logo

ఓరుగల్లు.. పద్దులో మనిల్లు!

ప్రతి ఇంటికి నెలవారీ ఆదాయ వ్యయాల లెక్క ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం అలాగే ఏడాదికోసారి బడ్జెట్‌ రూపంలో వివిధ శాఖలకు నిధులు కేటాయిస్తుంది.

Published : 07 Feb 2023 06:04 IST

ఈనాడు, వరంగల్‌

ప్రతి ఇంటికి నెలవారీ ఆదాయ వ్యయాల లెక్క ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం అలాగే ఏడాదికోసారి బడ్జెట్‌ రూపంలో వివిధ శాఖలకు నిధులు కేటాయిస్తుంది. పింఛన్లకు నిధులంటే ఇంట్లో నానమ్మ, తాతయ్యలు, విద్యా రంగానికైతే పిల్లలకు మేలు కలుగుతుంది. వైద్యానికైతే ఇంటిల్లిపాదీ వర్తిస్తుంది. సాగునీరు, విద్యుత్తు, వ్యవసాయానికి కేటాయింపులతో రైతన్నకు లబ్ధి చేకూరుతుంది.  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ పద్దును మనం ఓ ఇంటికి, ఊరికి అన్వయించుకుంటే ప్రభుత్వం ప్రకటించిన నిధులు, ఆయా శాఖల స్థానిక లబ్ధిదారులు ఇలా ఉంటారు.


నీటి పారుదల రంగం

‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే అపూర్వ ఘట్టం.’

దేవాదుల ఎత్తిపోతలలో నిర్మించిన సొరంగం

* మొత్తం కేటాయింపు  రూ.26,885 కోట్లు
* మనకు ప్రయోజనమిలా.. దేవాదుల ప్రాజెక్టును ఈ ఏడాది జూన్‌ వరకు పూర్తి చేస్తామంటున్నారు. భూసేకరణకు నిధుల కొరత ఉంది. రెండు, మూడు దశల్లో పనులు మిగిలి ఉన్నాయి. కాళేశ్వరంతో పాటు ఈ ప్రాజెక్టుకు నిధులు  రానున్నాయి. ఎస్సారెస్పీ స్టేజ్‌ 1, స్టేజ్‌ 2లల్లో కాలువకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది.


విద్యకు ప్రాధాన్యం

‘రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది’

హనుమకొండలో లష్కర్‌ బజార్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

* రూ. 19,093 కోట్లు
* మన ఊరు మన బడి కార్యక్రమం కింద ఉమ్మడి వరంగల్‌లోని మన వందలాది పాఠశాలు బాగుపడ్డాయి. వాటిల్లో మౌలిక వసతులు, మెరుగైన సౌకర్యాలు ఏర్పడనున్నాయి.


రైతన్నకు మంచి రోజులు..

‘సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ నేడు దేశానికి దిశా నిర్దేశం చేస్తోంది’

* రూ. 26,831 కోట్లు * రుణమాఫీని రూ.లక్ష వరకు ప్రకటించారు. మన ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది రైతులకు లబ్ధి కలుగుతుంది.


మన పల్లె ప్రగతికి..

‘పల్లె, పట్టణ ప్రగతి నిధులతోపాటు, ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు కూడా నేరుగా స్థానిక సంస్థల ఖాతాల్లోకి ప్రభుత్వం బదిలీ చేయనుంది’  

* రూ. 31,426 కోట్లు
* మన పల్లెలను బాగు చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ శాఖకు నిధులను పెంచింది. ఇప్పటికే నర్సరీ, పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డు, హరితహారంలో మొక్కల పెంపకం చేపడుతోంది. 15వ ఆర్థిక సంఘం నిధులను వీటికి ఇవ్వడం వల్ల పల్లెలు ప్రగతి పథంలో సాగనున్నాయి.


మన రహదారులు బాగుపడతాయి..

ఇటీవల ప్రారంభమైన మహబూబాబాద్‌ సమీకృత కలెక్టరేట్

‘రాష్ట్ర ప్రభుత్వం 29 జిల్లాల్లో రూ.1581  కోట్లతో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టింది.’

* రూ. 2500 కోట్లు
* హనుమకొండ, జనగామ, మహబూబాబాద్‌లో కొత్త పాలనాప్రాంగణాలు ప్రారంభమయ్యాయి. మిగతా వాటి నిర్మాణానికి నిధులు అందనున్నాయి. కాజీపేట రెండో ఆర్వోబీ నిర్మాణానికి నిధులు రానున్నాయి. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న అనేక రహదారులు బాగుపడనున్నాయి.


చిన్నారులకు పోషకాహారం

‘దేశం సంపూర్ణమైన అభివృద్ధి సాధించాలంటే  అన్ని రంగాల్లో మహిళకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలి.’

* రూ. 2,131 కోట్లు
* మన ఊరిలోని అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో వేల సంఖ్యలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందనుంది. 
 


తాతయ్య, నానమ్మలకు తీపి కబురు

గత బడ్జెట్‌లో చెప్పిన విధంగా 57 ఏళ్లు నిండిన వారికి పింఛను ఇస్తున్నాం.

* రూ.12 వేల కోట్లు
* ఆసరా పింఛన్ల వయసు తగ్గించడం వల్ల మన తాతయ్యలు, నానమ్మలకు మేలు కలుగుతుంది. వీరంతా పింఛను అర్హత సాధించారు. మలి వయసులో ఎలాంటి ఆధారం లేని వారికి ఇది వరంలా ఉంది.


విద్యుత్తు వెలుగులు

‘అన్ని రంగాలకూ 24 గంటల పాటు నిరంతరాయంగా, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ’  

* రూ.12,727 కోట్లు
* ఉత్తర మండల విద్యుత్తు ప్రధాన కార్యాలయం ఓరుగల్లులోనే ఉంది. దీని కింద  ఉమ్మడి వరంగల్‌తో పాటు 16 జిల్లాలు వస్తాయి. బడ్జెట్‌ కేటాయింపుల వల్ల ఆర్థిక వనరులకు ఇబ్బంది ఉండదు. త్రీఫేజ్‌ పునరుద్ధరణకు అవకాశం ఉంది.  మన ఇంటిపై సౌర విద్యుత్తు ఫలకాలు పెట్టుకోవాలనుకుంటే ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.


వైద్యం దగ్గరగా..

‘ప్రతి లక్ష జనాభాకు సగటున 19 ఎంబీబీఎస్‌ సీట్లతో  వైద్య విద్యలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది’

* రూ. 12,161 కోట్లు
* మన మహబూబాబాద్‌లో వైద్య కళాశాలను ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరానికి మన జనగామ, భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లో మెడికల్‌ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ శాఖకు నిధులు పెంచడం వల్ల కళాశాలల ఏర్పాటు వేగంగా జరుగుతుంది.

కేసీఆర్‌  పోషకాహార కిట్లను మొదటి విడతలో గిరిజన ప్రాబల్యం ఉన్న జిల్లాలకు ఇచ్చారు. రెండో దఫాలో అన్ని జిల్లాల్లో ఇచ్చే అవకాశం ఉంది. కంటి వెలుగు మన ఉమ్మడి వరంగల్‌లో రెండో దశ చురుగ్గా సాగుతోంది.


పోలీసు కమిషనరేట్‌ భవన నిర్మాణానికి రూ.10 కోట్లు

వరంగల్‌ పోలీసు కొత్త కమిషనరేట్ నిర్మాణానికి ఈసారి రూ.10 కోట్లు కేటాయించారు. గతేడాది ఇచ్చిన రూ.25 కోట్లతో భవన నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇది పూర్తయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రజలకు మరింత భద్రత కల్పించడంతో పాటు నూతన సాంకేతికతను వినియోగించి, సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు.


కేయూకు స్వల్పంగా పెరుగుదల

కేయూక్యాంపస్‌, న్యూస్‌టుడే:  కాకతీయ విశ్వవిద్యాలయానికి స్వల్పంగా నిధులు పెంచారు. గతేడాది కంటే రూ.9.34 కోట్ల బ్లాక్‌ గ్రాంటు పెరిగింది. నిరుడు రూ.118.21 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.127.55 కోట్లు కేటాయించారు. కేయూ నుంచి రూ.341 కోట్ల ప్రతిపాదనలు వెళ్లాయి. స్వల్పంగా పెరగడంతో అధికారులు, ఉద్యోగుల్లో నిరాశ కనిపిస్తోంది.


మూడు సార్లు ఓరుగల్లు పేరు ప్రస్తావన

ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు  బడ్జెట్‌ ప్రసంగంలో మూడు సార్లు ఉమ్మడి వరంగల్‌ను ప్రస్తావించారు. ఈ విద్యా సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 8 వైద్యకళాశాలలను ప్రారంభించామని చెబుతూ అందులో మహబూబాబాద్‌ పేరు ప్రస్తావించారు. చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం చేపట్టిన చేనేత మిత్రతోపాటు వివిధ పథకాల గురించి వివరిస్తూ.. వరంగల్‌లో కాకతీయ మెగాజౌళి పార్కును ఏర్పాటు చేశామన్నారు. వరంగల్‌లో హెల్త్‌సిటీని రూ.1100 కోట్లతో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.  ఈ ఆసుపత్రి నిర్మాణం వేగంగా పూర్తి చేస్తామని, పేదలకు అత్యంత మెరుగైన, కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.  ఇలా ఓరుగల్లు ప్రస్తావన ముచ్చటగా మూడుసార్లు వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని