logo

Warangal: పార్టీపై అభిమానం కుటుంబాన్ని రోడ్డున పడేసింది

పార్టీపై ఉన్న అభిమానం ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. రేవంత్‌రెడ్డిని చూద్దామని వెళ్లిన ఆ యువకుడు విగత జీవిగా మారాడు. ఫలితంగా ఇద్దరు పిల్లలు, భార్య పెద్ద దిక్కును కోల్పోయింది.

Updated : 02 Mar 2023 09:16 IST

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం

మృతుడు చందు (పాత చిత్రం)

గణపురం, న్యూస్‌టుడే: పార్టీపై ఉన్న అభిమానం ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. రేవంత్‌రెడ్డిని చూద్దామని వెళ్లిన ఆ యువకుడు విగత జీవిగా మారాడు. ఫలితంగా ఇద్దరు పిల్లలు, భార్య పెద్ద దిక్కును కోల్పోయింది. మరొకరికి చికిత్స చేయించుకునే పరిస్థితి కూడా లేదని గ్రామస్థులు అంటున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా రేగొండ మండలం రామన్నగూడెం తండాకు చెందిన బాదావత్‌ చందు, ఇస్లావత్‌ శ్రీనులు మంగళవారం రాత్రి భూపాలపల్లికి వచ్చిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సభకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు రోడ్డు ప్రమాదానికి గురికాగా ఇందులో చందు మృతిచెందాడు. శ్రీను పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం గణపురం మండలం గాంధీనగరం శివారులో భూపాలపల్లి హనుమకొండ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్సై అభినవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రేగొండ మండలం రామన్నగూడెంతండాకు చెందిన బాదావత్‌ చందు(32), ఇస్లావత్‌ శ్రీనులు మంగళవారం రాత్రి రేవంత్‌ రెడ్డి సభకు భూపాలపల్లి వెళ్లారు. సభ అయ్యాక అర్ధరాత్రి తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో చందు కారు పైనుంచి ఎగిరి పడ్డాడు. ఈ క్రమంలోనే కారు వెనకాల మిర్చిలోడుతో వస్తున్న మినీ వ్యాన్‌ అతడిపై నుంచి వెళ్లడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రీను  తీవ్రంగా గాయపడడంతో.. 108 వాహనంలో ఎంజీఎంకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. మృతుడు చందుకు భార్య కల్పన, ఏడాదిన్నర కూతురు, మూడేళ్ల బాబు ఉన్నారు. శ్రీనుకు భార్య రజిత, ఇద్దరు పిల్లలున్నారు. ఇరు కుటుంబాలు నిరుపేదలు కావడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని