logo

మాయదారి రోగం..మానదంట పాపం!

జీవితాంతం తోడు ఉంటాడని నమ్మిన భర్త లేడు. ఆదుకునేందుకు తల్లిదండ్రులు లేరు. తోడబుట్టిన అక్కలే ఆమెను చేరదీసి ఓ ఇంట్లో అద్దెకుంచారు.

Updated : 31 Mar 2023 13:06 IST

తల్లితో శ్రీకర్‌

న్యూస్‌టుడే, వరంగల్‌ కలెక్టరేట్‌, రంగంపేట : జీవితాంతం తోడు ఉంటాడని నమ్మిన భర్త లేడు. ఆదుకునేందుకు తల్లిదండ్రులు లేరు. తోడబుట్టిన అక్కలే ఆమెను చేరదీసి ఓ ఇంట్లో అద్దెకుంచారు. ఇలా ఆర్థిక, సామాజిక ఇబ్బందులతో సమతమతమవుతున్న ఆ తల్లికి మరో పెద్ద సమస్య వచ్చింది. చిన్న వయసులోనే కొడుకు అంతుచిక్కని, అసలు చికిత్సే లేని జన్యువ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసి గుండెలవిసేలా రోదిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన గడప మానసకు తొమ్మిదేళ్ల క్రితం కరీంనగర్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. తాగుడుకు బానిసైన భర్త మూడేళ్ల క్రితం ఆమెను, పిల్లలను వదిలి వెళ్లిపోయాడు. అప్పటినుంచి తోడబుట్టిన అక్కల సహకారంతో వరంగల్‌ అబ్బనికుంట ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ.. ఓ పెట్రోలు బంకులో చిరుద్యోగం చేస్తూ పిల్లలను పోషిస్తున్నారు. ఈక్రమంలో శ్రీకర్‌ పాఠశాలలో ఆడుకుంటూ.. ఊరికే కిందపడిపోతున్న విషయం పాఠశాల ప్రిన్సిపల్‌ గమనించి తల్లి మానసకు చెప్పారు. శ్రీకర్‌ను వరంగల్‌ ఎంజీఎంలో వైద్యులకు చూపించగా.. నిమ్స్‌ ఆసుపత్రిలో కొన్ని వైద్యపరీక్షల నిమిత్తం పంపించారు. అక్కడి వైద్యులు శ్రీకర్‌ రక్త నమూనాలను తీసుకుని బెంగళూరులోని ఓ ఆసుపత్రికి పంపగా.. వైద్య నివేదికలో జన్యుసంబంధిత ‘మస్క్యులర్‌ డిస్ట్రోఫీ’ అనే అరుదైన కండరాల క్షీణత వ్యాధి సోకినట్లు ధ్రువీకరించారు. ఈ వ్యాధికి పూర్తి చికిత్స అందుబాటులో లేదని, ఇప్పటికీ పరిశోధన దశలోనే ఉన్నట్లు వెల్లడించారు. వయసు పెరుగుతున్న కొద్దీ శ్రీకర్‌ పూర్తిగా చక్రాల కుర్చీకి, మంచానికి పరిమితమయ్యే అవకాశమున్నట్లు వైద్యులు తెలపడంతో ఆ తల్లి గుండె బద్దలైంది. దిక్కుతోచని స్థితిలో దేవుడిపైనే భారంవేసి కాలాన్ని వెళ్లదీస్తున్నారు. కుమారుడి బాగోగులు చూసుకునేందుకు ఉన్న చిరుద్యోగం కూడా వదిలేసి ఇంటికే పరిమితమయ్యారు. తోడబుట్టిన వారు సాయం అందిస్తున్నారని, పోషకాహారం ఎక్కువ అందించగలిగే సంపాదన ఉన్నా తన కుమారుడిని బాగా చూసుకోగలనని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని