logo

ఆరోగ్య వనాలు!

అడవులు వన్యప్రాణులకు నెలవుగా ఉండి జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తాయి.  ఒకప్పుడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉన్నా దాన్ని కాపాడుకోలేకపోవడంతో కరవు కాటకాలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.

Published : 21 Mar 2023 04:15 IST

నేడు ప్రపంచ అటవీ దినోత్సవం
ఈనాడు డిజటల్‌, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి

జీవకోటికి ఆశ్రయమిచ్చేది అడవులు.. వాటిని బతకనిద్దాం.. మనం బతుకుదాం

అడవులు వన్యప్రాణులకు నెలవుగా ఉండి జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తాయి.  ఒకప్పుడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉన్నా దాన్ని కాపాడుకోలేకపోవడంతో కరవు కాటకాలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొన్నేళ్లుగా ప్రభుత్వం హరిత హారం కార్యక్రమాలతో పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టడం, పోడు భూముల్లో మొక్కలు పెంచటం వల్ల అటవీ విస్తీర్ణం స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. మంగళవారం అంతర్జాతీయ అటవీ దినోత్సవం. ‘అడవులు.. ఆరోగ్యం’ అనే సందేశంతో ఈసారి అడవుల రక్షణకు పాటుపడాలని నిపుణులు నిర్ణయించిన నేపథ్యంలో ప్రత్యేక కథనం.

ఇది గార్ల మండలం ముల్కనూర్‌ పంచాయతీ పరిధిలోని గుంపెల్లగూడెంలో నాటిన పల్లె పకృతి వనం. ఎకరం విస్తీర్ణం 4 వేల మొక్కలను నాటి సరంక్షించడంతో చిట్టడవిలా మారింది. ఇలా ఉమ్మడి జిల్లాలో  సుమారు 3500 పల్లె, పట్టణ ప్రకృతి వనాలు చిట్టడవుల్లా మారాయి. 

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా  గాంధీనగర్‌లోని అటవీ ప్రాంతంలో 2018- 2019 హరితహారంలో భాగంగా నాటారు. 16 హెక్టార్లలో 18 వేల మొక్కలు నాటారు. కదంబ, మర్రి, మహాగని, వేప, నేరేడు, ఉసిరి, మర్రి, రావి, చింత,మొక్కలు నాటారు. 

వీధికిరువైపులా మొక్కలతో పచ్చదనాన్ని సంతరించుకున్న ఈ గ్రామం వరంగల్‌ జిల్లా  మరియపురం. సర్పంచి బాలిరెడ్డి ఊరంతా   లక్ష మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ఇందులో 70 శాతం బతికినట్లు ఆయన తెలిపారు. వాతావరణం చల్లగా ఉంటోందని పేర్కొన్నారు.

అడవిని తలపిస్తున్న ఈ చెట్లు  మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు బీటు పరిధిలోనివి. 2020లో ఇక్కడ పోడు సాగవుతుండగా అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకొని హరితహారం కింద 15 హెక్టార్లలో 16,665 మొక్కలు నాటి సంరక్షించారు. మూడేళ్లలోనే అడవిని తలపిస్తోంది.  ఉమ్మడి జిల్లా అటవీ ప్రాంతాల్లో ఇలా లక్షల మొక్కలు నాటి అడవికి పూర్వ వైభవం తీసుకొచ్చారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తగ్గుముఖం పట్టిన అడవి హరితహారం కార్యక్రమంతో పూర్వవైభవం సంతరించుకుంటోంది. అంతరించిపోతున్న అడవులు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఎనిమిది విడతలుగా కొనసాగుతున్న హరిత హారం కార్యక్రమంతో భూపాలపల్లి, మలుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాలో సుమారు ఐదువేల ఎకరాల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. ఎకరానికి సుమారు నాలుగు వేల మొక్కల చొప్పున దాదాపు రెండు కోట్ల మొక్కలు వృక్షాలుగా ఎదుగుతున్నాయి.  అటవీశాఖ అధికారులు ప్రధానంగా కొత్తగా చేపట్టిన పోడు భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. హెక్టారుకు 1,111 మొక్కల చొప్పున నాటుతూ సంరక్షిస్తున్నారు. మరోసారి ఆ భూమిలో పోడు సాగు జరగకుండా..నాటిన మొక్కలు ఏపుగా పెరిగేలా సిబ్బంది కాపలా ఉంటున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వేల హెక్టార్ల పోడు భూమిని స్వాధీనం చేసుకుని కోట్ల మొక్కలు నాటడంతో ఇప్పుడు ఆ ప్రాంతాలు దట్టమైన అడవులుగా మారాయి. ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పచ్చదనం పరిఢవిల్లుతోంది. అటవీశాఖ అధికారులు ఏటా పండ్లు, ఇతర రకాల సాధారణ మొక్కలతో పాటు ఔషధగుణాలున్న మొక్కలను నాటుతున్నారు. ఇలా అటవీ విస్తీర్ణం పెరగడంతో వాతావరణ కాలుష్యం తగ్గి ప్రజల, వన్యప్రాణుల ఆరోగ్యం మెరుగుపడుతోంది.

* పెరిగిన వన్యప్రాణుల సంతతి: అడవి పెరుగుతుండడంతో వన్యప్రాణుల సంతతి కూడా పెరిగింది. అడవి దున్నలు, చుక్కల దుప్పులు, కొండ గొర్రెలు, మనుబోతులు, ఎలుగు బంట్లు, అడవి పందులు ఉన్నాయి. ఇటీవల హనుమకొండలోని జూపార్కులో ఉన్న దుప్పులను కొత్తగూడ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పులి, చిరుత కూడా సంచరించాయి. ఇటీవల పాకాలకు వలస పక్షులు వచ్చాయి. అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల కోసం సోలార్‌ పంప్‌ సెట్లు ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించారు. 

ఇవీ ప్రయోజనాలు

జీవరాశుల సమతుల్యాన్ని సాధిస్తాయి.
వాతావరణ కాలుష్యం నియంత్రిస్తాయి.
వరదలు, అకాల వర్షాలు, తుపాన్లు నివారిస్తాయి.
ఒక వృక్షం తన 50 ఏళ్ల జీవిత కాలంలో రూ.15.70 లక్షల
విలువైన ఆక్సిజన్‌, ఇతర ప్రయోజనాలను అందిస్తుంది.
అటవీ   ఉత్పత్తులను విక్రయించడం ద్వారా  ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని