logo

అన్నదాతలకు అండగా న్యాయ సహాయ కేంద్రం

అందరికీ అన్నం పెట్టే రైతన్నలకు అడుగడుగునా పలు సమస్యలు ఎదురవుతున్నాయి. దుక్కి దున్నడం నుంచి పంటను మార్కెట్‌లో విక్రయించే వరకు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 19 Mar 2023 05:46 IST

బమ్మెరలోని అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ప్రారంభోత్సవంలో భాగంగా కార్యాలయం గదికి రిబ్బన్‌ కత్తిరిస్తున్న జనగామ జిల్లా ఇన్‌ఛార్జి న్యాయమూర్తి బాల భాస్కర్‌, చిత్రంలో నల్సార్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ విద్యుల్లతారెడ్డి, లీఫ్స్‌ సంస్థ అధ్యక్షుడు సునీల్‌కుమార్‌, సీనియర్‌ సబ్‌ జడ్జి ఆంజనేయులు.

పాలకుర్తి, న్యూస్‌టుడే: అందరికీ అన్నం పెట్టే రైతన్నలకు అడుగడుగునా పలు సమస్యలు ఎదురవుతున్నాయి. దుక్కి దున్నడం నుంచి పంటను మార్కెట్‌లో విక్రయించే వరకు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆయా సమస్యల పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలో తెలియక సతమతమవుతున్నారు. కొందరిని సంప్రదించినా సరైన న్యాయం, పరిష్కారం లభించడం లేదు. దీంతో ఏటా అప్పులు, కన్నీళ్లే మిగులుతున్నాయి. రైతుల సమస్యల్లో కొన్నింటికైనా పరిష్కారం చూపాలని కొన్నేళ్లుగా న్యాయ నిపుణులు శ్రమిస్తున్నారు. వారి కృషి, చొరవతో దేశంలోనే తొలిసారిగా జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెరలో నల్సార్‌ యూనివర్శిటీ, లీఫ్స్‌ సంస్థ, న్యాయసేవల అథారిటీ ఆధ్వర్యంలో ‘రైతు సాగు న్యాయ కేంద్రం’(అగ్రీ లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌) ఏర్పాటైంది. ఈ క్లినిక్‌ను వర్చువల్‌ విధానంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, రాష్ట్ర న్యాయసేవల అథారిటీ ఎక్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పి.నవీన్‌రావు కలిసి ప్రారంభించారు.

సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు

నల్సార్‌ యూనివర్శిటీ, లీఫ్స్‌ సంస్థ(లీగల్‌ ఎంపవర్మెంట్‌ అండ్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ ఫార్మర్స్‌ సొసైటీ), న్యాయసేవల అథారిటీ ఆధ్వర్యంలో  బమ్మెరలో అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. దీంతో బమ్మెర పంచాయతీ కార్యాలయంలో రైతులకు ఉచిత న్యాయ సేవలు అందనున్నాయి. ఒక ప్రత్యేక గది, విభాగంతో పాటు సలహాదారులు కూడా అందుబాటులో ఉండి అన్నదాతలకు ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వనున్నారు.

రైతులకు చుట్టం కానున్న చట్టం..

ప్రస్తుతం రైతు స్వాధీనంలో ఉన్న భూమితోపాటు చేతిలో పట్టా పాస్‌ పుస్తకం, రికార్డుల్లో పేరుంటేనే భూమి హక్కుకు భద్రత ఉంటుంది. ఈరోజుల్లో అలాంటివి తక్కువగానే ఉన్నాయి. గ్రామాల్లోని వేలాది మంది రైతుల భూములకు ఇప్పటికీ సరైన పత్రాలు కూడా లేవు. విద్య లేని రైతులు ఏం చేయాలో తెలియక ప్రభుత్వ పథకాలు, ఇతర పత్రాలు, రుణాలు పొందేందుకు నిత్యం తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారు. కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిలో 90 శాతం ఇలాంటి సమస్యలకు సంబంధించినవే వస్తున్నాయి. ఈ కొత్త విధానంతో కొంతమేర రైతులకు సత్వర న్యాయం జరిగే అవకాశం ఉంది. అక్కడికక్కడే సలహాలు తీసుకొని ఎవరి దగ్గరకు వెళితే సమస్య పరిష్కారమవుతుందో నేరుగా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. ఫలితంగా సాగు న్యాయ సహాయ కేంద్రం రైతులకు చుట్టంగా మారుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ధరణితోనూ ఇబ్బందులే..

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులకు సమస్యలు ఏర్పడ్డాయి. మరి కొందరికి వరంగా మారింది. వ్యవసాయ భూములు ఇష్టారీతిలో ఒకరికి బదులు మరొకరి పేర్లతో రికార్డుల్లో నమోదయ్యాయి. సాగులో రైతులే ఉన్నప్పటికీ.. అనర్హులు ప్రభుత్వ పథకాలను పొందుతున్నారు. ధరణిలో సమస్యలు పరిష్కారం కావాలంటే పెద్ద ప్రక్రియ. దరఖాస్తు చేసుకున్న అన్నదాతలు అధికారులు, కార్యాలయాలు చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. సమస్య పరిష్కారం కాక కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.

చట్టాలు రైతులకు చేరువ కావాలి

పాలకుర్తి, న్యూస్‌టుడే: చట్టాలు రైతులకు మరింత చేరువ కావాల్సిన అవసరముందని జనగామ జిల్లా ఇన్‌ఛార్జి న్యాయమూర్తి,  న్యాయసేవల అథారిటీ జిల్లా ఛైర్మన్‌ బాల భాస్కర్‌ అన్నారు. ఈ కేంద్రాన్ని ఉపయోగించుకునే తీరుతోనే దేశమంతటా దశలవారీగా కేంద్రాలను ప్రారంభిస్తారన్నారు. నల్సార్‌ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ విద్యుల్లతారెడ్డి మాట్లాడుతూ బమ్మెరలో ఇది కేవలం తాత్కాలిక ప్రయోగం మాత్రమేనన్నారు. ఇప్పటికే అన్ని పల్లెల్లో సుమారు 500 మంది విద్యార్థులు, యూనివర్శిటీ సహకారంతో గ్రామస్థులకు న్యాయ సలహాలను ఉచితంగా ఇస్తున్నారన్నారు. బమ్మెరను ఆదర్శంగా తీసుకొని దేశమంతటా ఈ విధానం త్వరలోనే అమల్లోకి వస్తుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఆంజనేయులు, పృథ్వీరాజ్‌, లీఫ్స్‌, నల్సార్‌ బృందం సభ్యులు, సర్పంచి నాగభూషణం పాల్గొన్నారు.  


బలమైన లక్ష్యంతో ఏర్పాటు

- భూమి సునీల్‌, లీఫ్స్‌ సంస్థ అధ్యక్షుడు

రైతులకు చట్టాన్ని చుట్టం చేయాలన్న బలమైన లక్ష్యంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నవీన్‌రావు సహకారంతో దేశంలో తొలిసారిగా ఈ కేంద్రం తెలంగాణలో ఏర్పాటైంది. నల్సార్‌ యూనివర్శిటీ, న్యాయసేవల అథారిటీ తోడ్పాటు అందించాయి. పంటల సాగు నుంచి మార్కెట్‌ వరకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా.. ఈ కేంద్రాన్ని సంప్రదించి ఉచితంగా న్యాయ సలహాలు పొందవచ్చు. రైతులు సద్వినియోగం చేసుకోవాలి.


సద్వినియోగం చేసుకుంటాం

- సురుగు సోమయ్య, రైతు, బమ్మెర

సాగు న్యాయ సహాయ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుంటాం. రేపటి నుంచి సాగు సమస్యలపై సలహాలు తీసుకుంటా. చట్టాల గురించి తెలుసుకుంటా. మార్కెట్‌లో మోసాలతోపాటు పంటల బీమా తదితర అంశాలపై నా సహచర రైతులతో కలిసి సలహాలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని