అరకొర వసతులు.. తప్పని కష్టాలు!
అంగన్‌వాడీ కేంద్రాల్లో సరిపడా వసతులు లేక చిన్నారులు, లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా కేంద్రాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్, న్యూస్‌టుడే, బయ్యారం
బయ్యారం మండలం నామాలపాడు ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రంలో ఉయ్యాల లేకపోవడంతో ప్రమాదకరంగా ఇనుప బారును పట్టుకొని వేలాడుతున్న చిన్నారులు
అంగన్‌వాడీ కేంద్రాల్లో సరిపడా వసతులు లేక చిన్నారులు, లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా కేంద్రాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. అద్దె భవనాలు చాలా వరకు ఇరుకుగా ఉండడం..సరైన సౌకర్యాలు లేక లబ్ధిదారులు, ప్రీస్కూల్‌కు వచ్చే పిల్లలు అవస్థలు పడుతున్నారు. వీటితో పాటు ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న కేంద్రాల్లోనూ సమస్యలున్నాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో ఒకటికి, రెండుకు సమస్యగా ఉంది. కొన్ని చోట్ల ఆయాలు పిల్లలను తమ ఇంటికి తీసుకెళ్తున్నారు. క్రీడాపరికరాలు పనిచేయకపోవడంతో పిల్లలు ఆటలకు దూరమవుతున్నారు. విద్యుత్తు సౌకర్యం లేని కేంద్రాలున్నాయి. సదుపాయం కల్పించాలని ఉన్నతాధికారులకు విన్నవించినా ప్రయోజనం శూన్యం.
ఆదర్శ కేంద్రాల్లోనూ..
ఇరవై కేంద్రాలను 2017లో ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. పిల్లలకు బడిపై ఆసక్తిని కలిగించేందుకు వివిధ రకాల ఆట వస్తువులు, టీవీ, రంగు రంగుల కుర్చీలు, గోడల మీద ఆకర్షణీయమైన బొమ్మలను గీయించారు. ఇందుకోసం ఒక్కొ కేంద్రానికి సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేశారు. 2022లో మరో 20 కేంద్రాలను తీర్చిదిద్దారు. తొలుత ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అసౌకర్యాలు వెంటాడుతున్నాయి. ఆటవస్తువులు సరిగా లేవు. చాలా చోట్ల టీవీల ద్వారా పిల్లలకు ఆటపాటల విద్య అందడం లేదు.
ఇది నెల్లికుదురులోని మూడో అంగన్‌వాడీ కేంద్రం. 18 మంది ప్రీస్కూల్ విద్యార్థులున్నారు. 11 మంది గర్భిణులు, బాలింతలు లబ్ధి పొందుతున్నారు. దీనిని 2017లో రూ.2 లక్షల ఖర్చుతో ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రంగా తీర్చిదిద్దారు. పిల్లలను ఆకర్షించేలా గోడలపై రంగు రంగుల బొమ్మలను గీయించారు. పిల్లలకు ఆటపాటలతో విద్యనందించేందుకు 32 అంగుళాల సోని ఎల్‌ఈడీ టీవీని అందించారు. పిల్లలు కూర్చునేందుకు కుర్చీలను ఇచ్చారు. కానీ విద్యుత్తు సౌకర్యం కల్పించలేదు. దీంతో టీవీని పక్కన పెట్టారు. మూత్రశాలల వద్ద నీటి సౌకర్యం లేకపోవడంతో బకెట్ ద్వారా నీటిని తీసుకెళ్తూ ఇబ్బంది పడుతున్నారు.
వర్షం వస్తే కురవకుండా ఇంటి కప్పుపై కప్పిన టార్పాలిన్ పరదాతో కనిపిస్తున్నది బయ్యారం మండలం రావికుంట తండాలోని అంగన్‌వాడీ కేంద్ర అద్దె భవనం. నెలకు రూ.500 కిరాయి చెల్లిస్తున్నారు. ఏడుగురు ప్రీస్కూల్ పిల్లలుండగా ఆరుగురు గర్భిణులు, బాలింతలు పోషకాహారం పొందుతున్నారు. ఈ ఇల్లు మొత్తం అంగన్‌వాడీ కేంద్రం కాదు. వరండాలోనే పిల్లలు చదువుకోవాలి. కేంద్రానికి సంబంధించిన సామగ్రిని భద్రపరుచుకునేందుకు పక్కనే ఉన్న చిన్న గదిని వాడుతున్నారు. అక్కడ మూత్రశాల ఉన్నప్పటికీ ఇంటి యాజమానులు దానిని వాడుకోవద్దని ఆదేశించడంతో పిల్లలు బయటికి వెళ్లాల్సి వస్తోందని ఆయా బాయమ్మ తెలిపారు.
ఈ ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రం బయ్యారం మండలం పెత్తాళ్లగడ్డ-2. గత ఏడాది సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కేంద్రంలో విద్యుత్తు సౌకర్యం ఉండడంతో 11 మంది ప్రీ స్కూల్ పిల్లలకు రోజూ ఆటపాటలతో విద్యాబోధన జరుగుతోంది. నలుగురు గర్భిణులు, బాలింతలు లబ్ధి పొందుతున్నారు. పిల్లలకు మూత్రశాల, మరుగుదొడ్డి లేదు. పాఠశాలలోని వాటిని వినియోగిస్తున్నారు. అధికారులను అడిగితే పిల్లల సంఖ్యను పెంచితే ఆ సౌకర్యాలను కల్పిస్తామని చెబుతున్నారని ఆయా చెబుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని