logo

పోషకాహారం.. ఆరోగ్యానికి సహకారం

ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తప్పనిసరి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారం ఎంతో ముఖ్యం.

Published : 24 Mar 2023 04:46 IST

సీఆర్‌నగర్‌లో అక్షరాభ్యాసం చేయిస్తున్న అంగన్‌వాడీ టీచర్‌ (పాత చిత్రం)

భూపాలపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే:  ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తప్పనిసరి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారం ఎంతో ముఖ్యం. పౌష్టికాహారం తీసుకోవడంతో గర్భిణులు, పుట్టబోయే బిడ్డ, బాలింతలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారు. పోషకాహారం లోపిస్తే పలు రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. సమతుల ఆహార లోపంతో అనారోగ్యానికి గురై మరణాలు సంభవించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లోపంతో గర్భిణులు, చిన్నారులు, బాలింతలు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేక రుగ్మతలకు గురవుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాలు కలిగిన ఆహారం అందించడమే కాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించే విధంగా జిల్లా వ్యాప్తంగా మార్చి 20 నుంచి ఏప్రిల్‌ 3 వరకు పోషణ్‌ పక్వాడ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తీసుకోవాల్సిన పౌష్టికాహారంతో పాటు చిరుధాన్యాల ప్రాముఖ్యత తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.

అనారోగ్య నివారణకు..

పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడంతో మానసిక ఎదుగుదల బాగుండటంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. బుద్ధి మాంద్యం, మృత శిశువుల జననం, పిల్లల మరణాలు, పురుటి నొప్పుల మరణాలు నివారించవచ్చు. పిల్లలు ఏకాగ్రత కలిగి చురుగ్గా ఉంటారు. చిన్నారులు పెరిగే కొద్ది శిశువుకు ఇచ్చే ఆహారం మెత్తగా సులభంగా తినేలా ఉండాలి. ఇంట్లో వినియోగించే బియ్యం, గోదుమలు, జొన్నలు, సజ్జలు లాంటి ధాన్యాలు, పెసర, శనగ, పుట్నాలు తదితర పప్పు దినుసులు, వేరుశనగ, నువ్వులు, చక్కెర, బెల్లం తదితర వాటితో అదనపు ఆహార పదార్థాలను తయారు చేసి అందించడం వలన పోషకాలు సమృద్ధిగా అందుతాయి.


రోజుకో కార్యక్రమం

పోషణ్‌ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్‌ ప్రాజెక్టు, అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఆరోగ్యకరమైన అంశాలపై 15 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. చిరుధాన్యాలతో కలిగే లాభాలు, పరిసరాల పరిశుభ్రత, పోషకాహార అవగాహన, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించడంతో పాటు రక్తహీనతతో కలిగే నష్టాలు, కిషోర బాలికలకు అవగాహన సదస్సు తదితర కార్యక్రమాలను చేపట్టనున్నారు. చిన్నారుల తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలను అంగన్‌వాడీ కేంద్రాలకు పిలిపించి పౌష్టికాహారం తయారు చేయాల్సిన విధానంపై అవగాహన కల్పించడం, చేతుల శుభ్రత, తల్లిపాల ప్రాముఖ్యతపై వివరించనున్నారు. వయసుకు తగిన ఎత్తు, బరువు లేని పిల్లలను గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలను చేపడతారు.


సద్వినియోగం చేసుకోవాలి
- అవంతి, ఐసీడీఎస్‌ సీడీపీవో, భూపాలపల్లి

పోషణ్‌ పక్వాడ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా చిరుధాన్యాల వల్ల కలిగే లాభాలు, పౌష్టికాహారం తీసుకోవడం, తయారు చేయడం తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నాం. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత తదితర వాటిపై చిన్నారుల తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలను అంగన్‌వాడీ కేంద్రాలకు పిలిపించి అవగాహన కల్పిస్తాం. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు