logo

మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు

ఐదుగురు మావోయిస్టు సానుభూతిపరులతో పాటు పేలుడు సామగ్రి, ఇతర వస్తువులు సరఫరా చేసిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

Published : 21 Mar 2023 04:15 IST

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ గాష్‌ ఆలం

ములుగు, న్యూస్‌టుడే: ఐదుగురు మావోయిస్టు సానుభూతిపరులతో పాటు పేలుడు సామగ్రి, ఇతర వస్తువులు సరఫరా చేసిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచెంద్రాపురం సమీపంలో జరిగింది. వారి  నుంచి పేలుడు సామగ్రి, విప్లవ సాహిత్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ గాష్‌ ఆలం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు రామచంద్రాపురం వద్ద సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో వాహనాల తనిఖీలు చేపట్టగా కారు, మోటారు బైక్‌పై వెళ్తున్న రెండు వాహనాలను ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం లభ్యమైంది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మావోయిస్టు ప్రధాన నాయకుడు దామోదర్‌ను కలవడానికి, పేలుడు సామగ్రి అప్పగించడానికి వెళ్తున్నట్లు చెప్పారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నాగారం గ్రామానికి చెందిన అందె రవి, దీక్షకుంట గ్రామానికి చెందిన దిడ్డి సత్యం, మల్హర్‌ మండలం పెద్దతండాకు చెందిన అనసూరి రాంబాబు, వరంగల్‌ జిల్లా సంగెం మండలం పల్లారిగూడకు చెందిన శ్రీరామోజు మనోజు, శ్రీరామోజు భిక్షపతిలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 45 ఇనుప వస్తువులు, 10 మీటర్ల వైరు, రెండు డిటోనేటర్లు, బ్యాటరీ, విప్లవ సాహిత్యం, కారు, బైక్‌, 8 చరవాణులు, రూ.4,140 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఇచ్చిన సమాచారం మేరకు పేలుడు పదార్థాలు, ఇతర మెటీరియల్‌ సరఫరా చేసిన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధి బాలాజీనగర్‌కు చెందిన గణపురం చంద్రమౌళి, పృథ్వీరాజ్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నాగారం గ్రామానికి చెందిన అందె మానసలను కూడా అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం 14 మందిలో ఎనిమిది మందిని అరెస్టు చేయగా మరో ఆరుగురు పరారీలో ఉన్నారని, వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమావేశంలో ఓఎస్డీ అశోక్‌ కుమార్‌, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్‌, వెంకటాపురం సీఐ శివప్రసాద్‌, ఎస్సై తిరుపతిరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని