నిరాశ వద్దు.. కొలువే హద్దు
గ్రూపు-1 ఉద్యోగం సాధన ఎంతో మంది యువత ప్రధాన లక్ష్యం. అందుకు ఎంతో మంది నెలలు, ఏళ్లుగా అహర్నిశలు కష్టపడ్డారు.
న్యూస్‌టుడే, రంగంపేట, నర్సంపేట: గ్రూపు-1 ఉద్యోగం సాధన ఎంతో మంది యువత ప్రధాన లక్ష్యం. అందుకు ఎంతో మంది నెలలు, ఏళ్లుగా అహర్నిశలు కష్టపడ్డారు. చాలా మంది ఇళ్లకు దూరంగా నగరాల్లో, పట్టణాల్లో ఉండి పుస్తకాలతో కుస్తీ పట్టారు. 2022 అక్టోబరు 16న జరిగిన గ్రూప్-1 పరీక్ష ప్రిలిమ్స్ పరీక్షను వేలాది మంది రాశారు. పోటీ పరీక్షల పేపర్ల లీకేజీ క్రమంలో ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసింది. మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో ఉద్యోగార్థుల్లో నైరాశ్యం నెలకొంది. రెండు, మూడు రోజులు డీలా పడిన యువత ఇప్పుడిప్పుడే మళ్లీ తేరుకొని పరీక్షకు సై అంటున్నారు.
గ్రూప్1 పరీక్షకు జిల్లా నుంచి వేలాది మంది యువకులు రాత్రనక పగలనక కష్టపడి చదివారు. ఉదయాన్నే గ్రంథాలయాలకు వచ్చి రాత్రి తిరిగి మూసేవరకు పుస్తకాలతో కుస్తీ పట్టారు. ఆహారం కూడా తినకుండా చదువుకుంటున్న యువత పోటీతత్వం చూసి అధికారులు ఆయా గ్రంథాలయాల వద్ద రూ.5కే భోజనం కూడా ఏర్పాటుచేశారు. అలా జిల్లా నుంచి వేలాది మంది ప్రిలిమ్స్‌కు సిద్ధమయ్యారు. అక్టోబరు 16న పరీక్ష రాయగా, జనవరి 13న ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణులైన వారి నుంచి 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేశారు. విజయం సాధించిన వారు మెయిన్స్‌కు సిద్ధం అవుతున్న తరుణంలో ప్రశ్నపత్రాల లీకేజీ వీరి పాలిట అశనిపాతమైంది. ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తిరిగి కష్టపడి చదవాల్సి వస్తోంది. వరంగల్ రంగంపేటలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం, వరంగల్ ఎల్లమ్మబజారు జిల్లా గ్రంథాలయంలో నిరుద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుతున్నారు. నిరాశ వీడి ఆశావహ దృక్పథంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని గ్రూపు పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందిన సీనియర్లు అంటున్నారు. రాసిన వెంటనే కొలువు సాధించలేదని, రెండు మూడు సార్లు ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, పోటీపడి చదివి నెగ్గామంటున్నారు.
ఏడు నెలలు చదివాను: కిరణ్, వరంగల్
నేను ఏంఎ ఎకనామిక్స్, బీఎడ్ చేశాను. గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష కోసం ఏడు నెలలుగా చదివాను. మెయిన్స్‌కు అర్హతకు పొందాను. ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో ఎంతో శ్రద్ధగా చదువుతున్నాను. ప్రశ్నపత్రం లీకేజీ పేరుతో ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయడంతో మానసికంగా కుంగి పోయాను. మళ్లీ మొదటి నుంచి చదవాల్సి వస్తోంది. టీఎస్‌పీఎస్సీపై నమ్మకం పోయింది. ఈసారైనా జాగ్రత్తగా నిర్వహిస్తే ఉద్యోగం సాధించగలననే నమ్మకముంది.
మళ్లీ లక్ష్యం కోసం శ్రమిస్తున్నా: తీగల రజిత, వరంగల్
నేను దివ్యాంగురాలిని. పీజీ చదివాను. ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నా. గ్రూపు-1 కొట్టాలనేది నా లక్ష్యం. ఏడాదిన్నర నుంచి పరీక్షకు సిద్ధమయ్యా. ప్రిలిమ్స్ పాసై మెయిన్స్‌కు అర్హత సాధించాను. ప్రశ్నపత్రం లీకేజీ పేరుతో ప్రిలిమ్స్ రద్దు చేయడం బాధనిపించింది. కష్టపడి చదివే వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింది. వందలాది మంది యువతీ, యువకులు నిరుత్సాహం చెందారు.మళ్లీ లక్ష్యం కోసం శ్రమిస్తున్నా.
సమాయత్తం అవుతున్నా: ముగ్దంగుల సంధ్య, డీటీ కరకగూడెం(అశోక్‌నగర్)
నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం చేస్తున్నాను. 2016లో జరిగిన గ్రూపు 2 పరీక్ష రాసి 2020లో ఉద్యోగంలో చేరాను. గ్రూప్ 1 ఉద్యోగం కావాలనే సంకల్పంతో ప్రిలిమ్స్ పరీక్ష రాసి అర్హత పొందాను. పేపర్ లీకేజీతో ఆ పరీక్ష రద్దు అయింది. జరిగిన దానికి బాధపడకుండా ఉన్న సమయంలో మరింత పట్టుదలగా చదివి నా ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు కృషి చేస్తున్నాను.
కష్టపడక తప్పదు: బేతి జ్యోతి, నర్సంపేట
లీకైన పేపరు ఎవరికైతే అందిందో వారిని గుర్తించి వేటు వేస్తే సరిపోయేది. కాని గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. నేను ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ రాత్రింబవళ్లు కష్టపడి చదివి ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత పొందాను. మొయిన్స్ కోసం ప్రణాళిక పద్దతిలో సమాయత్తం అవుతున్న క్రమంలో ప్రిలిమ్స్ రద్దు చేయడం బాధనిపించింది. ఇప్పుడు ప్రిలిమ్స్ కోసం కష్టపడక తప్పదు. ఏమైనా సర్కార్ తప్పునకు తాము బలికావాల్సి వచ్చింది.
సన్నద్ధతకు సమయం కేటాయిస్తే విజయం మీదే
-పతంగి భాస్కర్, డీటీ టేకుమట్ల (నర్సంపేట)
ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయడం అర్హత పొందిన వారికి తీరని బాధ కలిగిస్తుందనేది నిజం. దాని గురించి ఆలోచించకుండా ఉన్న సమయాన్ని సన్నద్ధతను మెరుగుపర్చుకునేందుకు ఉపయోగించుకోవాలి. మరింత పట్టుదలగా చదివి మెరుగైన ఫలితాలు పొందొచ్చు. తాను ఒకటి, రెండు సార్లు పరీక్ష రాసి విఫలమైనా పట్టువీడకుండా గ్రూప్ 2 రాసి కొలువు పొందాను. ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఒకసారి విఫలమైనా..
- డాక్టర్ భూక్య నర్సింహస్వామి, ఐఎఫ్‌ఎస్ (చింతకుంట తండా)
నాది ములుగు మండలం పత్తిపల్లి శివారు చింతకుంటతండా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష మొదటసారి రాసినప్పుడు సరైన మార్కులు రాలేదు. కుంగిపోకుండా మరింత కసిపెంచుకొని క్రమశిక్షణతో ప్రణాళిక పద్దతిలో చదివా. 2019లో రెండోసారి పరీక్ష రాయగా 741 ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్రలో విధులు నిర్వహిస్తున్నా. మనం ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అవాంతరాలు ఎదురైతే అక్కడితో ఆగిపోకుండా శక్తిని ప్రోది చేసుకొని ముందుకు సాగాలి. అధైర్యం చెందకుండా మరింత పట్టుదలగా చదివి కల సాకారం చేసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం