logo

తగ్గిన ‘కోత’లు

మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు 80 శాతం గర్భిణులకు శస్త్రచికిత్స ద్వారానే ప్రసూతి సేవలు అందించే వారు.

Published : 21 Mar 2023 04:15 IST

జిల్లా ఆసుపత్రిలో 50 శాతం సాధారణ ప్రసవాలు
ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌

గర్భిణులతో వ్యాయామం చేయిస్తున్న మిడ్‌వైఫ్‌లు

మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు 80 శాతం గర్భిణులకు శస్త్రచికిత్స ద్వారానే ప్రసూతి సేవలు అందించే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి 50 శాతానికి వచ్చింది. 20 శాతం ఉన్న సాధారణ ప్రసవాల సంఖ్య 30 శాతం పెరిగింది. మరో 10-15 శాతానికి పెంచేందుకు వైద్యులు కృషి చేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో ఒకే రోజులో 19 కాన్పులు జరపగా అందులో 15 సాధారణమే. ఆసుపత్రికి వచ్చిన గర్భిణులకు వైద్యులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. వారు కూడా వైద్యులు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు. కాగా, కలెక్టర్‌ శశాంక ప్రత్యేక దృష్టిసారించడం వారానికి ఒక సారి వైద్యులతో సమీక్ష నిర్వహించడం వల్లనే సుఖ ప్రసవాల సంఖ్య పెరగిందని ఆసుపత్రి వైద్యుడు ఒకరు తెలిపారు.

రోజూకు 60 మంది

ఆసుపత్రికి వైద్యపరీక్షల కోసం రోజూ సుమారు 60 మంది గర్భిణులు వస్తున్నారు. మొదటిసారి గర్భం దాల్చిన వారికి సుఖ ప్రసవం జరిగేలా ముందు నుంచే కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. రోజూ 10 నుంచి 12 ప్రసవాలు చేస్తున్నట్లు అందులో సగం వరకు సాధారణమేనని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రిలో నెలకు 380 నుంచి 400 ప్రసవాలు జరిగితే అందులో 50 శాతం వరకు సిజిరేయిన్లు చేస్తున్నట్లు తెలిపారు.

అవగాహన కల్పిస్తూ..

గర్భిణులకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ.. వ్యాయాయాలు చేయిస్తూ సాధారణ ప్రసవం కలిగే ప్రయోజనాలను మిడ్‌వైఫ్‌లు తెలియజేస్తున్నారు. ఆహార నియమాలను వివరిస్తున్నారు. ఎక్కువ ప్రమాదం(హైరిస్క్‌) కేసులుంటే వారికి వైద్యుడి సలహాతో అవగాహన కల్పిస్తున్నారు. వైద్యులు, మిడ్‌వైఫ్‌లు సమష్ఠిగా కలిసి సాధారణ ప్రసవాల సంఖ్య పెంచుతున్నారు.

పెరిగిన వైద్యుల సంఖ్య

గతంలో ఇద్దురు వైద్యులు మాత్రమే ఉండేవారు. ప్రస్తుతం తొమ్మిది మంది సేవలందిస్తున్నారు. నొప్పులు భరించలేని వారు ప్రైవేట్‌కు వెళ్లి సిజిరేయిన్‌ చేయించుకుంటామన్న వారికి బయట డబ్బులు ఖర్చు కావొద్దనే ఉద్దేశంతోనే శస్త్రచికిత్స చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి సాధారణ ప్రసవం చేయించుకునేలా ఒప్పిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని