logo

పురపాలనలో ప్రతిష్టంభన లేదు

జనగామ పురపాలికలో అసమ్మతి రాజకీయం, అవిశ్వాస ప్రకటన తదితర రాజకీయ పరమైన అంశాలతో పురపాలన సాధారణ కార్యక్రమాలకు సంబంధం లేదని, ఎలాంటి ప్రతిష్టంభన లేదని పుర కమిషనర్‌ రజిత అన్నారు.

Published : 08 Feb 2023 05:09 IST

పుర కమిషనర్‌ రజిత

జనగామ, న్యూస్‌టుడే: జనగామ పురపాలికలో అసమ్మతి రాజకీయం, అవిశ్వాస ప్రకటన తదితర రాజకీయ పరమైన అంశాలతో పురపాలన సాధారణ కార్యక్రమాలకు సంబంధం లేదని, ఎలాంటి ప్రతిష్టంభన లేదని పుర కమిషనర్‌ రజిత అన్నారు. పౌరసేవలు, తదితర అంశాలపై ‘న్యూస్‌టుడే’ మంగళవారం కమిషనర్‌తో ముఖాముఖి నిర్వహించింది.

న్యూస్‌టుడే:  అసమ్మతి రాజకీయం కారణంగా పురపాలనలో ప్రతిష్టంభన ఏర్పడిందా?

పుర కమిషనర్‌: అదేం లేదు. పాలకవర్గానికి సంబంధించిన ప్రత్యేక రాజకీయ ప్రభావం పురపాలనపై ఉండదు. పౌరసేవలు, అభివృద్ధి పనులకు దాంతో సంబంధం లేదు. ప్రతిష్టంభన లేదు.

న్యూస్‌టుడే: గత నెల సాధారణ సమావేశం జరగలేదు. నెలవారీ సమావేశాలు జరగకపోతే ఇబ్బందులు ఉండవా? తదుపరి సమావేశానికి కౌన్సిల్‌ అసమ్మతీయులు రాకపోతే, కనీస హాజరు లేకపోతే ఏం చేస్తారు?

పుర కమిషనర్‌: సాధారణ సమావేశంతో పాటు, బడ్జెట్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించాలనుకున్నాం. ఈలోగా కంటివెలుగు, రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు వచ్చాయి. జిల్లా అధికారులు, ఎమ్మెల్యే సమయం తీసుకుని  ఏర్పాటు చేస్తాం. సమావేశానికి ఆహ్వానం అందరికి ఉంటుంది. కనీస కోరం లేకపోతే వాయిదా సమావేశం జరుగుతుంది. అవసరమైతే కలెక్టర్‌ సమక్షంలో బడ్జెట్‌ వివరాలు సమర్పించి ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. మూడు మాసాలకు మించి హాజరు తప్పనిసరి, లేని పక్షంలో పుర చట్టం ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

న్యూస్‌టుడే: కౌన్సిల్‌ ఏర్పడి మూడేళ్లు దాటాయి. చెప్పదగిన అభివృద్ధి ఏముంది?

పుర కమిషనర్‌: రూ.30 కోట్ల పనులతో కేంద్రీకృత విద్యుత్తు దీపాలు, విభాగినులు, హరితహారం, పట్టణ ప్రకృతి వనాలు, రహదారి విస్తరణ ఎన్నో జరిగాయి.

న్యూస్‌టుడే: యార్డులో టన్నుల కొద్ది చెత్త దారిపొడవునా పేరుకుపోతోంది. బయోడిగ్రేడ్‌ విధానంలో నిర్మూలన ఏమైంది?

పుర కమిషనర్‌: జనగామ పురపాలిక ప్రాధాన్య క్రమంలో ఉంది. కంపెనీ ప్రతినిధులు వచ్చి పరిశీలించారు. దారిలో చెత్త లేకుండా చర్యలు తీసుకుంటాం.

న్యూస్‌టుడే: కౌన్సిల్‌ రాజకీయాలతో నిధులున్నా.. పనులు కావడం లేదనే ఆరోపణలున్నాయి మీరేమంటారు?

పుర కమిషనర్‌: పట్టణ ప్రగతి నిధులు సెప్టెంబరు వరకు వచ్చాయి. 15వ ఆర్థిక సంఘం టైడ్‌ నిధులతో చేపట్టాల్సిన పనులపై పరిశీలన జరుగుతోంది. ఎమ్మెల్సీ నిధులతో చేపట్టే పనుల జాబితాను సీపీవోకు పంపించాము.

న్యూస్‌టుడే: పట్టణ ప్రణాళిక విభాగంలో అధికారి ఒక్కరే రెండు రోజులు అందుబాటులో ఉంటున్నారు. ఇతర విభాగాల్లో ఖాళీల కారణంగా సేవలకు ఆటంకం కలుగుతుంది. మీరేం చర్యలు తీసుకుంటున్నారు?

పుర కమిషనర్‌: వివిధ విభాగాల్లో ఖాళీలున్నది వాస్తవమే. పౌరసేవలు చాలా వరకు ఆన్‌లైన్‌ కావడంతో ఇబ్బందులు ఉండవు. అక్రమాలపై ఫిర్యాదులుంటే పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటాం.

న్యూస్‌టుడే: తడి పొడి చెత్త సేకరణ, నిర్వహణపై అనేక కార్యక్రమాలు చేశారు. మార్పు ఉందా?

పుర కమిషనర్‌:మెప్మా సంఘాల సభ్యులు తమ వంతు ప్రయత్నిస్తున్నారు. ఇంటింటా కంపోస్టు తయారీతో సమస్య పరిష్కారం అవుతుంది. ప్రజలు సహకరించాలి. ప్రైవేటు ఏజన్సీలను వినియోగిస్తున్నందున పరిస్థితి మారుతుంది.

న్యూస్‌టుడే: రూ.కోట్లు ఖర్చవుతున్నా, మున్సిపల్‌ నీటి సరఫరాలో నాణ్యత లేదంటున్నారు?

పుర కమిషనర్‌: నీటి నాణ్యత నిర్ధారణ పరీక్షల ఫలితాలను ప్రజలకు అందుబాటులో ఉంచి, వారికి నీటి నాణ్యతపై విశ్వాసం కల్పిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు