logo

కీర్తిగడించిన ఓరుగల్లువాసులు

తెలుగు సాహిత్యం, కళారంగాల్లో విశేష సేవలను అందిస్తున్న సాహితీవేత్తలు, కళాకారులు, రచయితలు, కవులకు హైదరాబాద్‌ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలను ప్రకటించింది.

Published : 27 Mar 2023 06:04 IST

తెలుగు సాహిత్యం, కళారంగాల్లో విశేష సేవలను అందిస్తున్న సాహితీవేత్తలు, కళాకారులు, రచయితలు, కవులకు హైదరాబాద్‌ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన పలువురికి  లభించాయి. ఈనెల 28, 29 తేదీల్లో జరిగే కార్యక్రమాల్లో పురస్కారాలను అందుకోనున్నారు. పురస్కార గ్రహీతలు, వారు చేసిన కృషిపై ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న కథనం.

న్యూస్‌టుడే, వరంగల్‌ సాంస్కృతికం, మానుకోట, దుగ్గొండి


ప్రకృతి వైద్య సాహిత్య గ్రంథాలయానికి గుర్తింపు

ఫ్రొఫెసర్‌ గజ్జల రామేశ్వరం ‘అంతర్జాతీయ ప్రకృతి వైద్య సాహిత్య గ్రంథాలయం’ వ్యవస్థాపకుడు. ఆయన కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు. ప్రకృతి వైద్య సాహిత్య పరిశోధన, అన్వేషణ, సేకరణలో ఆయన మూడు దశాబ్దాలకు పైగా కృషి చేస్తున్నారు. అపూర్వ పుస్తక సంపదతో హనుమకొండలోని తన సొంత ఇంటిలోనే 2018 జులై 24న ప్రత్యేక గ్రంథాలయాన్ని నెలకొల్పారు. ఇందులో నాలుగు వేలకు పైగా గ్రంథాలు, పుస్తకాలు ఉన్నాయి. 30 రకాల ప్రకృతి వైద్య పత్రికలకు సంబంధించిన 4,500 పాత సంచికలున్నాయి. వీటిలో అనేకం అరుదైన పుస్తకాలు. రామేశ్వరం సేకరించిన అరుదైన పుస్తకాలను 2010లో హైదరాబాద్‌లోని భారత వైద్య వారసత్వ చరిత్ర సంస్థ (ఐఐహెచ్‌ఎం) డిజిటలైజేషన్‌ చేయడమే కాకుండా కొన్ని పుస్తకాలను ఐఐహెచ్‌ఎం మ్యూజియంలో ప్రత్యేక అరలో భద్రపరిచింది. ప్రపంచంలో మరుగున పడిన ప్రకృతి వైద్య విజ్ఞాన సాహిత్యాన్ని వెలుగులోకి¨ తీసుకువచ్చినందుకు రామేశ్వరానికి ‘గ్రంథాలయ కర్త’ విభాగంలో పోటీ శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది. తన సాహిత్యాన్ని ప్రచారం చేయడం.. పరిశోధకులకు అందించడం లక్ష్యంలో భాగంగానే ఈ గ్రంథాలయం స్థాపించానని రామేశ్వరం చెప్పారు.


హక్కుల కార్యకర్తగా సేవలు

వరంగల్‌ శివనగర్‌ ప్రాంతానికి చెందిన భండారు విజయ మహిళా హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. లష్కర్‌బజార్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు అభ్యసించారు. వరంగల్‌ కృష్ణ కాలనీలోని బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశారు. లైబ్రరీ కోర్సు పూర్తి చేసి కాకతీయ విశ్వవిద్యాలయంలో కేంద్ర గ్రంథాలయంలో పని చేశారు. ‘మహిళా అభ్యుదయ’ కేటగిరీలో ఆమె కీర్తి పురస్కారం అందుకోనున్నారు. గతంలో పలు పుస్తకాలు రచించి పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం 40 మంది రచయితలతో కలిసి ఒంటరి మహిళల అంశంపై కథా సంకలనం రూపొందిస్తున్నారు. వచ్చే మాసంలో ఈ సంకలనం ఆవిష్కరించనున్నారు.


‘బలగం’ చిత్రంతో వెలుగులోకి

‘జానపద కళలు’ విభాగంలో వరంగల్‌ జిల్లా దుగ్గొండికి చెందిన బుడిగె జంగాల కళాకారిణి పస్తెం కొమురమ్మకు కీర్తి పురస్కారం లభించింది. ఇటీవల విడుదలైన ‘బలగం’ చిత్రంలో చివరి ఘట్టంలో ప్రేక్షకుల హృదయాలను ద్రవింపజేసిన పాటను ఆలపించిన కొమురమ్మ గానామృతానికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. చిన్ననాటి నుంచే తాత, తండ్రి ప్రభావంతో కొమురమ్మకు బుర్ర కథల పాటలు పాడడమంటే ఇష్టం. భర్త మొగిలి కళాకారుడు కావడంతో ఇద్దరూ కలిసి శుభకార్యాలు, దశ దిన కర్మల్లో జానపద కళలు ప్రదర్శించారు. ప్రభుత్వం తనకు జానపద ప్రదర్శనల్లో అవకాశం కల్పించాలని ఆమె ‘న్యూస్‌టుడే’తో పేర్కొన్నారు. అలాగే బుల్లితెర, సినిమాల్లో జానపద కళాకారిణిగా పాటలు పాడేందుకు అవకాశం కల్పిస్తే మరింతగా రాణిస్తానన్నారు.


కథా సాహిత్యంలో సేవలకు..

వరంగల్‌ శివనగర్‌ ప్రాంతానికి చెందిన డాక్టర్‌ పసునూరి రవీందర్‌ కవిగా, రచయితగా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా కీర్తి పురస్కారానికి ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి రచయిత రవీందర్‌. 2015లో ఆయన రచించిన ‘అవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియా’ అనే పుస్తకానికి పురస్కారం దక్కింది. బహుజనుల అభ్యున్నతి లక్ష్యంగా మరిన్ని మంచి రచనలు సామాజిక బాధ్యతగా చేస్తానని రవీందర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని