logo

కలుషిత నీరు తాగి 24 మంది కూలీలకు అస్వస్థత

కలుషిత నీటిని తాగి 24 మంది వ్యవసాయ కూలీలు అస్వస్థతకు గురైన సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం గొల్లగూడెం(ఉప్పేడు) గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

Published : 30 Mar 2023 04:39 IST

ముగ్గురి పరిస్థితి విషమం

చికిత్స పొందుతున్న కూలీలు

వెంకటాపురం, న్యూస్‌టుడే: కలుషిత నీటిని తాగి 24 మంది వ్యవసాయ కూలీలు అస్వస్థతకు గురైన సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం గొల్లగూడెం(ఉప్పేడు) గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బాధిత కూలీల కథనం ప్రకారం.. గొల్లగూడేనికి చెందిన కె.వెంకటేశ్వర్లు అనే రైతుకు చెందిన మిర్చి తోటలో మిరప కాయలను కోసేందుకు బుధవారం 24 మంది కూలీలు వెళ్లారు. భోజన విరామం సమయంలో దాహార్తి తీర్చుకునేందుకు మరో రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలోని ట్యాంకులో నిల్వ చేసిన నీటిని బిందెల్లో తెచ్చుకున్నారు. ఆ నీటిని తాగి మళ్లీ పనికి ఉపక్రమించే సమయంలో పలువురికి కళ్లు తిరగడంతో పాటు వాంతులు అయ్యాయి. ఆ రైతును ఆరా తీయగా బిందు సేద్యానికి సంబంధించిన (డ్రిప్‌) పైపులను శుద్ధి చేసేందుకు గాను రసాయన ద్రావణాన్ని ట్యాంకులో కలిపినట్లు చెప్పడంతో భయాందోళన చెందారు. వెంటనే కూలీలను సహచరులు వెంకటాపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. కలుషిత నీరు తాగిన వారిలో కన్నెబోయిన రమణ, ములకల రమణ, నారాయణలకు తీవ్రంగా వాంతులు కావడంతో స్పృహ కోల్పోయారు. మిగిలిన వారు స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. వీరికి ప్రాథమిక వైద్య సేవలు అందించిన వైద్యాధికారి శ్రీకాంత్‌ మెరుగైన చికిత్స కోసం 108 వాహనాల్లో ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న వెంకటాపురం సీఐ కె.శివప్రసాద్‌, ఎస్సై కె.తిరుపతిరావు ఆసుపత్రికి వెళ్లి బాధితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ ఘటనపై ములుగు జిల్లా పాలనాధికారి కృష్ణఆధిత్య, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చరవాణిలో వివరాలు సేకరించారు. కన్నెబోయిన రమణ, ములకల రమణ, నారాయణ పరిస్థితి విషమించడంతో రాత్రి 9 గంటలకు ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని