logo

కన్నీరే మిగిలింది.. ఆదుకోండి సారూ!

‘ముఖ్యమంత్రి సారూ! ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా నీటి పాలైంది. వాన దేవుడి దెబ్బకు ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. మొక్కజొన్నంతా నేల వాలింది.

Published : 23 Mar 2023 05:23 IST

 నేడు మహబూబాబాద్‌ వరంగల్‌, జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన
ఈనాడు, వరంగల్‌, ఈనాడు డిజిటల్‌,  మహబూబాబాద్‌, నర్సంపేట, వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే


‘ముఖ్యమంత్రి సారూ! ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా నీటి పాలైంది. వాన దేవుడి దెబ్బకు ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. మొక్కజొన్నంతా నేల వాలింది. రూ.లక్షలు పోసి సాగు చేసిన మిర్చి.. రాళ్ల దెబ్బలకు అక్కరకు రాకుండా పోయింది. వరి, కూరగాయలు అన్నీ ఆగమయ్యాయి. గతేడాది రాళ్లవానకు పంటలు కోల్పోయి దిక్కు  తోచని స్థితిలో ఉన్న మాపై మళ్లీ వరుణుడు కన్నెర్రజేశాడు..   మునిగిన మా పంటల్ని చూసి కరుణించండి. మరోసారి పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. మా శ్రమకు తగ్గ       పరిహారం ఇచ్చి ఆదుకోండి’
సహాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు ముఖ్యమంత్రికి చేసుకుంటున్న వేడుకోలు ఇది..


రెక్కల కష్టం.. వడగళ్ల పాలైంది..
నేలతల్లిని నమ్మితే గుండెకోత  మిగిలింది!
అందరి కడుపు నింపే  అన్నదాతకు..
అప్పుల కుప్పే సుడిగుండమైంది.


ముఖ్యమంత్రి పర్యటన ఇలా..

మధ్యాహ్నం 12.10: ఖమ్మం నుంచి హెలికాప్టర్‌లో మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాకు చేరుకుంటారు.  
12.55: వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపూర్‌ గ్రామానికి వస్తారు.
1.30: కరీంనగర్‌ జిల్లాకు బయలుదేరుతారు.  


ఏడాదిగా ఎదురుచూపులు

ఇటీవల కురిసిన వడగళ్ల వర్షంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. గతేడాదీ  రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2021 డిసెంబరు, 2022 జనవరి నెలల్లో కురిసిన వానలకు మిర్చి, పత్తి, మొక్కజొన్న మట్టిపాలైంది.  గతేడాది జనవరిలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి.. పరకాల, నర్సంపేట, భూపాలపల్లి ప్రాంతాల్లో పర్యటించి వెంటనే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. ఏడాది గడిచినా కొందరికి పరిహారం రాలేదు. ఇప్పుడిప్పుడే కొందరికి చెక్కులను ప్రభుత్వం అందిస్తోంది. గత అనుభవం దృష్ట్యా ఈసారి నష్ట పరిహారం వీలైనంత త్వరగా ఇస్తే రైతుల కన్నీళ్లను కొంత వరకైనా ప్రభుత్వం తుడిచినట్టు అవుతుంది.  

వ్యయం కొండంత.. పరిహారం గోరంత!

ఈసారి యాసంగిలో వరి సమానంగా సాగవుతున్న మొక్కజొన్న ఆశలపై వడగళ్లు దెబ్బకొట్టాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,17,355 ఎకరాల పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. ఇందులో సగానికిపైగా మరో పది రోజుల్లో చేతికొచ్చే పంటను కర్షకులు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. పంటకు పెట్టిన పెట్టుబడి వ్యయం కొండంత అయితే సర్కారు ఇచ్చే పరిహారం మాత్రం గోరంత ఉంటోంది. అది వారికి ఏ మాత్రం ఆసరా ఇవ్వని దుస్థితి.

* నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన చిబిరాల చక్రపాణి గతేడాది మునగ తోట సాగు చేశారు. వానలకు ఎకరంన్నర మేర దెబ్బతింది. ఈ ఏడాది మొక్కజొన్న పంట కూడా ధ్వంసమైంది. వరుసగా రెండేళ్లు తీవ్రంగా నష్టపోయారు. ఎకరానికి రూ. లక్ష పెట్టుబడి పెడుతున్నామని, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇస్తున్న ఇన్‌పుట్‌ సబ్సిడీ సరిపోవడం లేదన్నారు.
*  వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం సింగ్యా తండాకు చెందిన బదావత్‌ మోతిలాల్‌, బూలమ్మ దంపతులు రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న వేయగా వడగళ్ల వర్షానికి ఎందుకు పనికి రాకుండా పోయింది. కూరగాయల పంటలు కూడా మిగలలేదు. తనకు ఇద్దరు ఆడపిల్లలని.. రూ.రెండు లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టానని.. ఆదుకోవాని వేడుకున్నారు.
 

*వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం రేఖంపల్లి గ్రామానికి చెందిన మట్టెవాడ రాజయ్య తనకున్న  భూమితోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశారు. పెట్టుబడి రూ.నాలుగు లక్షలు అయ్యాయని.. అకాల వర్షంతో మొత్తం నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు సార్లు నష్టపోయారు

ఈ రైతు పేరు ముస్కుల దేవేందర్‌రెడ్డి. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామం. గతేడాది వడగళ్ల వాన కురిసి రెండెకరాల్లో మిర్చి, ఎకరంలో మొక్కజొన్న నష్టపోయారు. తాజాగా కురిసిన అకాల వర్షానికి రెండెకరాల్లో మొక్కజొన్న, ఎకరం మిర్చి పూర్తిగా నష్టపోయారు. అప్పటి పరిహారం ఇప్పటికీ అందలేదని దేవేందర్‌ చెప్పారు. పంటల బీమా పథకాన్ని గ్రామం యూనిట్‌గా అమలు చేయాలని, పంటల గిట్టుబాటు ధరలు స్థిరీకరించాలని ఈ రైతు కోరుతున్నారు.

అన్నీ పోయాయి.. అప్పులు మిగిలాయి

గీసుకొండ మండలం మరియపురం గ్రామానికి చెందిన రైతు కౌడగాని రవీందర్‌ పత్తి, మొక్కజొన్న కలిపి మూడెకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న పూర్తిగా నేలపాలైందని.. ఒక ఎకరంలో వేసిన మల్లెపూల తోట పనికి రాకుండా పోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. రూ.3 లక్షలు అప్పు మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.


ఇప్పటికీ సాయం అందలేదు
- అల్లె రాజు, మిర్చి రైతు, రాయపర్తి, నడికూడ మండలం

గతేడాది 20 ఎకరాలు కౌలుకు తీసుకుని రూ.10 లక్షల పెట్టుబడితో మిర్చి సాగు చేశాను. వడగళ్ల వర్షంతో పంట దెబ్బతింది. రూ.30 లక్షల నష్టం వాటిల్లింది. మంత్రులు, అధికారులు వచ్చారు. పంట నష్టపరిహారం లెక్కలు రాసుకుపోయారు. ఇప్పటి వరకు  సాయం అందలేదు. అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని