logo

బాల్యం బలంగా ఉండేలా!

పోషకాహార లేమితో చిన్నారులు ఈసురోమంటున్నారు. బరువు తక్కువగా ఉండడం వల్ల బలం, ఎదుగుదల లోపించడంతోపాటు మరికొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

Updated : 31 Mar 2023 05:58 IST


పోషకాహార లేమితో చిన్నారులు ఈసురోమంటున్నారు. బరువు తక్కువగా ఉండడం వల్ల బలం, ఎదుగుదల లోపించడంతోపాటు మరికొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. బాలల్లో పోషకాహార లేమిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని 2018లో ప్రారంభించి, అమలు బాధ్యతను మహిళా శిశు సంక్షేమ శాఖకు అప్పగించింది. తక్కువ బరువు కలిగిన బాలలను గుర్తించి వారికి పోషకాహారాన్ని అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని అంగన్‌వాడీ కేంద్రాలు భుజానికెత్తుకున్నాయి. నర్సంపేట ఐసీడీఎస్‌, సీడీపీవో ప్రాజెక్టు పరిధిలో ఇలాంటి పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్చుకుని ప్రభుత్వ నిర్దేశిత మేరకు పోషక విలువలు కలిగిన బలవర్ధక ఆహారాన్ని అందించడంతో క్రమేపీ బరువు పెరుగుతున్నారు. తక్కువ బరువు కలిగిన వారికి అందించాల్సిన బలవర్ధక ఆహారం గురించి బాలల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.  బరువు తక్కువగా ఉండడం వల్ల ఎదురయ్యే సమస్యలు వారి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వివరిస్తూ పోషణ్‌ పఖ్వాడా కార్యక్రమాలను జరుపుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల లబ్ధిదారులను పిలిచి చిరుధాన్యాల గురించి వివరిస్తున్నారు. కొర్రలు, సామలు, అరికెలు, రాగులు, జొన్నలు, సజ్జలు, కుసుమలు, అండుకొర్రలను చపాతీలు, రొట్టెలు, జావ, పిండి వంటకాలు ఎలా తయారు చేసి ఎలా పెట్టాల్లో వివరిస్తున్నారు.
 న్యూస్‌టుడే, నర్సంపేట


ఇరవై నెలల పాప ఏడు కిలోలే

ఖానాపురం,న్యూస్‌టుడే: చిత్రంలోని చిన్నారి ఖానాపురానికి చెందిన మోకాళ్ల రక్షిత. 20 నెలలు నిండినా ఏడు కిలోలే బరువు ఉంది. ఎత్తు 74.5 అంగుళాలు.  వాస్తవంగా 8.3 కిలోల బరువు ఉండాలి. సరైన పోషకాహారం అందకనే బరువు తక్కువగా ఉన్నట్లు ఐసీడీఎస్‌ సిబ్బంది ఆలస్యంగా గుర్తించారు. తల్లితండ్రులకు కౌన్సెలింగ్‌ చేసి డిసెంబరు నుంచి (నాలుగు నెలలు) సూపర్‌వైజర్‌ పోషకాహారం ఇచ్చారు. దీంతో బరువు 750 గ్రాములు పెరిగింది.


 
నల్లబెల్లి: అమ్మ చెంతన ఉన్న ఈ బాబు పేరు పెంతల కౌషిక్‌(5). బాల్యంలో ఎలర్జీ రావడంతో బక్కచిక్కి పోయాడు. ఎదుగుదల లోపించింది. వయసుకు తగ్గ బరువు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడు. పౌష్టికాహారం అందించడంతో పాటు, ఆరోగ్యస్థితి నిత్యం పర్యవేక్షిస్తున్నాం. అన్ని రకాల మందులు సరఫరా చేయాలి.


నర్సంపేట రెండో నంబరు అంగన్‌వాడీ కేంద్రంలో ఆడుకుంటున్న చిన్నారి పేరు రేకుల సహస్ర. ఈమె వయస్సు 27 నెలలు. నిబంధనల మేరకు 90 అంగుళాల పొడవు ఉండాలి. కాని 86 అంగుళాలే ఉంది. బరువు 10.5 కిలోలకు 9.2 కిలోలుంది. దండ కొలత 16 సెంటీమీటర్లకు గాను 14.5సెం.మీ. ఉంది. ఈ పాపను ఈ నెలలో అంగన్‌వాడీ కేంద్రంలో చేర్చుకొని ఉదయం 7.30 గంటలకు బాలామృతం, 9.30 గంటలకు కోడిగుడ్డు, 11.30 గంటలకు పాలు, మధ్యాహ్నం 12.15- 1 గంట మధ్య మినీ భోజనం అదనంగా 5 గ్రాముల నూనె, గుజ్జుగా చేసిన కూరగాయలు, పండ్లు, జిల్లాలో ఐసీడీఎస్‌ సేవలు పొందుతున్న వారి వివరాలు      
తీవ్ర పోషణ లోపం ఉన్నవారు: 408సాయంత్రం 5.30 గంటలకు బాలామృతం, రాత్రి 7.30 గంటలకు భోజనం, అదనంగా 5 గ్రాముల నూనె/నెయ్యి, పాలు ఇస్తున్నారు.  నెల రోజుల్లో 100 గ్రాముల బరువు పెరిగింది.


ఈ పాప పేరు హనీ వయసు 14 నెలలు 76-80 ఇంచుల పొడవు ఉండాల్సి ఉండగా 70.4 ఇంచులు మాత్రమే ఉంది. బరువు 9 కిలోలకు బదులు 8 కిలోలు మాత్రమే ఉంది. అంగన్‌వాడీ కేంద్రంలో చేర్చుకొని రెండు నెలలైంది. నిర్దేశిత మెనూ ప్రకారం పోషకాహారాన్ని అందిస్తున్నారు. ఇదీ మంచి ఫలితాన్నిస్తోందని తల్లి లక్ష్మి, అంగన్‌వాడీ టీచర్‌ రాధ తెలిపారు. రెండు నెలల్లో పాప బరువు   8.4 కిలోలకు చేరినట్లు తెలిపారు.

పోషకాహార లోపంతో చిన్నారులు  

చెన్నారావుపేట:  చెన్నారావుపేట మండలంలో పోషకాహార లోపంతో సుమారు 50 మంది చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు.   జల్లి గ్రామానికి చెందిన వర్థెల్లి వరుణ్‌ వయసుకు తగిన బరువు ఉన్నా, ఎత్తుకు తగిన బరువు లేడు. తిమ్మరాయినిపహాడ్‌కు చెందిన అభిరాం వయసుకు తగిన బరువు, ఎత్తు లేకపోవడంతో గత ఏడాదిగా అంగన్‌వాడీ నుంచి ప్రత్యేక పోషకాహారం అందిస్తున్నారు. అయిలా ఎలాంటి అభివృద్ధి లేదని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ మంజుల తెలిపారు. 


జిల్లాలో ఐసీడీఎస్‌ సేవలు పొందుతున్న వారి వివరాలు
ప్రాజెక్టులు: 3    
మొత్తం పిల్లలు: 45034      
పోషణ లోపం ఉన్న వారు:  1095          
తీవ్ర పోషణ లోపం ఉన్నవారు: 408


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు