logo

ఉత్తుత్తి టెండరు.. ప్రజాధనానికి ఎసరు!

ప్రజాధనాన్ని వృథా కాకుండా చూడాల్సిన ప్రభుత్వ అధికారులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.

Published : 27 Mar 2023 06:04 IST

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌:  ప్రజాధనాన్ని వృథా కాకుండా చూడాల్సిన ప్రభుత్వ అధికారులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా)లో ఇంజినీర్లు ఉత్తుత్తి టెండరు నోటిఫికేషన్‌ ఇచ్చేసి పెద్ద ఎత్తున కమీషన్లు దండుకున్నారనే విమర్శలున్నాయి. వరంగల్‌ ఇన్నర్‌ రింగు రోడ్డు(ఐఆర్‌ఆర్‌) ఫార్మేషన్‌ పనుల టెండర్లు వేయొద్దని ఓ ఇంజినీరింగ్‌ అధికారి గుత్తేదారులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే పనులు పూర్తయ్యాయని, నిబంధనల కోసం ఆన్‌లైన్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చామని సదరు అధికారి చెప్పడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగశాయిపేట నాయుడు పంపు కూడలి నుంచి ఎనుమాముల వ్యవసాయ మార్కెటు యార్డు వరకు ఇన్నర్‌ రింగురోడ్డు కందకం తీసే పనుల కోసం రూ.78.44 లక్షలతో ప్రతిపాదనలు రచించారు. అత్యవసర పనులంటూ ఈ నెల 23న ఇ-ప్రొక్యూర్‌మెంటు అంతర్జాలం షార్ట్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు ఆన్‌లైన్‌ ద్వారా టెండరు దరఖాస్తులు వేసేందుకు గడువిచ్చారు. ఇద్దరు, ముగ్గురు గుత్తేదారులు టెండర్లు వేసేందుకు ముందుకొచ్చారు. ఇన్నర్‌ రింగు రోడ్డు ఫార్మేషన్‌ వర్క్‌ ఇప్పటికే పూర్తయిందని, ఎవరూ టెండర్లు వేయొద్దని కుడా ఇంజినీరింగ్‌ అధికారి చెప్పడంతో వెనక్కి తగ్గారు. పూర్తయిన పనులకు టెండరు నోటిఫికేషన్‌ ఎలా ఇచ్చారని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.’

నిబంధనలు అడ్డొస్తాయనే..:  ఇన్నర్‌ రింగురోడ్డు ఫార్మేషన్‌ పనులను ముందుగానే కుడా ఇంజినీర్లు ఓ గుత్తేదారుకు కట్టబెట్టారు. నిబంధనల ప్రకారం చూస్తే రూ.50 వేలు దాటిన ప్రతి పనికి ఇ-ప్రొక్యూర్‌మెంటు టెండర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. అత్యవసరమైతే రూ.5 లక్షల్లోపు పనులు నామినేషన్‌పై ఇచ్చే అధికార కుడా వీసీకి ఉంది. ఇన్నర్‌ రింగురోడ్డు ఫార్మేషన్‌ పనులు రూ.78.44 లక్షలతో అంచనాలు రూపొందించారు. నిబంధనలు అడ్డు వస్తాయని భావించి కుడా ఇంజినీర్లు ఈ ఉత్తుత్తి టెండరు నోటిఫికేషన్‌ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని