logo

విదేశీ విద్యకు సహకారం

ఒకప్పుడు సంపన్నులు, ఉన్నత వర్గాలకు చెందిన వారే విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లేవారు.. ప్రస్తుతం డీసీసీ బ్యాంకు సహకారంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన మధ్యతరగతి రైతు బిడ్డలు సైతం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

Updated : 31 Mar 2023 05:55 IST

రైతు బిడ్డలకు అండగా బ్యాంకు రుణాలు

స్టేషన్‌ఘన్‌పూర్‌ డీసీసీ బ్యాంకు

న్యూస్‌టుడే, స్టేషన్‌ఘన్‌పూర్‌ : ఒకప్పుడు సంపన్నులు, ఉన్నత వర్గాలకు చెందిన వారే విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లేవారు.. ప్రస్తుతం డీసీసీ బ్యాంకు సహకారంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన మధ్యతరగతి రైతు బిడ్డలు సైతం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. విదేశాల్లో చదవడానికి ఆసక్తి చూపించే గ్రామీణ రైతు బిడ్డలకు రుణాలు ఇచ్చేందుకు డీసీసీ బ్యాంకు ముందుకొచ్చింది. పాస్‌ పుస్తకాలతో భూములను మార్టిగేజ్‌ చేసుకొని రైతులకు రూ.లక్షల్లో రుణాలిచ్చి విదేశీ విద్యను ప్రోత్సహిస్తోంది. బ్యాంకు పరిధిలో ఘన్‌పూర్‌, చిల్పూర్‌, జఫర్‌గఢ్‌ మండలాలకు చెందిన రైతులకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది రుణాలు పొంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్‌ లాంటి దేశాలకు వెళ్లి అక్కడి యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. మరికొందరు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.. 2021-22 మధ్య కాలంలో ఏడుగురు విద్యార్థులు రూ.1.20 కోట్ల రుణం పొంది అమెరికాకు వెళ్లారు. 2022 ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు 11 మంది విద్యార్థులు రుణాలు పొందారు. వీరిలో ఐదుగురు అమెరికాకు వెళ్లారు.

రుణాలు పొందడం ఇలా..

డీసీసీ బ్యాంకు ద్వారా విద్యా రుణాలు పొందాలనుకునే విద్యార్థుల తల్లిదండ్రులు లేదా నాన్నమ్మ, తాతయ్య మరెవరైనా వారి పట్టా పుస్తకాలను మార్ట్‌గేజ్‌ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన మేరకు అభ్యర్థులకు రుణాలను అందిస్తున్నారు. పట్టా భూమికి 13 ఏళ్లకు సంబంధించి అనుబంధ పత్రాలు(లింక్‌ డాక్యుమెంట్స్‌)ను అందిస్తే సరిపోతుంది.
బ్యాంకు సిబిల్‌ స్కోర్‌ 680 ఉండాలి. విదేశాలకు వెళ్లిన తర్వాత యూనివర్సిటీ చెల్లించాల్సిన ట్యూషన్‌ ఫీజు, ల్యాప్‌టాప్‌, పుస్తకాలు, హాస్టల్‌ ఫీజు, ప్రాజెక్టు వర్క్‌, కొనుగోలు తదితర ఖర్చుల మొత్తానికి సంబంధించి గరిష్ఠంగా బ్యాంకు రూ.30 లక్షల వరకు రుణం అందిస్తోంది. రుణం పొందిన విద్యార్థి, అతడి తల్లిదండ్రులు మొదటి మూడేళ్ల వరకు కేవలం రుణంపై వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. నాలుగో ఏడాది నుంచి వడ్డీతో పాటు అసలును వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.


  విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి..
-మహబూబీ, డీసీసీ బ్యాంకు మేనేజర్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌

బ్యాంకు నిబంధనల మేరకు విదేశీ చదువుల కోసం రుణాలను అందిస్తున్నాం. ఇప్పటివరకు ఎక్కువ మొత్తంలో రైతుల పిల్లలకే రుణాలు ఇచ్చాం.. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.  


రుణం వెంటనే వచ్చింది..
-మెడిచర్ల మణికంఠ(ఎమ్మెస్‌ అమెరికా), మల్కాపూర్‌, చిల్పూర్‌

సరైన పత్రాలతో రుణం దరఖాస్తు చేసుకున్న వెంటనే బ్యాంకు అధికారులు రూ.20 లక్షల రుణం మంజూరు చేశారు. ఎలాంటి కమీషన్‌, వాటాలు తీసుకోకుండానే డీసీసీ బ్యాంకులో రుణం మంజూరు చేశారు.


ఇబ్బందులు లేకుండా..
- గడ్డం యశ్వంత్‌(ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్, లండన్‌) జఫర్‌గఢ్‌ మండలం, కూనూర్‌

దరఖాస్తు సమర్పించిన వెంటనే పత్రాలను పరిశీలించిన అధికారులు బ్యాంకు ఖాతాలో రూ.18 లక్షల నగదు జమ చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని