logo

పలకరిస్తూ.. భరోసానిస్తూ..

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేపట్టిన హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర ములుగు నియోజకవర్గంలో మంగళవారం ఉత్సాహంగా కొనసాగింది.

Published : 08 Feb 2023 05:09 IST

జనంతో మమేకమై సాగిన రేవంత్‌రెడ్డి యాత్ర

ములుగు, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేపట్టిన హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర ములుగు నియోజకవర్గంలో మంగళవారం ఉత్సాహంగా కొనసాగింది. దారి పొడవునా జనం నీరాజనం పలికారు. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయ ప్రాంగణంలోకి రేవంత్‌రెడ్డి ఉదయం 10.30కి చేరుకుని పూజలు నిర్వహించారు. ఆలయంలో సుమారు గంట సేపు గడిపారు. అక్కడి నుంచి ప్రారంభమైన యాత్ర కేశవాపూర్‌, నర్సాపూర్‌, బండారుపల్లి గ్రామాల మీదుగా రాత్రి 7.35 గంటలకు ములుగు చేరింది. రేవంత్‌రెడ్డి వెంట ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీలు పోరిక బలరాం నాయక్‌, మల్లు రవి, భూపాలపల్లి జిల్లా పార్టీ ఇన్‌ఛార్జి గండ్ర సత్యనారాయణ,  ఇతర నాయకులున్నారు.

పాదయాత్రలో జెండాలతో..

రేవంత్‌రెడ్డి దారి పొడవునా ప్రజలను కలుస్తూ వారి నుంచి కష్టసుఖాలను తెలుసుకుంటూ యాత్రను నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. పాలంపేట-కేశవాపూర్‌ గ్రామం వరకు సాగిన యాత్ర మధ్యలో మిర్చి రైతులతో మాట్లాడారు. మిర్చి తోటలో పని చేస్తున్న మహిళా కూలీలు వారి ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్ని రేవంత్‌ రెడ్డికి వడ్డించారు. అక్కడి నుంచి నర్సాపూర్‌ గ్రామానికి చేరుకొని భోజనం చేసి కొంతసేపు సేద తీరి ములుగుకు బయలుదేరారు. ఈ దారిలో పాలంపేటలో మత్స్యకారులు చేపల వల, బుట్ట, నర్సాపూర్‌లో గొల్ల కురుమలు గొర్రెపిల్లను బహూకరించారు. బండారుపల్లి గ్రామానికి చేరుకోగానే మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గోదారి ఓదెలు, సారయ్య ఇంటి వద్ద ఆగి తేనీరు తాగారు. ఓ వృద్ధురాలికి శాలువా కప్పి సన్మానించారు. ఆశా వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు రత్నం నీలాదేవి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు వేతనాలు పెంచాలని కోరుతూ రేవంత్‌ రెడ్డికి వినతిపత్రం అందించారు. నేరుగా ములుగు చేరుకున్న ఆయన జాతీయ రహదారిమీదుగా ఏరియా ఆసుపత్రి, పోలీసుస్టేషన్‌, బస్టాండు నుంచి ఎస్సీ కాలనీ మీదుగా గ్రామ పంచాయతీ రోడ్డులో వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

రామప్ప ఆలయ శిల్పాల విశిష్టతను తెలుసుకుంటూ..

ములుగు ప్రజలు పోరాట పటిమ చాటారు..

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంతన్న ప్రజాపోరాట యోధుడినని నిరూపించుకుని ములుగు గడ్డపై తొలి అడుగు పెట్టారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగళవారం రాత్రి ములుగులోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు రోడ్డులో జరిగిన  సభలో ఆమె మాట్లాడారు. ఇక్కడి ప్రజలు యాత్రను విజయవంతం చేసి పోరాట పటిమను చాటుకున్నారని అన్నారు.  తెలంగాణ ఇచ్చింది.. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది.. గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది కాంగ్రెస్‌ కాదా అని అన్నారు. స్థానిక నాయకులు ఆశోక్‌, గొల్లపెల్లి రాజేందర్‌గౌడ్‌, రవి చందర్‌, రాంరెడ్డి, చాంద్‌పాషా, అహ్మద్‌ పాషా, కంబాల రవి తదితరులు పాల్గొన్నారు.

వెంకటాపూర్‌ మండలం పాపయ్య గూడెం శివారులో విశ్రాంతి తీసుకుంటున్న రేవంత్‌ రెడ్డి, సీతక్క, మల్లురవి

మేక పిల్ల, ఒగ్గు డోలుతో..

మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు మహబూబాబాద్‌ జిల్లా గూడూరుకు చేరుకున్న రేవంత్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న కార్యకర్తలు. అనంతరం కేసముద్రం మండలం పెనుగొండకు చేరుకుని బస చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని