logo

Warangal: అత్తింటి వేధింపులకు మహిళా కానిస్టేబుల్‌ మృతి

అదనపు కట్నం వేధింపు బాధితులకు అండగా నిలిచిన మహిళా కానిస్టేబులే అత్తింటి వేధింపులకు బలయ్యారు. మరికొద్ది నెలల్లో ఎస్సై కాబోతున్నానని ఆశతో ఉన్న ఆ యువతి కానరాని లోకానికి వెళ్లిపోయారు.

Updated : 06 Mar 2023 07:39 IST

పోలీసుల అదుపులో భర్త, అత్త, బావ

భర్త, పిల్లలతో మౌనిక (పాత చిత్రం)

ములుగు రోడ్డు, న్యూస్‌టుడే: అదనపు కట్నం వేధింపు బాధితులకు అండగా నిలిచిన మహిళా కానిస్టేబులే అత్తింటి వేధింపులకు బలయ్యారు. మరికొద్ది నెలల్లో ఎస్సై కాబోతున్నానని ఆశతో ఉన్న ఆ యువతి కానరాని లోకానికి వెళ్లిపోయారు. వరంగల్‌ వేణురావు కాలనీకి చెందిన నాంపెల్లి మౌనిక (26) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మహబూబాబాద్‌ పోలీసు శాఖలో పనిచేస్తున్న ఆమె ఇంట్లో ఉరి వేసుకుందని ఎంజీఎంకు తీసుకెళ్తున్నామని అత్తింటి వారు తల్లిగారికి సమాచారం ఇచ్చారు. తల్లి తరఫు బంధువులు ఎంజీఎంకు వచ్చేసరికే మౌనిక మృతిచెందారు. భర్త, అత్త, బావ కలిసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తండ్రి రాజేందర్‌ కన్నీరుమున్నీరయ్యారు. ఎంజీఎంలో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. మార్చురీ వద్ద మౌనిక బంధువులు మృతురాలి అత్తపై దాడికి దిగారు. హత్యచేసిన వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మౌనిక భర్త శ్రీధర్‌, అత్త వీరలక్ష్మి, బావ కృష్ణమూర్తిపై వేధింపుల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని వడ్డేపల్లికి తరలించారు.

ఎస్సై ఉద్యోగానికి సిద్ధమవుతున్న సమయంలో..

వడ్డేపల్లికి చెందిన ఎదులాపురం రాజేందర్‌ సుగుణ కూతురు మౌనిక. ఎనిమిదేళ్ల వయసులోనే తల్లి మరణించింది. రాజేందర్‌ నర్సమ్మను వివాహం చేసుకున్నారు. కొంత కాలానికి దేశాయిపేట రోడ్డుకు నివాసం మార్చారు. 18 ఏళ్లు నిండిన నెలకే 2014లో మౌనిక కానిస్టేబుల్‌ కొలువును సాధించారు. 2015లో ఫైనాన్స్‌ వ్యాపారి శ్రీధర్‌ను వివాహం చేసుకోగా, వీరికి ఎల్‌కేజీ చదువుతున్న ఒక కుమారుడు మౌహక్‌వీర్‌, యూకేజీ చదువుతున్న నిహారిక ఉంది. శ్రీధర్‌ సోదరుడు కృష్ణమూర్తికి సంతానం లేకపోవడంతో నిహారికను దత్తత ఇచ్చారు  కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మౌనిక ఎస్సై ఉద్యోగ సాధనకు ఇటీవల రాత పరీక్ష, ఈవెంట్స్‌లో నెగ్గారు. మెయిన్స్‌కు సిద్ధమవుతున్నారు.

హత్యేనంటున్న తల్లిదండ్రులు

పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఎంతో మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చి ధైర్యాన్ని నూరిపోసిన మౌనిక ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మరని రాజేందర్‌, నర్సమ్మ వాపోయారు. ముమ్మాటికి ఇది హత్యేనని, చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఏడుస్తూ చెప్పారు. డ్యూటీ ఎన్ని గంటలకు అయిపోయింది, ఎన్ని గంటలకు వస్తున్నావని సూటిపోటి మాటలతో అత్త వేధింపులకు పాల్పడేదన్నారు. మౌనిక జీతం రాగానే శ్రీధర్‌ ఖాతాలోకి పంపించాలని హుకుం జారీచేసేదన్నారు. కాస్త ఆలస్యంగా ఇంటికి వస్తే.. ఆ రోజు యుద్ధమేనన్నారు. డబ్బులు, ఉద్యోగం మౌనికవే అయినా అత్తింటి వారు ఓర్వలేనితనంతో ఇంకా డబ్బు తేవాలని వేధించేవారని కన్నీరుమున్నీరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని