logo

పేరుకే జిల్లా ఆసుపత్రి!

ములుగు జిల్లా ఆసుపత్రిని నిధుల కొరత వెంటాడుతోంది. రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ నిధుల కొరతతో ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోవడం లేదు.

Published : 07 Feb 2023 06:04 IST

సీహెచ్‌సీ స్థాయిలోనే నిధుల కేటాయింపు

ములుగు ఏరియా ఆసుపత్రి

ములుగు, న్యూస్‌టుడే: ములుగు జిల్లా ఆసుపత్రిని నిధుల కొరత వెంటాడుతోంది. రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ నిధుల కొరతతో ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోవడం లేదు. జిల్లా ఆసుపత్రిగా ఉన్నతీకరించినప్పటికీ ప్రభుత్వం ఇంకా సామాజిక ఆరోగ్య కేంద్రంగానే భావిస్తోంది. అదే తరహాలో నిధులు కేటాయిస్తోంది.

నిర్వహణ భారం

ఆసుపత్రికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రోజుకు సుమారు 500 మంది రోగులు వస్తుంటారు. అలాంటి వారికి నిధుల కొరతతో కనీస వసతుల కల్పన కష్టంగా మారుతోంది. ఆసుపత్రిలో ఎలాంటి లోటు ఉండకూడదనే ఉద్దేశంలో జిల్లా కలెక్టర్‌ కృష్ణఆదిత్య పూర్తి స్థాయిలో సహకరిస్తుండడంతో మనుగడ సాగుతోంది. జిల్లా ప్రజలకు ఆసుపత్రి పెద్దదిక్కుగా మారడంతో రోగులు అధిక సంఖ్యలో వస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏటూరునాగారం, వెంకటాపురం లాంటి సామాజిక ఆరోగ్య కేంద్రాల నుంచి సిఫారసు చేసిన వారు కూడా వస్తుంటారు. ప్రభుత్వం నుంచి అనుమతి లేకున్నా ఆసుపత్రిలో ఐసీయూ కేంద్రాన్ని అధునాతన యంత్రాలతో నడిపిస్తున్నారు. 100 పడకలు, సీటీ స్కాన్‌, అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌, డిజిటల్‌ ఎక్స్‌రే, సుమారు 50 రకాల పైగా రక్త పరీక్షలు నిర్వహించే టీ హబ్‌, కాన్పులతో పాటు, వివిధ రకాల సర్జరీలు చేయడం లాంటి వసతులు అందుబాటులో ఉండడంతో ప్రజలు వైద్యం కోసం ఎంతో ఆశతో వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రి నిర్వహణ బాధ్యత మరింత భారంగా మారుతోంది. ప్రభుత్వం స్పందించి జిల్లా ఆసుపత్రి స్థాయిలో నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.

ఏడాదికి బడ్జెట్‌ రూ.2.50 లక్షలే..

జిల్లా ఆసుపత్రిని ప్రభుత్వం సామాజిక ఆరోగ్య కేంద్రంగా పరిగణిస్తూ ఏడాదికి ఒకసారి రూ. 2.50 లక్షలు మాత్రమే బడ్జెట్‌ కేటాయిస్తోంది. దీంతో సామాజిక ఆరోగ్య కేంద్రమా, ఏరియా ఆసుపత్రా, జిల్లా ఆసుపత్రా అనే సందేహాలు జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. కనీసం ఏరియా ఆసుపత్రిగానైనా పరిగణించి నిధులు కేటాయిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా నిధుల కేటాయింపు జరుగుతోంది. ఈ నిధులతో కనీస అవసరాలు, పరికరాల కొనుగోలు, ఆసుపత్రి మరమ్మతులు,  రోగుల సంఖ్యను బట్టి వసతుల కల్పన, స్టేషనరీ కొనుగోలు, ఫ్యాన్లు, ట్యూబులు, మోటార్ల మరమ్మతులు, కొనుగోళ్లు చేసుకోవడానికి ఈ నిధులను ఉపయోగిస్తారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులు ఒకటి లేదా రెండు నెలలకు మాత్రమే సరిపోతోంది. మిగిలిన ఏడాదంతా వచ్చే సంవత్సరం బడ్జెట్‌ కోసం ఎదురు చూపులతోనే గడిచిపోతోంది. 

ప్రభుత్వానికి నివేదించాం -డాక్టర్‌ జగదీశ్వర్‌, సూపరింటెండెంట్‌, జిల్లా ఆసుపత్రి

ములుగు జిల్లా ఆసుపత్రికి సామాజిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయిస్తున్నట్లుగానే నిధులు ఇస్తున్నారు. దీంతో నిర్వహణ భారంగా మారుతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని