logo

పెనుగోలు గోడు పట్టించుకునేదెవరు?

దశాబ్దాలు గడిచినా, ప్రభుత్వాలు మారినా పెనుగోలు గిరిజనుల కష్టాలు తీరడం లేదు. వాజేడు మండలంలోని అడవుల్లో పెనుగోలు గుట్టలపై నివసిస్తున్న ఆదివాసీల అవస్థలను పాలకులు, అధికారులు పట్టించుకున్న దాఖలాలు శూన్యం.

Published : 08 Feb 2023 05:09 IST

సరకులతో కాలినడకన ఇళ్లకు వెళ్తున్న గ్రామస్థులు

వాజేడు(ములుగు జిల్లా), న్యూస్‌టుడే: దశాబ్దాలు గడిచినా, ప్రభుత్వాలు మారినా పెనుగోలు గిరిజనుల కష్టాలు తీరడం లేదు. వాజేడు మండలంలోని అడవుల్లో పెనుగోలు గుట్టలపై నివసిస్తున్న ఆదివాసీల అవస్థలను పాలకులు, అధికారులు పట్టించుకున్న దాఖలాలు శూన్యం. నిత్యావసర సరకులు కొనుగోలు చేయాలంటే గుట్టలపై నుంచి 20 కి.మీ దూరం కాలినడకన రావాల్సిందే. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో దట్టమైన అటవీప్రాంతంలో ప్రస్తుతం 13 కుటుంబాలకు చెందిన 43 మంది నివాసముంటున్నారు. అటవీ ఉత్పత్తులను తయారు చేసి వాటిని అమ్ముకునేందుకు వాజేడులో ప్రతి బుధవారం జరిగే వారపు సంతకు వస్తుంటారు. వచ్చిన సొమ్ముతో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకుని వెళ్తుంటారు. ప్రతినెలా ప్రభుత్వం అందించే రేషన్‌ బియ్యం తీసుకోవాలన్నా వాగులు, వంకలు దాటి రావాల్సిన దుస్థితి.

కొండలు, వాగులు దాటుతూ ప్రయాస

బాహ్యప్రపంచానికి దూరంగా నివసిస్తున్న పెనుగోలు గిరిజనులు మైదానప్రాంతానికి రావడానికి రోడ్డు సౌకర్యం లేదు. గుట్టలు, వాగులు దాటుతూ ప్రయాణించాల్సిందే. వర్షాకాలంలో వాగులు ఉప్పొంగితే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసర పనులకు ప్రాణాలను అరచేత పట్టుకుని వరదనీటిలో వస్తుంటారు. అత్యవసరంగా వైద్యం పొందాలంటే బాధితులను కావడిలో మోసుకురావాల్సిన పరిస్థితి. వర్షంలోనూ, వరదలోనూ ప్రతినెలా గ్రామాన్ని కేవలం వైద్యసహాయకుడు మాత్రమే సందర్శించి సేవలు అందిస్తుంటారు. గ్రామంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడిన సందర్భాలలో వైద్యాధికారులు వైద్యశిబిరం ఏర్పాటు చేస్తుంటారు.

ప్రాణాపాయ స్థితిలోని యువతిని కావడిలో మోసుకొస్తున్న కుటుంబసభ్యులు (పాతచిత్రం)

అధికారుల ప్రేక్షకపాత్ర

గుట్టలపైనున్నా ఆదివాసీలు ఇతరుల సాయం ఎన్నడూ ఆశించలేదు. కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్న గిరిపుత్రులకు ఆదాయ వనరులు లేకపోయాయి. కూలిపనులు చేసుకునేందుకు కొండలపై వ్యవసాయ క్షేత్రాలు లేవు. తిండి గింజల కోసం తాతముత్తాతల నుంచి వస్తున్న పట్టా భూములలో జొన్నలు, పప్పు దినుసులను సాగు చేసుకోవడమే తెలుసు. పూటగడవడమే కష్టంగా మారింది. ఆదుకోవాల్సిన పాలకులు, అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, సేవాగుణం కలిగిన దాతలు చేయూతనందించేందుకు స్పందించాలని స్వచ్ఛంద సేవకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని