logo

ఆదర్శ మార్కెట్‌గా తీర్చిదిద్దుదాం

మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత అన్నారు.

Published : 27 Mar 2023 06:04 IST

ప్రమాణ స్వీకారం చేస్తున్న మహబూబాబాద్‌ మార్కెట్‌ పాలక మండలి సభ్యులు

నెహ్రూసెంటర్‌, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత అన్నారు. ఆదివారం మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం జరగగా స్థానిక శాసనసభ్యుడు బానోతు శంకర్‌నాయక్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా కత్తెరసాల విద్యాసాగర్‌, ఉపాధ్యక్షుడిగా గుండా రాజశేఖర్‌తోపాటు పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీ కవిత మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10వేలు ప్రకటించడం సంతోషదాయకమన్నారు. కేంద్రంలో భాజపా ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రైతు సంక్షేమానికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రజాసంక్షేమం కోసం పాటు పడుతున్న భారాసను ప్రజలు ఆదరించాలని ఆమె కోరారు. డోర్నకల్‌ శాసనసభ్యులు డీఎస్‌ రెడ్యానాయక్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్ల కారణంగా సామాన్య, నిరుపేద, దళితులకు పాలించే అవకాశం దక్కుతుందన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భావనతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ రైతుల సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. నూతన మార్కెట్‌ కోసం 28 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని మార్కెట్‌ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు భారాస పార్టీని ఆదరించి గెలిపించాలని కోరారు.  ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో రైతులు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. రాష్ట్రంలో సాగు నీరు, తాగు నీరు అందిస్తూ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మహబూబాబాద్‌, డోర్నకల్‌ పురపాలక అధ్యక్షులు డాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి, వాంకుడోత్‌ వీరన్న, డోర్నకల్‌ జడ్పీటీసీ సభ్యురాలు కమలమ్మ, ఎంపీపీ బాలు, మండల పార్టీ అధ్యక్షుడు రమణ, భారాస నాయకులు రవిచంద్ర, మహబూబాబాద్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ రంజిత్‌, పురపాలక వైస్‌ చైర్మన్‌ ఎం.డీ.ఫరీద్‌, మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల శ్రీనివాస్‌, పిచ్చిరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి జిల్లా మార్కెటింగ్‌ అధికారి వెంకట్‌రెడ్డి, మార్కెట్‌ కార్యదర్శి రాజేందర్‌, భారాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


నూతన కమిటీ ఇదే

మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ నూతన పాలక వర్గంలో చైర్మన్‌గా కత్తెరసాల విద్యాసాగర్‌, వైస్‌ చైర్మన్‌ గుండా రాజశేఖర్‌ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా బాలు, ఎలేందర్‌, భిక్షం, నరేష్‌, వెంకన్న, ఆంజనేయులు, సరియ, వెంకన్న, రాము, భరధ్వాజ్‌, సాంబశివరావు, మహిపాల్‌రెడ్డి, రంజిత్‌, వెంకట్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, రామ్మోహన్‌ రెడ్డి నియామకమయ్యారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని