logo

నిర్లక్ష్యం వద్దు.. అప్రమత్తతే పిల్లలకు రక్ష!

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం మొగిలిచర్ల శివారు జగ్యా తండాలో మూడేళ్ల జయశ్రీ, ఏడాదిన్నర ప్రభాస్‌ను తల్లిదండ్రులు వ్యవసాయ పనుల వద్దకు తీసుకెళ్లారు.

Published : 08 Feb 2023 05:09 IST

పురుగు మందుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి..

ములుగు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ పోరిక గోవిందునాయక్‌

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం మొగిలిచర్ల శివారు జగ్యా తండాలో మూడేళ్ల జయశ్రీ, ఏడాదిన్నర ప్రభాస్‌ను తల్లిదండ్రులు వ్యవసాయ పనుల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కూలీలతో కలిసి వారు పని చేస్తుండగా, చెట్టుకింద ఉన్న చిన్నారులు శీతలపానీయం అనుకుని పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం కేశవాపూర్‌ గ్రామ శివారులోని వడ్డెరగూడానికి చెందిన ఆరెల్లి అక్షర(9), సాదు అఖిల(9), అయిదో తరగతి చదువుతున్న సాదు ఐశ్వర్య(10)  ఈ నెల 2న తాము చదువుకుంటున్న పాఠశాలలో పురుగుల మందు తాగారు. అక్షర బ్యాగులో ఉన్న డబ్బాలో తెల్లని ద్రావణం తాగారు. అది వారికి పురుగుల మందు అని తెలియదు. శీతలపానీయం అనుకుని తాగారు.

ధర్మసాగర్‌, న్యూస్‌టుడే: తల్లిదండ్రుల అవగాహన లోపంతో పురుగుల నివారణ మందులు అభం శుభం తెలియని పిల్లలకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. జీవితమంతా ధారపోసి బిడ్డల భవిష్యత్తు కోసం వ్యవసాయం చేస్తున్నారో దానికి వాడే రసాయనిక ఎరువులు వారి ప్రాణాలను బలిగొనే పరిస్థితి ఏర్పడుతోంది.  రసాయనిక ఎరువులను పిల్లలకు అందుబాటులో ఉండటం.. అవి రకరకాల రంగుల్లో ఉండి కూల్‌డ్రింక్స్‌లా ఆకర్షించడంతో వారం రోజుల వ్యవధిలోనే రెండు చోట్ల చిన్న పిల్లలు వాటిని తాగి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కథనం..

ఏం చేయాలంటే..

ఎరువులు, పురుగు నివారణ మందులను పంట పొలాలకు వాడి.. మిగిలిపోయిన వాటిని వ్యవసాయ బావుల వద్దనే దాచి పెట్టాలి. రైతులు అలా చేయకుండా ఇంటికి తీసుకొస్తున్నారు. కొన్ని క్రిమిసంహారక మందులు పంటపొలాలకు ఎంత వరకు అవసరమో అంత లభ్యం కావడంలేదు. పావు, అర లీటరు, 60 ఎంఎల్‌ స్థాయిలలో లభ్యం కావడంలేదు. దీంతో రైతులు తమకు అవసరం లేకున్నా డబ్బాలను  కొనాల్సి వస్తోంది. డబ్బాలో ఉన్న పురుగుల మందును అవసరమున్నంత వరకు వాడి మిగతాది దాచిపెట్టుకుంటున్నారు. అలా దాచిపెట్టినదే నేడు ఈ ప్రమాదాలకు కారణమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు, వైద్యులు తెలుపుతున్నారు. చిన్న పిల్లలు శీతలపానీయాలు అనుకుని, పెద్దవాళ్లు కూడా చిన్నపాటి ఘర్షణలకు పాల్పడి క్షణికావేశంలో తాగి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

ఈ సీసాలో ఉన్న పురుగుల మందునే కూల్‌డ్రింక్‌ అనుకుని తాగారు..


ఈ రైతుల్లా చేద్దాం..
ధర్మసాగర్‌ మండలం రైతులు కట్కూరి రాజిరెడ్డి, కట్కూరి వెంకటరెడ్డి ఇలా చెబుతున్నారు..

మేము మొదటి నుంచి పురుగుల మందులను పంటపొలాలకు వాడిన తర్వాత మిగిలింది బావి వద్దనే ఎవరికీ కనిపించకుండా దాచిపెడుతాము. మందు అయిపోతే ఖాళీ డబ్బాలను భూమిలో ఒక చోట గుంత తీసి దాచేస్తాం.. ఇది మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాము. ఇలానే మాకు అలవాటు. మా భూమి ఇళ్లకు దగ్గరగా ఉంటుంది. ఇటువైపుగా ప్రజలు ఎవరైనా వస్తే ఇబ్బంది అవుతుందని ఇలా చేస్తున్నాం.


చిన్నారులకు తెలియనివ్వొద్దు
- డాక్టర్‌ శేషుమాధవ్‌, పిల్లల వైద్య నిపుణులు.హనుమకొండ

అయిదు సంవత్సరాల లోపు పిల్లలు ఏది చేసినా ఆక్సిడెంటల్‌(అనుకోకుండా)గా చేస్తుంటారు. నేడు కూల్‌డ్రింక్స్‌ను అందరూ తీసుకుంటారు. చిన్న పిల్లలు నిత్యం మనం తాగే కూల్‌డ్రింక్స్‌ను చూస్తుంటారు. ఏ డబ్బాలో రంగునీళ్లు కనిపించినా అవి కూల్‌డ్రింక్స్‌ అనుకుని తాగేందుకు ప్రయత్నిస్తారు. విష పదార్థాలు, విషపు రసాయనాలున్న డబ్బాలను ఇళ్లలోకి తీసుకురావొద్దు. అందులో చిన్న పిల్లలకు కనిపించకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. పంటపొలాలకు వాడే రసాయనాలే కాకుండా ఇళ్లల్లో ఫినాయిల్‌, డెటాల్‌ వంటివి కూడా ఇళ్లల్లో పిల్లలకు దూరంగా పెట్టాలి.  


అవసరమున్నంతనే కొనుగోలు చేయాలి..
- దామోదర్‌రెడ్డి, ఏడీఏ. హనుమకొండ జిల్లా

రైతులు తమ పంటపొలాలకు రసాయనిక ఎరువులు ఎంత వరకు అవసరం ఉంటుందో అంతే తెచ్చుకోవాలి. ఒక వేల ఎక్కువ మొత్తంలో పురుగుల మందును తీసుకుంటే వాటిని ఇంటికి తీసుకెళ్లకుండా, వ్యవసాయ బావుల వద్ద, కొట్టాల వద్దనే పిల్లలకు దూరంగా కనిపించకుండా దాచిపెట్టాలి. వాడిన పురుగుల మందు డబ్బాలను సైతం భూమిలో పాతిపెట్టాలి. వాడిన డబ్బాలను బావుల వద్ద, ఇళ్లల్లో వాడకూడదు. ఖాళీ డబ్బాలను సైతం కనిపించకుండా పెట్టాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని