logo

భార్య, కొడుకుపై హత్యాయత్నం

కట్టుకున్న భార్య, కన్న కుమారుడిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి ఒడిగట్టిన ఓ వ్యక్తి ఘటన సోమవారం వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం చంద్రాయపల్లిలో చోటుచేసుకుంది.

Published : 07 Feb 2023 06:04 IST

నిందితుడు కోటిలింగం

నర్సంపేట రూరల్‌, న్యూస్‌టుడే: కట్టుకున్న భార్య, కన్న కుమారుడిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి ఒడిగట్టిన ఓ వ్యక్తి ఘటన సోమవారం వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం చంద్రాయపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన మేరకు.. చంద్రయ్యపల్లికి చెందిన నిడిగొండ కోటిలింగం, విజయ దంపతులకు కుమారుడు ప్రవీణ్‌, కుమార్తె ఉన్నారు. ఈ దంపతులు 2005లో బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. కోటిలింగం అక్కడే కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా, విజయ వంట మనిషిగా పనిచేస్తున్నారు. తనయుడు ప్రవీణ్‌ హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ వరంగల్‌లో డిగ్రీ చదువుతున్నాడు. కోటిలింగం అనుమానంతో నిత్యం భార్యను వేధించేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగిన క్రమంలో పలుమార్లు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో దంపతుల మధ్య ఇదే విషయమై మరోసారి గొడవ జరిగింది. దీంతో అక్కడి నుంచి వచ్చిన వారు ఆదివారం స్వగ్రామమైన చంద్రయ్యపల్లిలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. భర్త పెట్టే వేధింపులు భరించలేనని, తనకు విడాకులు కావాలని విజయ పెద్ద మనుషులను కోరారు. మరోసారి పంచాయితీ పెడదామని పెద్ద మనుషులు చెప్పగా సరేనని ఇంటికెళ్లారు. సోమవారం పెద్ద మనుషుల వద్దకు భార్య విజయ కుమారుడు ప్రవీణ్‌ వెళ్లగా అక్కడికి ద్విచక్ర వాహనంపై వచ్చిన కోటిలింగం, తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో భార్య విజయ గొంతులో పొడిచాడు. అడ్డుకునేందుకు వెళ్లిన కుమారుడు ప్రవీణ్‌ కడుపులో బలంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయి ఉన్న వారిని చూసి భయంతో కోటిలింగం అక్కడి నుంచి పరారయ్యాడు. కత్తిపోట్లకు గురైన తల్లి, కుమారుడిని స్థానికులు ఆటోలో నర్సంపేటలోని సివిల్‌ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స జరిపి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వరంగల్‌ ఎంజీఎంలో చేర్పించారు. ఎస్సైలు సురేష్‌, రవీందర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

విజయ ప్రవీణ్‌

దాడిలో వాడిన కత్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని