logo

తొలిరోజు ఉత్సాహంగా..

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన హాథ్‌సే హాథ్‌ జోడో యాత్ర సోమవారం ములుగు జిల్లా మేడారంలో ఘనంగా ఆరంభమైంది.

Updated : 07 Feb 2023 06:41 IST

వనదేవతల ఆశీర్వాదం
భారీగా తరలివచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులు

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, తాడ్వాయి, గోవిందరావుపేట, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన హాథ్‌సే హాథ్‌ జోడో యాత్ర సోమవారం ములుగు జిల్లా మేడారంలో ఘనంగా ఆరంభమైంది. సమ్మక్క, సారలమ్మ దేవతల ఆశీర్వాదం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క హారతి ఇచ్చి యాత్రను ప్రారంభింపజేశారు. తొలిరోజు భారీ ఎత్తున కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొన్నాయి.

* వనదేవతల దర్శనం అనంతరం రేవంత్‌రెడ్డి ఐటీడీఏ విశ్రాంతి భవనంలో కాసేపు సేదతీరారు. అనంతరం వాహనంలో కొత్తూరు, నార్లాపూర్‌ మీదుగా గోవిందరావుపేట ప్రాజెక్టు నగర్‌కు చేరుకున్నారు. అక్కడ భోజనం చేసి కాసేపు విలేకరులతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.

రేవంత్‌రెడ్డికి హారతి ఇస్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క

అడవి మార్గం గుండా.. చేయిచేయి కలుపుతూ..

ప్రాజెక్టు నగర్‌ నుంచి అటవీ మార్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర కొనసాగింది. కాంగ్రెస్‌ శ్రేణులు ఆయన వెంట పాదం కలిపారు. మార్గమధ్యలో చేయి చేయి కలుపుతూ ప్రజలను ఉత్సాహపరిచారు. మహిళలు, ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగారు. చిన్నారులతో ముచ్చటించారు. ఆదివాసీ సంప్రదాయ డోలీ వాయిద్యాలు, డప్పు చప్పుళ్లతో గ్రామాల్లో స్వాగతం పలికారు. గొత్తికోయ గూడెం వాసులు నడకలో భాగస్వాములయ్యారు. నడక సాగుతుండగా.. వెనుక వందలాది వాహనాలు వరుస కట్టాయి. గోవిందరావుపేట మండలం పస్రాకు చేరుకుని దాదాపు గంటన్నర పాటు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సభ అనంతరం తిరిగి పస్రా నుంచి గోవిందరావుపేట వరకు నడక సాగింది.

యాత్ర సాగిందిలా..

* మధ్యాహ్నం 2:05 గంటలు మేడారం చేరుకున్నారు. * 2:12 వనదేవతల దర్శనం. * 3:39: ప్రాజెక్టు నగర్‌కు.. సాయంత్రం: 6:40 పస్రాలో.. * రాత్రి: 8:30 గోవిందరావుపేటకు చేరుకున్నారు. * 10 గంటలకు  రామప్పకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం రామప్ప నుంచి యాత్ర ప్రారంభం కానుంది.

పస్రా వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న రేవంత్‌రెడ్డి, చిత్రంలో  కాంగ్రెస్‌ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, మధుయాష్కీ

తొలి మొక్కు చెల్లింపు..

ములుగు, ములుగు రూరల్‌:  రేవంత్‌రెడ్డి  గట్టమ్మ గుడి వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రేమ్‌నగర్‌ సమీపంలోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి మేడారం వెళ్లారు.

ముఖ్యాంశాలు..

* గోవిందరావుపేటలో పోచమ్మ గుడివద్ద కాంగ్రెస్‌ నాయకులు రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. బీసీ బాలికల వసతి గృహం వద్ద బాలికలను ఆయన ఆప్యాయంగా పలకరించారు. * కమ్మ సేవా సంఘం కళ్యాణ మండపంలో రేవంత్‌రెడ్డి, సీతక్కను సన్మానించారు. అనంతరం బస్టాండ్‌ సమీపంలో ఇందిరగాంధీ విగ్రహానికి పూలమాల వేశారు.  * యాత్ర ఉదయం 11 గంటలకు ఆరంభం కావాల్సి ఉన్నా.. మేడారానికి 2 గంటలకు చేరుకున్నారు. * మొదటిరోజు 11 కిలోమీటర్ల పాదయాత్ర సాగగా.. మొత్తం యాత్ర 52 కిలోమీటర్లు పూర్తిచేశారు. * పాలంపేటలోని రామప్ప ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గుడారాల్లో బస చేశారు.

గర్వంగా భావిస్తున్నా..

పస్రా(గోవిందరావుపేట): రేవంత్‌రెడ్డి మేడారం నుంచి యాత్ర ప్రారంభించడాన్ని గర్వంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. పస్రాలో ఆమె మాట్లాడుతూ అధికారాన్ని హస్తగతం చేసుకునే వరకు ఇది సాగాలన్నారు. తనని ఎంతో అభిమానంతో ఆదరించి అక్కున చేర్చుకున్న నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ఇదే ఆదరణ తన సోదరుడు రేవంత్‌పై కూడా చూపించాలని కోరారు.

తెలంగాణ ముసుగులో లబ్ధిపొందారు..

సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయంగా లబ్ధి పొందారని మధుయాస్కీ గౌడ్‌ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ నాందేడ్‌లో సభ నిర్వహించి శ్రీరాంసాగర్‌ నీళ్లు దోచుకెళ్లమని చెప్పడం అత్యంత దారుణమని ఆరోపించారు. కల్వకుంట్ల కవిత దిల్లీ లిక్కర్‌ స్కాంలో చిక్కుకోవడం వారి అవినీతికి పరాకాష్ఠ అని అన్నారు. ఆడబిడ్డ అంటే ఎమ్మెల్యే సీతక్కలా ఉండాలన్నారు.

సభకు హాజరైన జనం


తులాభారం 65 కిలోలు

రేవంత్‌రెడ్డి తులాభారం వేయించి  వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. దీనిని తూకం వేయగా  65 కిలోలు వచ్చింది.  సంబంధిత రుసుమును ఆయన సిబ్బంది దేవాదాయశాఖ అధికారులకు చెల్లించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని