logo

‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఏప్రిల్‌ 3న ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ సీహెచ్‌.శివలింగయ్య తెలిపారు.

Published : 30 Mar 2023 04:39 IST

కలెక్టర్‌ శివలింగయ్యతో కలిసి కళాశాల ఏర్పాటు  పనులను పరిశీలిస్తున్న రమేష్‌రెడ్డి

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: ఏప్రిల్‌ 3న ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ సీహెచ్‌.శివలింగయ్య తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై బుధవారం హైదరాబాద్‌ నుంచి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, సంబంధిత శాఖల అధికారులతో కలిసి కలెక్టర్‌ సమీక్షలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 6748 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, జిల్లా వ్యాప్తంగా 42 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని, 63040 62768 నెంబర్‌తో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమీక్షలో ఏసీపీ దేవేందర్‌, డీఈవో రాము, ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ వేణుమాధవ్‌, డివిజనల్‌ పంచాయతీ అధికారి పార్థసారథి, మున్సిపల్‌ కమిషనర్‌ రజిత, ఆర్టీవో శ్రీనివాస్‌, బి.అర్జున్‌, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

వైద్య కళాశాల ఏర్పాటు పనుల పరిశీలన

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: జనగామలో వైద్య కళాశాల ఏర్పాటు పనులను బుధవారం డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) డాక్టర్‌ రమేష్‌రెడ్డి, కలెక్టర్‌ సీహెచ్‌.శివలింగయ్యతో కలిసి పరిశీలించారు. కళాశాల నిర్మాణ స్థలం, తరగతులు నిర్వహించనున్న ఏబీవీ డిగ్రీ కళాశాల, ధర్మకంచలోని వసతిగృహం, వీబీఐటీక కళాశాల, గీతాంజలి పాఠశాల, చంపక్‌హిల్స్‌లోని ఎంసీహెచ్‌లో నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. రమేష్‌రెడ్డి మాట్లాడుతూ వైద్య కళాశాల ఏర్పాటుకు 22 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు. మొదటి బ్యాచ్‌లో వంద మంది వైద్య విద్యార్థుల కోసం  ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాత్కాలికంగా భవనాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.  భవన నిర్మాణ పనులను  వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ గోపాల్‌రావు, ఎంసీహెచ్‌ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుగుణాకర్‌రాజు, టీఎస్‌ఎంఐడీసీ ఏఈ దేవేందర్‌, తహసీల్దార్‌ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.


విద్యార్థులూ.. సందేహాలను నివృత్తి చేసుకోండిలా !

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లా విద్యాశాఖాధికారి కె.రాము వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్‌ 3 నుంచి జరగనున్న వార్షిక పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల సౌకర్యార్థం, వారి సందేహాలను నివృత్తి చేసేందుకు వివిధ సబ్జెక్టుల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ఈ నెల 31 నుంచి ఏప్రిల్‌ 11వ తేదీ వరకు  ఫోన్‌ ఇన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందు కోసం జిల్లాలో వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన 14 మంది సీనియర్‌ ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. పదో తరగతి విద్యార్థుల సందేహాలకు చరవాణిలో విషయ నిపుణులు సమాధానాలు ఇవ్వనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈవో కోరారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని