logo

భూసార పరీక్షలకు ఇదే అదును!

సాగు చేసే వ్యవసాయ భూములు ఏఏ పంటలకు అనుకూలంగా ఉంటాయో.. భూముల్లోని పోషకాల సాంద్రత స్థాయి ఏమిటో.. పొలం, చెలకకు ఏఏ ఎరువులు ఎప్పుడెప్పుడు వాడాలో ముందే తెలిస్తే రైతులు తాము పండించిన పంటల నుంచి ఆదాయం పొందడం ఖాయం.

Published : 24 Mar 2023 04:46 IST

పాలకుర్తి శివారులోని సాగు భూమి..

పాలకుర్తి, న్యూస్‌టుడే: సాగు చేసే వ్యవసాయ భూములు ఏఏ పంటలకు అనుకూలంగా ఉంటాయో.. భూముల్లోని పోషకాల సాంద్రత స్థాయి ఏమిటో.. పొలం, చెలకకు ఏఏ ఎరువులు ఎప్పుడెప్పుడు వాడాలో ముందే తెలిస్తే రైతులు తాము పండించిన పంటల నుంచి ఆదాయం పొందడం ఖాయం. ఇందుకోసం రైతులు సాగుకు ముందే  భూముల్లోని మట్టికి తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతి పరంగా పంటలకు అనుకూలమైన వాతావరణం లేకపోవడం, సరైన వర్షాలు పడకపోవడంతో మెట్ట ప్రాంతాల రైతులు ప్రతి ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. పంటల సాగుకు చేసిన అప్పులు తీర్చలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు.

అవగాహన లేక అన్నదాతల వెనుకంజ

రైతులకు పంటల సాగుపై ఉన్న శ్రద్ధ.. భూమిలోని పోషకాల స్థితిని తెలుసుకోవడంపై ఉండడం లేదు. దీంతో విరివిగా రసాయన ఎరువులను వాడటంతో భూమిలో పోషకాలు దెబ్బతిని ఆశించినస్థాయిలో దిగుబడి రావడం లేదు. నేల స్వభావం తెలియక అతిగా క్రిమి సంహారక మందులు, ఎరువులను వినియోగిస్తుండడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. భూసార పరీక్షల ప్రాధాన్యంపై రైతు సదస్సులు, సమావేశాల్లో వ్యవసాయాధికారులు, సిబ్బంది పదేపదే చెబుతున్నా.. రైతులు ఆసక్తి చూపడం లేదు. అంతేకాక భూసార పరీక్షల ఫలితాలను సమయానికి అందించడం లేదని తెలుస్తోంది.

అధిక దిగుబడులు

భూమిలోని లోపాలను తెలుసుకోకుండా ఇష్టారీతిన పొలాల్లో  ఎరువులు, మందులను వాడుతుండడంతో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆర్థికభారంతో కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. అదే భూసార పరీక్షలు చేయించుకుంటే భూమిలోని ఉదజని, లవణ సూచిక పోషకాలతో పాటు నత్రజని, భాస్వరం, పొటాష్‌ల లభ్యతను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకనుగుణంగా సాగు చేస్తే పంట దిగుబడి పెరగడంతో పాటు ఎన్నో ప్రయోజనాలుంటాయి. రైతులు మంచి ఆదాయంతో వ్యవసాయంలో నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది.

జిల్లాలో రైతుల సంఖ్య : 1.65 లక్షలు
సాగు భూమి : 3,75,000 ఎకరాలు


అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం..
- పరశురామ్‌, ఏడీఏ పాలకుర్తి

రైతులు తప్పకుండా భూసార పరీక్షలు చేయించుకోవాలి. ఈ సమయం అనుకూలమైంది. వేసవిలో దుక్కి సిద్ధం చేసుకొని అధికారులకు మట్టి నమూనాలను ఇస్తే వారే పరీక్ష చేసి నివేదిక అందిస్తారు. భూమిలోని పోషకాలు, లవణాల లభ్యత తెలుసుకుంటే వాటి ఆధారంగా ఏఏ పంటలు వేసుకోవాలో గుర్తించవచ్చు.  అదేరీతిలో ఎరువులను కూడా వాడొచ్చు. గ్రామాల్లో నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు