాస్తుల ద్వారా భూ హక్కు లభిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. 2014 జూన్‌ 2 కంటే ముందు సాదాబైనామా కింద కొనుగోలు చేసిన భూములకు హక్కులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.. తెల్లకాగితాలు, స్టాంప్‌ కాగితాలు, నోటిమాట ద్వారా రిజిస్టర్‌ కాకుండా దస్తావేజుల ద్వారా భూములు కొనుగోలు చేసుకున్న రైతులు మీ సేవ కేంద్రాల్లో రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాదాబైనామా దరఖాస్తులను స్వీకరించారు. ఎలాంటి రిజిస్ట్రేషన్‌ రుసుం లేకుండా కేవలం యూజర్‌ ఛార్జీలు మాత్రమే తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. అటు ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం రాగా, మీ సేవ కేంద్రాల నిర్వాహకులు కొందరు రహస్యంగా దస్తావేజుల విక్రయాలు జరిపి జేబులు నింపుకొన్నారు. కానీ, నేటికీ ఒక్కటంటే ఒక్క సాదా బైనామా దరఖాస్తుకు పట్టా మంజూరు కాకపోవడం శోచనీయం.. తాజాగా పోడు భూముల దరఖాస్తులకు హక్కు పత్రాలు ఇచ్చే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సాదాబైనామా దరఖాస్తులను కూడా ప్రభుత్వం ఎప్పుడు పరిష్కరిస్తుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు. సాదాబైనామా కింద కొనుగోలు చేసిన భూములకు చట్టబద్ధత కోసం ప్రభుత్వం 2020 నవంబరు 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరించిన విషయం తెలిసిందే. జిల్లాలోని 11 మండలాల నుంచి మొత్తం 51,347 దరఖాస్తులు వచ్చాయి. పలిమెల మండలంలో అతి తక్కువగా 384 దరఖాస్తులు రాగా, అత్యధికంగా భూపాలపల్లి మండలంలో 14,150 దరఖాస్తులు వచ్చాయి. 2016లో తొలిసారిగా అవకాశం కల్పించడంతో వేలాది మంది రైతులు లబ్ధిపొందారు. రెండేళ్లుగా సాదాబైనామా భూ పత్రాల జారీలో అడ్డంకులు లేకపోగా, ధరణి పోర్టల్‌లో నమోదైన సమాచారంతో భూములు చేతులు మారుతున్నాయని బాధితులు ఆందోళన చెందుతున్నారు.

ఆంక్షల తిరకాసు

భూ రికార్డుల యాజమాన్య హక్కులు(ఆర్వోఆర్‌) చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం లేకపోవడంతో 1971 ఆర్వోఆర్‌ చట్టంలోని క్లాజ్‌లను చేరుస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన రెవెన్యూ చట్టంలో క్రమబద్ధీకరణకు సంబంధించి విధి విధానాలు లేవు. కొత్త చట్టాన్ని సవరించాలనే ప్రయత్నం ముందుకు సాగడం లేదు. భూ హక్కులు పొందేందుకు వివిధ ఆంక్షలు బాధిత రైతులకు శాపంగా మారాయి. చట్టబద్ధత కల్పిస్తే అయిదెకరాల్లోపు వ్యవసాయ భూములను ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం

రెవెన్యూ చట్టం ఆధారంగా ధరిణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి, భూముల క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. కొన్నేళ్ల కిందట కొనుగోలు చేసిన భూములు ఆన్‌లైన్‌లో సదరు పట్టాదారు పేరుతోనే కొనసాగుతున్నాయి. యాజమాన్య హక్కుల మార్పిడి జరగకపోవడంతో పాత యజమానుల వారసులు ధరణి పోర్టల్‌లోని సమాచారం ఆధారంగా భూములను ఇతరులకు విక్రయించే ప్రమాదం ఉంది. ఈ వెసులుబాటుతోనే రికార్డుల్లో పేర్లు మారుతున్నాయని బాధితులు కొందరు ఆందోళన చెందుతున్నారు. భూములను సాగు చేసుకుంటూ, ప్రతిఫలం అనుభవిస్తున్నప్పటికీ పట్టా హక్కులు లభించడం లేదు.

రైతుల ఆశలు ఆవిరేనా..

కొన్ని దశబ్దాల భూ సమస్యలకు సాదాబైనామా ద్వారా పరిష్కారం దొరుకుతుందని ఆశ పడిన చిన్న, సన్నకారు రైతుల ఆశలు ఆవిరయ్యాయి. పట్టా భూములకు మాత్రమే ప్రభుత్వ పథకాలైన రైతుబంధు, రైతు బీమా, బ్యాంకుల్లో రుణాలు వర్తింపజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కూడా అందుతుంది. సాదాబైనామా ద్వారా పట్టాలు వస్తే తాము కూడా ప్రభుత్వ పథకాలు పొందవచ్చనే ఆశలో ఉన్న రైతుల ఆశలు అడియాసగానే మారుతోంది. సాదాబైనామాలో భూ హక్కు కోసం దరఖాస్తు చేసుకొని రెండేళ్లు దాటినా ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారం లభించలేదు. దరఖాస్తుల పరిశీలన, పట్టాల మంజూరుకు సంబంధించి ఇంత వరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందలేదని తహసీల్దార్లు పేర్కొంటున్నారు.


భూమి ఉన్నా హక్కులు లేవు

- శ్రీనివాస్‌రెడ్డి, ఆజంనగర్‌

గ్రామంలోని ఒక సర్వే నంబర్‌లో సాదా బైనామాతో 2.20 ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఆ భూమి అమ్మిన వ్యక్తి వాంగ్మూలం ఇచ్చాడు. ఏళ్ల తరబడి హక్కుల కోసం ఎదురుచూస్తున్నా.. భూమి ఉన్నా పట్టా హక్కులు లేవు. ఏ ఇతర లావాదేవీలకు పనిచేయడం లేదు.


పథకాలు అందక ఇబ్బందులు..

- మాచర్ల రవి, కమలాపూర్‌

తెల్లకాగితంపై రాసుకున్న ఒప్పందంతో ఎకరం భూమిని కొనుగోలు చేశాను. రెండేళ్ల కిందట పట్టా హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నా.. అన్ని ధ్రువపత్రాలను సమర్పించాను. రైతు బంధు, పంట రుణం అందక ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెట్టుబడి అవసరాలకు అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని