logo

నిర్వాహకుల నిర్లక్ష్యం.. చెల్లింపుల్లో జాప్యం

ధాన్యం మిల్లులకు చేరి రెండు నెలలు దాటినా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి కోసం చేతిలో డబ్బులు లేక ఆందోళన చెందుతున్నారు.

Updated : 21 Mar 2023 07:06 IST

అన్నదాతలకు అందని రూ.1.40 కోట్లు
ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి  - న్యూస్‌టుడే, కాటారం

కాటారంలో రాస్తారోకో చేస్తున్న రైతులు(పాత చిత్రం)

ధాన్యం మిల్లులకు చేరి రెండు నెలలు దాటినా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి కోసం చేతిలో డబ్బులు లేక ఆందోళన చెందుతున్నారు. అన్నదాతకు మద్దతు అందించేందుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మి రోజులు గడుస్తున్నా నగదు జమ కాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాటారం మండలం లక్ష్మీపూర్‌, మల్లారం, విలాసాగర్‌ గ్రామాలకు చెందిన సుమారు 155 మంది రైతులు మాక్స్‌, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించారు. కేంద్రంలో రైతుల ధాన్యం కాంటా అనంతరం రైస్‌ మిల్లులోకి చేర్చిన తర్వాత రైతుల వివరాలను ఓపీఎంస్‌లో ఆన్‌లైన్‌ నమోదు చేయాల్సి ఉంటుంది. ధాన్యాన్ని మిల్లులకు తరలించినా.. నిర్వాహకులు ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయడం విస్మరించారు. అధికారులకు కూడా సమాచారం ఇవ్వలేదు. ప్రభుత్వం సంబంధిత వెబ్‌సైట్ మూసివేయడంతో ఆన్‌లైన్‌ కాక రైతులకు డబ్బుల చెల్లింపుల్లో సమస్యలు తలెత్తాయి. జనవరి 31 వరకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఫిబ్రవరి 8 నుంచి 12వ తేదీ ఉదయం వరకు కూడా అవకాశం మరోసారి ఇచ్చారు. కానీ, అప్పుడు కూడా వివరాలను నమోదు చేయలేదు. అధికారులు దీనిని గుర్తించలేదు. అధికారులు, కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యంతో రైతులకు డబ్బులు చెల్లింపుల్లో జాప్యం అవుతోంది. అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని 6 వేల టన్నులకు సంబంధించి సుమారు రూ.1.40 కోట్ల డబ్బులు రావాల్సి ఉందని రైతులు వాపోతున్నారు. రెండు నెలల పాటు వేచి చూసిన రైతులు డబ్బులు జమ కాకపోవడంతో నిర్వాహకులను నిలదీశారు. రోడ్డెక్కి ధర్నాలు చేపట్టారు. జిల్లా పాలనాధికారిని కలిసి త్వరితగతిన సమస్యను పరిష్కరించి డబ్బులు జమయ్యేలా చూడాలని విన్నవించారు. పెట్టుబడులు, నిత్యావసరాలకు డబ్బులు లేక రైతులు సతమతమవుతున్నామని పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తెప్పించారా అని అధికారులు అనుమానాలు వ్యక్తం చేసి ఇటీవల ఆరా తీశారు. రైతుల ధాన్యమేనని తేలడంతో ప్రత్యేక అనుమతి తీసుకుని, కమీషన్ల నుంచి చెల్లింపులు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

రెండ్రోజుల్లో పంపిణీ -స్వర్ణలత, జేసీ

ధాన్యం కొనుగోలు చేసిన వివరాలను నిర్వాహకులు ఆన్‌లైన్‌ చేయాల్సి ఉంటుంది. వారు సరిగా నమోదు చేయలేదు. సమాచారం అధికారులకు సకాలంలో ఇవ్వలేదు. దీంతో డబ్బుల చెల్లింపుల్లో జాప్యమైంది. రెండ్రోజుల్లో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లిస్తాం. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని