logo

కబ్జాదారుల కోరల్లో ఎనుమాముల

గతంలో వెనకబడిన ప్రాంతంగా ఉన్న ఎనుమాముల క్రమంగా అభివృద్థి వైపు అడుగులు వేస్తోంది. గత ఏడాది లేబర్‌ కాలనీ నుంచి ఎనుమాముల వైపు వచ్చే వంద అడుగుల రహదారి విస్తరణ బాలాజీనగర్‌ కూడలి అభివృద్థి పనులకు శ్రీకారం చుట్టడంతో ఒక్కసారిగా వెనక బడిన ఎనుమాముల ప్రాంతం అభివృద్థికి చేరువైంది.

Updated : 31 Mar 2023 05:53 IST

  బోర్డు తొలగిస్తున్న బాధితులు

న్యూస్‌టుడే, లేబర్‌కాలనీ : గతంలో వెనకబడిన ప్రాంతంగా ఉన్న ఎనుమాముల క్రమంగా అభివృద్థి వైపు అడుగులు వేస్తోంది. గత ఏడాది లేబర్‌ కాలనీ నుంచి ఎనుమాముల వైపు వచ్చే వంద అడుగుల రహదారి విస్తరణ బాలాజీనగర్‌ కూడలి అభివృద్థి పనులకు శ్రీకారం చుట్టడంతో ఒక్కసారిగా వెనక బడిన ఎనుమాముల ప్రాంతం అభివృద్థికి చేరువైంది. దీంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.  వంద అడుగుల ప్రధాన మార్గంలో గజానికి రూ.30 వేల వరకు ధర పలుకుతుండడంతో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంది. దీంతో ఎనుమాముల ప్రాంతంలో ఆరుమాసాలుగా కబ్జాల పర్వం మొదలైంది. సాక్షాత్తు స్థానిక కార్పొరేటర్‌ భర్త తూర్పాటి సారయ్యనే పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టడం పరిస్థితికి అద్దం పడుతోంది. కార్పొరేటర్‌ భర్త సోదరుడి కొడుకులు తూర్పాటి రఘు, శ్రీనివాస్‌, ఇద్దరు, జంగం రాజు, గండ్రాతి భాస్కర్‌ అనే ఇద్దరు భారాసా నాయకులు అరెస్టైన వారిలో ఉన్నారు. రాజకీయ అండతోనే కబ్జాలకు తెరలేపడంతో బాధితులు ఆరుమాసాలుగా అష్టకష్టాలు పడ్డారు. చివరికి వరంగల్‌ సీపీ రంగనాథ్‌ రూపంలో బాధితులకు అండ లభించింది.   భూకబ్జా విషయంలో గురువారం పోలీసులు విచారణ చేపట్టారు. సీపీ రంగనాథ్‌ ఆదేశానుసారం  ఎస్‌ఐ శ్రీకాంత్‌, ఇద్దరు కానిస్టేబుళ్లు పోలీసు సిబ్బంది ఎనుమాములకు చేరుకుని ప్లాట్ల యజమానులతో మాట్లాడారు. గత రెండురోజులుగా రికార్డులు పరిశీలించిన విషయాలను క్రోడీకరించి స్థలం ఎవరిది, ఎవరు కబ్జా చేశారనే కోణంలో వివరాలు సేకరించారు. అనంతరం గత నెలలో ఓ ప్లాటులో పాతిన బోర్డును పోలీసుల సమక్షంలోనే బాధితులు తొలగించారు.

మాజీ కార్పొరేటర్‌ కనుసన్నల్లో..

* వరంగల్‌ ఎనుమాముల, కాశీబుగ్గ పరిసర ప్రాంతాలలో అధికార పార్టీకి చెందిన ఓ మాజీ కార్పొరేటర్‌ రియల్టర్‌, అవతారమెత్తిన ఓ అడ్తి వ్యాపారి, మరో ముగ్గురు కలసి ఎనుమాముల శుభం గార్డెన్స్‌ సమీపంలో ఏకంగా రహదారినే కబ్జా చేశారు. అడిగిన స్థానిక కాలనీ వాసులను బెదిరించారు. ఈ విషయమై ఎనుమాముల వాసులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను కలసి విన్నవించుకున్నా  అక్రమణలు తొలగలేదని స్థానికులు వాపోతున్నారు.
* కోటిలింగాల దేవాలయం సమీపంలో మరో రియల్టర్‌, కాశీబుగ్గకు చెందిన ఓ బిర్యాని సెంటర్‌ యజమాని కలిసి రోడ్డుపైనే నిర్మాణం చేపట్టారు. ఇదేమిటని అడిగితే ఎక్కడ దాడి చేస్తారోనని జనం భయపడుతున్నారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని