logo

అటు చదువు.. ఇటు కరాటే

బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాల్లోని విద్యార్థినులకు ప్రభుత్వం కరాటేలో శిక్షణ ఇస్తోంది. 

Updated : 24 Mar 2023 05:22 IST

ప్రతిభ చాటుతున్న కస్తూర్బా విద్యార్థినులు

సినీ హీరో సుమన్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకుంటున్న విద్యార్థినులు

తొర్రూరు, న్యూస్‌టుడే: బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాల్లోని విద్యార్థినులకు ప్రభుత్వం కరాటేలో శిక్షణ ఇస్తోంది.  తొర్రూరులోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు చదువుతో పాటు కరాటేలో రాణిస్తున్నారు. ఫిబ్రవరి 26న వరంగల్‌లోని ఇండోర్‌ మైదానంలో జరిగిన కరాటే పోటీల్లో 15 మంది బంగారు, ఆరుగురు రజత, 8 మంది కాంస్య పతకాలతో 2023 ఛాంపియన్‌షిప్‌ కప్‌ను కైవసం చేసుకున్నారు. కరాటే శిక్షకుడు క్రాంతికుమార్‌ ఆధ్వర్యంలో వీరు శిక్షణ పొందారు. ఈ నెల 1న పాఠశాలలో జరిగిన సన్మాన కార్యక్రమంలో డీఈవో రామారావు చేతుల మీదుగా కప్‌ అందుకున్నారు.

జూనియర్‌ విభాగంలో విజేతలుగా..

గత నెల 16న సుమన్‌ షాటోకాన్‌ స్పోర్ట్స్‌ కరాటే జాతీయస్థాయి ఛాంపియన్‌ షిప్‌- 2023 పోటీలను  వరంగల్‌లోని ఇండోర్‌ మైదానంలో నిర్వహించారు. జూనియర్‌ విభాగంలో 6, 7, 8, 9 తరగతులకు చెందిన 29 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. బంగారు పతకాలు సాధించిన వారిలో తొమ్మిదో తరగతి చదువుతున్న నవ్య, శ్రామిక, విద్య, రాజాశ్రీ, శిరీష, సంధ్య, సుష్మ, చందన, లావణ్య, జ్యోతి, 8వ తరగతికి చెందిన అనూష, ప్రసన్న.. 7, 6 తరగతులకు చెందిన స్పందన, ఇంద్రజ, భానుమతి ఉన్నారు. వెండి పతకాలు సాధించిన వారిలో రజిని, శ్రీవల్లి, కావేరి, అఖిల, సృజన, దివ్య ఉన్నారు. కాంస్య పతకాలు సాధించిన వారిలో సింధూజ, సాయిప్రియ, మైత్రి, నందిని, వైష్ణవి, గుణేశ్వరి, ప్రవణశ్రీ, దివ్య ఉన్నారు. మొత్తం 29 మంది పోటీల్లో పాల్గొనగా 28 మంది బాలికలు బహుమతులు కైవసం చేసుకున్నారు. సినీ హీరో, సుమన్‌ షాటోకాన్‌ స్పోర్ట్స్‌ కరాటే వ్యవస్థాపకుడు సుమన్‌ విజేతలకు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.


ఆత్మరక్షణకు ఎంతో ముఖ్యం : నవ్య

గత నెలలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించడం సంతోషంగా ఉంది. బాలికల్లో ఆత్మరక్షణకు కరాటే ఎంతో ముఖ్యం. విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుంది. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధిస్తాననే నమ్మకం పెరిగింది.


ఉద్యోగాలు సాధించే అవకాశం: అనూష

జాతీయస్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించడం గర్వంగా ఉంది. ప్రతి రోజూ కరాటేలో శిక్షణ పొందుతున్నాను. జాతీయస్థాయి పోటీల్లో రాణించడంతో ఉన్నత విద్యతో పాటు క్రీడా కోటాలో ఉద్యోగాలు సాధించే అవకాశం ఉందని శిక్షకులు తెలిపారు. డీఈవో సార్‌ అభినందించడం మరిచిపోలేని సంఘటన.


డీఈవో ప్రోత్సాహంతో..
 - శైలజ, ప్రత్యేకాధికారిణి, కేజీబీవీ, తొర్రూరు.

జాతీయస్థాయి కరాటే పోటీల్లో మా విద్యార్థినులు అత్యధిక పతకాలు సాధించి ఛాంపియన్‌ షిప్‌ కప్‌ను గెలవడం సంతోషంగా ఉంది. జిల్లా విద్యాధికారి రామారావు, జీసీడీవో విజయకుమారి ప్రోత్సాహం ఎంతో ఉంది. బాలికలు చదువుతో పాటు క్రీడల్లో రాణించడం అభినందనీయం. వారికి తగిన ప్రోత్సాహంతో పాటు సహకారం అందిస్తున్నాం. విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం పెరిగి భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధిస్తామనే నమ్మకం ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని