logo

పది పరీక్షల వేళ.. కేంద్రాల్లో సమస్యలు ఇలా..

జిల్లాలో ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణపై ఇటీవల సమావేశాలు నిర్వహించి.. పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Published : 21 Mar 2023 04:24 IST

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణపై ఇటీవల సమావేశాలు నిర్వహించి.. పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. చాలా పాఠశాలల్లో అరకొర వసతులే ఉన్నాయి. పరీక్షలకు కేవలం 13 రోజుల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలపై సోమవారం న్యూస్‌టుడే పరిశీలన చేపట్టింది. ఆ వివరాలివి..


జాడలేని పంకాలు, దీపాలు

చెత్తాచెదారంతో మరుగుదొడ్డి

జనగామ ధర్మకంచలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 135 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. విద్యుత్తు సౌకర్యం ఉన్నప్పటికీ తరగతిగదుల్లో దీపాలు లేవు. కొన్ని గదుల్లో ఒక్కో ఫ్యాన్‌ ఉన్నా పని చేయడం లేదు. మిగతా గదుల్లో ఫ్యాన్లే లేవు. విద్యార్థులు ఉక్కపోతతో పరీక్ష రాయాల్సిన దుస్థితి. సరిపడా మరుగుదొడ్లు లేవు. ఉన్నవి కూడా అపరిశుభ్రంగా ఉండడంతో దుర్గంధం వస్తోంది. కొత్త భవనానికి వచ్చేమార్గంలో పాఠశాల గోడ శిథిలావస్థకు చేరడంతో ప్రమాదకరంగా ఉంది.

న్యూస్‌టుడే, జనగామ అర్బన్‌


అధ్వానంగా మూత్రశాలలు

జఫర్‌గఢ్‌ ఆదర్శ పాఠశాలలో..

జఫర్‌గఢ్‌లోని ఆదర్శ ఉన్నత పాఠశాలలో 175 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. బాలురకు కేటాయించిన 2 మరుగుదొడ్లు, 8 మూత్రశాలలు అధ్వానంగా ఉన్నాయి. మరుగుదొడ్డిలో బేసిన్‌ శిథిలమైంది. మరో మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉండడంతో దుర్గంధం వస్తోంది.  కొన్ని తరగతి గదులకు తలుపులు లేవు.

న్యూస్‌టుడే, జఫర్‌గఢ్‌


విరిగిపోయిన తలుపులు

బచ్చన్నపేటలో తలుపు లేని గది

బచ్చన్నపేటలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తరగతి గదులకు, కిటికీలకు తలుపులు విరిగిపోయాయి. విద్యుత్‌ సౌకర్యం ఉన్నా తరగతి గదుల్లో విద్యుత్తు దీపాలు, ఫ్యాన్లు లేవు. పాఠశాలలోని విద్యార్థులు ప్రస్తుతం బోరు నీటినే తాగుతున్నారు. శుద్ధి చేసిన నీరు అందుబాటులో లేదు.

న్యూస్‌టుడే, బచ్చన్నపేట


అపరిశుభ్రంగా గదులు 

కొడకండ్లలో..

కొడకండ్ల మండలంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో 393 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో నాలుగు గదుల్లో సౌకర్యాలు లేవు. ఈ కేంద్రాల్లో గదులను శుభ్రం చేసి విద్యుత్తు, ఫ్యాన్లు, దీపాలు, డెస్క్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంది. పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్లకు నీటి సదుపాయం లేకపోవడంతో అపరిశుభ్రంగా ఉన్నాయి.

న్యూస్‌టుడే, కొడకండ్ల


తాగునీటి సౌకర్యం కరవు

పాలకుర్తి ఉన్నత పాఠశాలలో దీపం లేని గది

పాలకుర్తిలోని జడ్పీ ఉన్నతపాఠశాలలో వసతులు అరకొరగానే ఉన్నాయి. విద్యుత్తు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. తీగలు సరిగ్గా లేవు. తరగతి గదుల్లో దీపాలు లేవు. ఫ్యాన్లు ఉన్నా తిరగడం లేదు. ఒక పరీక్ష కేంద్రంలో తాగు నీటి సౌకర్యం ఉండగా.. మరో కేంద్రంలో లేదు. మూత్రశాలలు అరకొరగానే ఉన్నాయి.

న్యూస్‌టుడే, పాలకుర్తి


ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం..

-రాము, జిల్లా విద్యాశాఖాధికారి

పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని పాఠశాలల నిర్వాహకులకు సూచించాం.  కలెక్టర్‌ నిర్వహించిన సమన్వయ సమావేశంలోనూ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. కేంద్రాల్లో గుర్తించిన సమస్యలపై దృష్టి సారిస్తాం. పరీక్షల సమయం వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. 

జిల్లాలో పరీక్ష కేంద్రాలు :  42
హాజరు కానున్న విద్యార్థులు : 6748

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని