logo

బ్యాంకులో చోరీకి యత్నం

మల్హర్‌ మండలం కొయ్యూర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీ యత్నం కలకలం రేపుతోంది. నిత్యం రద్దీగా ఉండే కాటారం, మంథని ప్రధాన రహదారి పక్కనే ఉన్న బ్యాంకులో ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది.

Published : 24 Mar 2023 04:25 IST

కొయ్యూర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌

మల్హర్‌ (భూపాలపల్లి), న్యూస్‌టుడే: మల్హర్‌ మండలం కొయ్యూర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీ యత్నం కలకలం రేపుతోంది. నిత్యం రద్దీగా ఉండే కాటారం, మంథని ప్రధాన రహదారి పక్కనే ఉన్న బ్యాంకులో ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. గ్యాస్‌ కట్టర్ల సాయంతో దొంగలు తలుపులు, కిటికీలను ధ్వంసం చేసి బ్యాంకులోకి  చొరబడేందుకు యత్నించారు. గ్యాస్‌ లీక్‌ కావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బుధవారం ఉగాది సందర్భంగా బ్యాంకుకు సెలవు. గురువారం విధులకు వచ్చిన బ్యాంకు సిబ్బంది గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాటారం సీఐ రంజిత్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. జాగిలాలతో పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. క్లూస్‌ టీం అధికారులు పలు నమూనాలు సేకరించారు. బ్యాంకులో నగదు, బంగారం చోరీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేసిన కిటికీ,  చోరికి వినియోగించిన సిలిండర్‌

పక్కా ప్రణాళికతో..

బ్యాంక్‌ చోరీకి దుండగులు పక్కా ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ముందుగా ప్రధాన ద్వారం ముందు ఉన్న సీసీ కెమెరాను ధ్వంసం చేశారు. బ్యాంకు సమీపంలో ఓ వెల్డింగ్‌ దుకాణంలోని గ్యాస్‌, కట్టర్‌ను వినియోగించారు. బ్యాంకు భవనం పక్కనున్న చిన్న గేట్‌ తాళాన్ని తొలగించారు. అక్కడి సందిలోంచి కిటికీల ద్వారా లోపలికి వెళ్లాలని నిర్ణయించుకుని కిటికీలను తొలగించే క్రమంలో గ్యాస్‌ లీకేజీ కావడంతో అన్నీ అక్కడే వదిలేసి పారిపోయారు. కాగా తన దుకాణంలోని గ్యాస్‌ బండ, కట్టర్‌ దొంగిలించారని యజమాని బుధవారం కొయ్యూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోపే చోరీ ఘటన వెలుగుచూడటం గమనార్హం. వెల్డింగ్‌ యజమాని, చుట్టూ పరిసర ప్రాంతాల్లోని వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.

నిందితులను పట్టుకుంటాం

బ్యాంకు చోరీకి యత్నించిన నిందితులను పట్టుకుంటామని సీఐ రంజిత్‌రావు తెలిపారు. అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నామని వెల్లడించారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎలాంటి సొత్తు అపహరించుకుపోలేదని బ్యాంకు మేనేజర్‌ అవినాష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని