logo

రైతన్నకు మిగిలింది కన్నీరే!

వడగళ్ల వాన రైతులకు కడగండ్లే మిగిల్చింది. పెద్దపెద్ద రాళ్లు పంటలపై బాంబుల్లా పడడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా మొక్కజొన్న, మిర్చి, వరి, అనేక రకాల కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Published : 21 Mar 2023 04:15 IST

నాలుగేళ్లుగా పూర్తిగా నిలిచిపోయిన బీమా

ఖానాపురం మండలం కొత్తూరు గ్రామ రైతు జంగిలి రమేష్‌
నాలుగెకరాల్లో వేసిన మొక్కజొన్న ఇలా పూర్తిగా పడిపోయింది..

ఈనాడు, వరంగల్‌: వడగళ్ల వాన రైతులకు కడగండ్లే మిగిల్చింది. పెద్దపెద్ద రాళ్లు పంటలపై బాంబుల్లా పడడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా మొక్కజొన్న, మిర్చి, వరి, అనేక రకాల కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురు గాలులతో పంటలు నేలకొరగడంతో అన్నదాతలు గుండెలు బాదుకుంటూ ‘అయ్యో దేవుడా ఎంత పనైంది’ అంటూ రోదిస్తున్నారు. తీవ్ర పంట నష్టం జరిగినప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి చూసి వెళుతున్నారు. పరిహారం కొద్దిమొత్తంలో అందడానికి కర్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడక తప్పడం లేదు. తాజాగా కురిసిన వానలకు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు పంట నష్టంపై ప్రాథమిక అంచనా వేశారు. ఇప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తున్నారు. 50 శాతం కన్నా తక్కువ దెబ్బతింటే పరిగణనలోకి తీసుకోవడం లేదు.

భరోసా లేదు.. 

అకాల వర్షాలు, వడగళ్ల వానలు కురిసినప్పుడు వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వం నుంచి సరైన సమయంలో గిట్టుబాటు కలిగేలా బీమా పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ లాంటివి అందని ద్రాక్షలా మారాయి. కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానమై అమలుచేసే ఫసల్‌ బీమా రాష్ట్రంలో ఎత్తివేయడంతో రైతులకు విపత్తుల సమయంలో భరోసా ఉండడం లేదు. 2018 నుంచి బీమాను పూర్తిగా ఎత్తేయడంతో రైతన్నలెవరూ ప్రైవేటు బీమా కంపెనీల్లో ప్రీమియం చెల్లించడం లేదు. బాగా అవగాహన ఉండి, ఆర్థికంగా బాగున్న రైతులు ఒకరిద్దరు మాత్రమే ప్రైవేటు కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. రైతులకు విపత్తుల సమయంలో నష్ట పరిహారం అందడం గాల్లో దీపంలా తయారైంది.

చెల్లించేందుకు ఏళ్లు..

ఇటీవల ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సంభవించిన విపత్తుల సమయంలో రైతులకు పైసా బీమా రాలేదు. పంటలు తీవ్రంగా నష్టపోవడంతో ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేసి, కొద్ది మొత్తంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించింది.
* 2021 డిసెంబరు, 2022 జనవరిలో కురిసిన రాళ్లవానకు మిర్చి పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ ప్రాంతాల్లోని రైతులు సర్వం కోల్పోయారు. దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, జిల్లా మంత్రులతో కలిసి పరిశీలించారు. వెంటనే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఇది 2022 డిసెంబరు వరకూ అందలేదు. మొక్కజొన్న హెక్టారుకు రూ.8300, వరికి రూ.13 వేలు మాత్రమే పరిహారం అందిస్తారు. ప్రస్తుతం పెరిగిన పెట్టుబడి ధరలకు ఇది ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అప్పుడు తెగుళ్లు.. ఇప్పుడు వడగళ్లు

నర్సంపేట మండలం బాంజిపేటకు చెందిన రైతు భూషబోయిన రాజన్న రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా పంట మొత్తం నేలపై పడిపోయింది. గతంలో మిర్చి సాగు చేయగా వైరస్‌ సోకడంతో దాన్ని దున్ని మొక్కజొన్న వేశారు. ఇప్పుడు అకాల వర్షంతో లక్ష రూపాయల నష్టం వాటిల్లింది.


అన్నీ పోయాయి...

.ఖానాపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన బూస అయిలయ్య, అరుణ దంపతులు రెండెకరాల్లో మిర్చి, ఒక ఎకరంలో మొక్కజొన్న వేయగా అవి ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఇప్పుడు రూ.మూడు లక్షల అప్పులే మిగిలాయి.


అప్పుడు.. ఇప్పుడు నష్టమే...!

ఖానాపురం మండలంలో రైతు బొడ్డ పున్నం ఎకరంలో పచ్చజొన్న వేయగా ఆ పంట ఎందుకూ పనికి రాకుండా పోయింది. తాను గతంలో కూడా మిర్చి పంట తెగుళ్లతో నష్టపోయానని, ఇప్పుడు వడగళ్ల వర్షానికి జొన్న పంట నేలపాలైందని చెప్పారు.


నేల రాలిన మామిడి...

ఖానాపురం మండలం కొత్తూరులో మడద శ్రీనివాస్‌కు చెందిన మూడెకరాల మామిడి తోటలోని కాయలు రాలిపోయాయి. ఈ ఏడాది మంచి కాత వచ్చిందనుకుంటే వడగళ్ల వర్షం నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ రైతు పేరు సీతారాం. వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం కోనాయమాకుల. రెండెకరాల్లో  మొక్కజొన్న వేయగా శనివారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి పంట మొత్తం దెబ్బతింది. మరో నెలరోజుల్లో కోతకు వస్తున్న క్రమంలో ఇలా జరగడంతో సీతారాం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పంట మొత్తం నష్టపోయినా ఎప్పుడూ బీమా పరిహారం రాలేదని.. ఎప్పుడో పదేళ్ల కిందట ఒకసారి పరిహారం అందుకున్నానని తెలిపారు. ఈ అన్నదాత రూ. లక్ష పైనే నష్టపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని