logo

ఏజెన్సీ వనరులపై నిర్లక్ష్యం..!

కొత్తగూడ మండలం ఏజెన్సీలో నిక్షేప వనరులు మెండుగా నెలకొన్నాయి.. వనరుల సద్వినియోగంతో ఇక్కడి గిరిజనులకు ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.

Published : 07 Feb 2023 06:04 IST

గంగారం మండలం మడగూడలోని వాగు వద్ద చైనాక్లేను తవ్వి బయటకు తీసుకొస్తున్న మహిళ

కొత్తగూడ, న్యూస్‌టుడే: కొత్తగూడ మండలం ఏజెన్సీలో నిక్షేప వనరులు మెండుగా నెలకొన్నాయి.. వనరుల సద్వినియోగంతో ఇక్కడి గిరిజనులకు ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో బొగ్గు, చైనాక్లే (తెల్లబంకమట్టి) నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నిక్షేపాల వినియోగంపై పాలకులు దృష్టిసారించడంపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉపాధి అవకాశాల కోసం ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ చర్యతో ఏజెన్సీ గ్రామాల్లోని ఆదివాసీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్థికంగా పురోభివృద్ధిని పొందుతారు. పోడు వ్యవసాయం, ఇతర అటవీ ఉత్పత్తులపై ఆధారపడుతూ జీవించే ఆదివాసీలకు ఇక్కడి వనరులతో ఉపాధి మార్గాలను చూపించేందుకు అనువైన ప్రాంతంగా కొత్తగూడ, గంగారం మండలాలున్నాయి. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి అవకాశాలను కల్పించాలని స్థానిక ఆదివాసీలు కోరుతున్నారు.

మడగూడలో ‘చైనాక్లే’ నిక్షేపాలు

గంగారం మండలం మడగూడ గ్రామ శివారులో చైనాక్లే నిక్షేపాలు పుష్కలంగా నెలకొన్నాయి. ఈ ప్రాంతపు గిరిజనులు ఉపాధి పొందేందుకు వాగుల ప్రాంతంలో తేలిన చైనాక్లే నిక్షేపాలను తవ్వి వెలికి తీసి సున్నంరాయిగా భావించి వినియోగిస్తున్నారు. కొందరు చాలా తక్కువ ధరకు వీటిని విక్రయిస్తుండడంతో వీరి కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదు. ఇక్కడి నిక్షేపాలను పరీక్షించిన భూగర్భశాఖ అధికారులు ఇవి సున్నంరాయి కాదని నాణ్యమైన ‘చైనాక్లే’ నిక్షేపమని పేర్కొన్నారు. దీని ద్వారా సిరామిక్‌ పరిశ్రమలు నెలకొల్పవచ్చని సూచించారు. కప్పులు, సాసర్లు, గ్లాసులు, టైల్స్‌ లాంటి పరికరాలను ఉత్పత్తి చేయవచ్చన్నారు.

బొగ్గు వెలికితీతో ఉపాధి

కొత్తగూడ, గంగారం మండలాల్లోని గ్రామాల్లోని భూగర్భంలో బొగ్గునిల్వలు ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. భూగర్భంలోని బొగ్గు నిక్షేపాలు కొన్ని ప్రాంతాల్లో భూమిపై పొర కిందనే దర్శనమిస్తున్నాయి. పూనుగొండ్ల గ్రామశివారులోని పుల్సంవాగులో వరద తీవ్రతకు కోతకు గురైనా వాగులో బొగ్గు నిల్వలు బయటపడ్డాయి. కొత్తగూడ, గంగారం మండలంలోని భూగర్భంలో బొగ్గు నిక్షేపాలున్నట్లు అధికారులు గుర్తించారు. పూనుగొండ్లవాగులోని బొగ్గునిక్షేపాలను పలువురు అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి.


ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం

- నరేశ్‌, జిల్లా మైనింగ్‌ అధికారి

మడగూడలోని చైనాక్లే నిల్వలపై  ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా. స్థానికంగా పరిశ్రమలు నెలకొల్పి స్థానికులు ఉపాధి పొందేలా చర్యలు చేపడతాం. మడగూడలోని చైనాక్లే నిల్వల ప్రాంతాన్ని సందర్శించి చర్యలను వేగవంతం చేస్తాం.


ఉపాధి అవకాశాలు కల్పించాలి

- బచ్చల వెంకటయ్య, పందెం

మండలంలోని ప్రజలకు ఉపాధి మార్గాలు చూపించాలి. యువకులు ఉపాధి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈమేరకు ప్రత్యేక కార్యాచరణ చూపాలి. స్థానిక వనరులపై దృష్టి సారించి ఉపాధి అవకాశాలు కల్పించాలి.


పోడుసాగుపై ఆధారపడుతున్నాం

- బూర్క యాదగిరి, గంగారం

ఏజెన్సీ గిరిజనులకు ఉపాధి అవకాశాలేపోవడంతోనే పోడు వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. ఉపాధి మార్గాలు చూపిస్తే యువత ఆర్థిక ఇబ్బందులు పడకుండా వారి తల్లిదండ్రులపై భారంగా పడకుండా ఉంటారు. మడగూడలోని నిక్షేపాలపై పరిశ్రమలు నెలకొల్పేందుకు రాజకీయ పార్టీ నేతలు దృష్టిసారించి గిరిజన యువతకు ఉపాధి మార్గాలను చూపించాలి.


పరిశ్రమ ఏర్పాటు చేయాలి

- యాప భద్రమ్మ, మడగూడ మాజీ సర్పంచి

గ్రామంలో ఉన్నటువంటి సున్నంరాయి వెలికితీతపై ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలి. ఇక్కడి గిరిజనులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఉపాధి కోసం సున్నం రాయిని సేకరించి పట్టణప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించి ఉపాధి పొందుతారు. నిక్షేపాల వినియోగం ప్రభుత్వం దృష్టిసారించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని