logo

గుడిసెవాసులకు పట్టాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాలదే..

ఎన్నికల ముందు ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన అనేక హామీలను కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు ఆరోపించారు.

Published : 30 Mar 2023 04:39 IST

సభలో అభివాదం చేెస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  కూనమనేని సాంబశివరావు, రాష్ట్ర, జిల్లా నాయకులు

భూపాలపల్లి, న్యూస్‌టుడే: ఎన్నికల ముందు ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన అనేక హామీలను కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెవాసులకు పట్టాలు ఇచ్చే బాధ్యత వారిదేనని అన్నారు.  సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా పోరు యాత్రలో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ కూడలి ప్రాంతంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పేదలకు ఇంటి పట్టాలు వచ్చే వరకు సీపీఐ పార్టీ అండగా ఉంటుందన్నారు. సీపీఐ పని అయిపోయిందని భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నీతిని నమ్మిన పార్టీ కావటం వల్లనే సీపీఐకి వందేళ్ల చరిత్ర ఉందన్నారు.

సింగరేణి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం

రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో భారాస అనుబంధ తెబొగకాసంతో ఏఐటీయూసీ పొత్తు ఉంటుందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కెళ్లపెల్లి శ్రీనివాస్‌రావు అన్నారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే ఏఐటీయూసీ పోటీ చేస్తుందన్నారు.

ఆకట్టుకున్న కళాకారుల నృత్యం..

ప్రజా పోరు యాత్రలో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని మంజూరునగర్‌ నుంచి హన్‌మాన్‌నగర్‌ వరకు డప్పు కళాకారుల నృత్యాలు, మహిళల కోలాటాలు ఆకట్టుకున్నాయి. ఎర్రజెండాలతో మహిళలు, కార్మికులు, కూలీలు, పేదలు పాదయాత్ర నిర్వహించటంతో పట్టణంలోని అంబేడ్కర్‌ కూడలి ప్రాంతం ఎరుపు రంగుగా తలపించింది. మహిళలు బోనాలు, బతుకమ్మలతో పోరు యాత్రకు స్వాగతం పలికారు. ప్రజా పోరు యాత్ర  సీపీఐ కార్యకర్తల్లో జోష్‌ నింపింది. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు రాజ్‌కుమార్‌, విజయసారథి, రాజిరెడ్డి, విశ్వేశర్‌రావు, మల్లికార్జున్‌రావు, భిక్షపతి, కొరిమి రాజ్‌కుమార్‌, మోటపలుకుల రమేష్‌, సుగుణ, పంజాల రమేష్‌, సతీష్‌, ప్రవీణ్‌, సదాలక్ష్మి, సమ్మిరెడ్డి, వెంకటేష్‌, భూలక్ష్మి, రాంచందర్‌, విజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


దేశాన్ని ఆరుగురు గజదొంగలు దోచుకుంటున్నారు..

‘దొంగలందరి పేర్లలో మోదీ ఆనే పేరు గల వ్యక్తులు ఇద్దరు, ముగ్గురు ఉన్నారని ఓ సభలో మాట్లాడినందుకే కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించారు.. దొంగలను దొంగలని సంబోధించకుండా ఏమని పిలవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు ప్రశ్నించారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా పోరు యాత్రలో భాగంగా బుధవారం రాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశాన్ని ఆరుగురు గజదొంగలు దోచుకుతింటున్నారని, వారిలో ఇద్దరు భాజపాకు చెందినవారు, మరో నలుగురు పెట్టుబడిదారులు ఉన్నారని విమర్శించారు. విదేశీ వనితకు పుట్టిన రాహుల్‌గాంధీ దేశ భక్తుడు కాదని కొందరు భాజపా నేతలు మాట్లాడుతున్నారని.. ఒక తల్లిని విమర్శించే నీచమైన సంస్కృతికి భాజపా పాటుపడటం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. సింగరేణి బొగ్గు బ్లాకులు, ఎల్‌ఐసీ, బ్యాంకులను మోదీ ప్రభుత్వం కొంత మంది దొంగలకు కట్టబెట్టిందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి మోదీ కుర్చీ దిగిపోవడం ఖాయమన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు