logo

సకాలంలో రుణాలు మంజూరు చేయాలి

ఐటీడీఏ ద్వారా గిరిజన సంక్షేమ శాఖ అందిస్తున్న ఉపాధి రంగ పథకాలను గిరిజన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకునేందుకు రుణ సమ్మతిని జారీ చేయాలని పీవో అంకిత్‌ బ్యాంకర్లను ఆదేశించారు.

Published : 21 Mar 2023 04:15 IST

బ్యాంకర్లతో మాట్లాడుతున్న పీవో అంకిత్‌

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: ఐటీడీఏ ద్వారా గిరిజన సంక్షేమ శాఖ అందిస్తున్న ఉపాధి రంగ పథకాలను గిరిజన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకునేందుకు రుణ సమ్మతిని జారీ చేయాలని పీవో అంకిత్‌ బ్యాంకర్లను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల లక్ష్యానికి గాను మంజూరు చేసిన ఆర్థిక స్వావలంబన పథకాలు(ఈఎస్‌ఎస్‌), ఎంఎస్‌ఎంఈ పథకాల అమలుపై బ్యాంకర్లతో సమీక్షించారు. అర్హులైన గిరిజన లబ్ధిదారులకు బ్యాంకు సమ్మతి జారీ చేయాలన్నారు. వోబీఎంఎంఎస్‌ వెబ్‌సైట్‌లో ఫొటోలు, వినియోగ ధ్రువపత్రాలు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. సమ్మతి పత్రం ఇచ్చేందుకు లబ్ధిదారులను బ్యాంకర్లు ఇబ్బందులకు గురి చేయవద్దని, బ్యాంకు చుట్టూ పలుమార్లు తిరగడం వలన పథకాన్ని పొందేందుకు పలువురు ఆసక్తిని కనబరచడం లేదని చెప్పారు. లబ్ధిదారులకు  సకాలంలో సమ్మతి పత్రాలు జారీ చేసేలా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ పరిధిలోని బ్యాంకు కంట్రోలర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్‌ వసంతరావు, ఎస్‌వో రాజ్‌కుమార్‌, ఈఈ హేమలత, చీఫ్‌ మేనేజర్‌ జి.రమేష్‌కుమార్‌, జేకె. జాగోర్‌, థామస్‌ తిరు, శివకుమార్‌, శ్రీనివాసరావు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

బాలికల గురుకుల డిగ్రీ కళాశాల ప్రారంభం 

ఏటూరునాగారం: ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలోని పీఎమ్మార్సీ కార్యాలయం భవనంలో సోమవారం గిరిజన గురుకుల బాలికల డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. గురుకులాల ఆర్‌సీవో రాజ్యలక్ష్మి, వైస్‌ ప్రిన్సిపల్‌ సుజాత, బోధన సిబ్బందితో కలిసి ఆయన కళాశాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ కళాశాల ఒగ్లాపూర్‌లో నిర్వహించారు. ఈ నెల 23 నుంచి ఇక్కడే తరగతుల నిర్వహణ చేపడతామని పీవో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏవీ రాజ్యలక్ష్మి, కె.సుజాత, శైలజ, ప్రీతియాదవ్‌, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

నేడు మంత్రి పర్యటన

పస్రా, (గోవిందరావుపేట), న్యూస్‌టుడే: గోవిందరావుపేట మండలంలో మంగళవారం రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె పస్రాలో మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన అభ్యుదయ కాలనీ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించనున్నారు. అనంతరం దుంపెల్లిగూడెం, చల్వాయి గ్రామాల్లో బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారని తహసీల్దార్‌ ఎ.రాజ్‌కుమార్‌, ఎంపీడీవో జె.ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని