logo

పెరుగుతున్న క్షయ రోగులు

వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో క్షయ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు.  2025 నాటికి క్షయను దేశం నుంచి దూరం చేయాలన్న భారత ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి జిల్లాల క్షయ నిర్మూలన శాఖలు చర్యలు చేపడుతున్నా..

Published : 24 Mar 2023 04:46 IST

ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే

క్షయ వ్యాధిని నిర్ధారించే సిబినట్ యంత్రం

వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో క్షయ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు.  2025 నాటికి క్షయను దేశం నుంచి దూరం చేయాలన్న భారత ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి జిల్లాల క్షయ నిర్మూలన శాఖలు చర్యలు చేపడుతున్నా.. మరోపక్క చాప కింద నీరులా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నేడు ప్రపంచ క్షయ నిర్మూలన దినం సందర్భంగా వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో క్షయ వ్యాధి నిర్మూలన చర్యలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.  

వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో క్షయ వ్యాధి గుర్తింపునకు ల్యాబ్‌టెక్నీషియన్లు తెమడ పరీక్షలు చేయడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు. పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల్లో పరీక్ష చేయడానికి ఇబ్బంది కలిగితే వారు తెమడ పూతను వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి దగ్గర ఉన్న వరంగల్‌, హనుమకొండ జిల్లాల క్షయ నిర్మూలన కేంద్రంలో సిబినట్‌ యంత్ర సాయంతో 48 గంటల్లో వ్యాధి నిర్ధరణ చేసి నివేదిక ఇస్తారు. ఇక్కడ వ్యాధి నిర్ధారణ కానప్పుడు(ఉదా: ఊపిరితిత్తుల్లో క్షయ) తెమడతోపాటు ఎక్స్‌రే పరీక్ష చేస్తారు. అందులోనూ నిర్ధారణ కాకపోతే ఎల్‌పీఏ, ఎంజీఐటీ, లిక్విడ్‌ కల్చర్‌ పరీక్షలను హైదరాబాద్‌ లో చేయిస్తున్నారు. ఈ వ్యాధిగ్రస్తులకు మంచి పోషకాహారం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నిక్షయ్‌ పోషణ్‌ యోజన కింద రోగులకు ప్రతి నెలా రూ.500 చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తుండగా, వరంగల్‌ జిల్లాలో 882 మంది, హనుమకొండ జిల్లాలో 818 మంది రోగులు ప్రయోజనం పొందుతున్నారు.

అందుబాటులోకి రాని ల్యాబు

కాకతీయ మెడికల్‌ కాలేజీలో కేంద్ర ప్రభుత్వ క్షయ నిర్మూలన సంస్థ నిధులతో ఏర్పాటు చేసిన మైక్రో బ్యాక్టీరియల్‌ కల్చర్‌ డ్రగ్‌ రెసిస్టెన్స్‌ నిర్ధారణ కేంద్రం(ఐఆర్‌ఎల్‌ కల్చర్‌ డీఎస్‌సి ల్యాబు) ఇప్పటివరకు ప్రారంభించలేకపోయారు. ఇది ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.  మూడేళ్లక్రితం పునాది వేయగా, గత సంవత్సరం నవంబరులో తెలంగాణ వైద్యసేవలు మౌలిక సదుపాయాల సంస్థ ల్యాబుకు అవసరమైన నిర్మాణాన్ని పూర్తిచేసింది. ల్యాబు యంత్రాలు వచ్చినా ఇప్పటికీ అమర్చకుండా బయటనే ఉంచారు. దీంతో ల్యాబు ఇప్పటికీ ప్రారంభించలేకపోయారు. ఈ ల్యాబు ప్రారంభమైతే రోగ నిర్ధారణ, చికిత్స సులభతరం కానుంది. ఇది ప్రారంభించకపోవడం వల్ల కొన్ని తెమడ పరీక్షలను హైదరాబాద్‌లోని ప్రభుత్వ నిర్ధారణ కేంద్రంలో చేయించాల్సి వస్తోంది.  


ఈ లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి
డాక్టర్‌ సుధార్‌సింగ్‌,  క్షయ నివారణ అధికారి, వరంగల్‌ జిల్లా

రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలున్నట్లయితే దగ్గరలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుడ్ని సంప్రదిస్తే వ్యాధినిర్ధారణ పరీక్షలు చేసి చికిత్స అందిస్తారు. ప్రాథమిక దశలోనే గుర్తించి సక్రమంగా మందులు వాడితే వ్యాధి నుంచి త్వరగా బయటపడొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని