logo

యువికా.. సృజన వేదిక

అంతరిక్షం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.. విద్యార్థి దశ నుంచే ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. వారి ఆలోచనలకు మెరుగులుదిద్దితే.. భావి శాస్త్రవేత్తలుగా ఎదుగుతారు.

Updated : 31 Mar 2023 06:01 IST

విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయుడు

భూపాలపల్లి, దేవరుప్పుల(జనగామ జిల్లా), న్యూస్‌టుడే : అంతరిక్షం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.. విద్యార్థి దశ నుంచే ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. వారి ఆలోచనలకు మెరుగులుదిద్దితే.. భావి శాస్త్రవేత్తలుగా ఎదుగుతారు. ఈ విషయాన్ని గుర్తించిన ఇస్రో(అంతరిక్ష పరిశోధనా సంస్థ) ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అబ్దుల్‌ కలాం స్ఫూర్తితో యువ విజ్ఞాన్‌ కార్యక్రమం(యువికా) రూపొందించింది. అంతరిక్ష కేంద్రంలో జరిగే ప్రయోగాలు, పరిశోధనల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏప్రిల్‌ 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

కార్యక్రమం ఇలా.. : ఎంపికైన విద్యార్థులకు శిక్షణ కాలంలో బస, భోజనంతో పాటు రవాణా ఛార్జీలు అందజేస్తారు. మే 15 నుంచి 26వ తేదీ వరకు శిక్షణ ఉంటుంది. ఎంపికైన విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరు అంతరిక్ష కేంద్రాలకు చేరుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఇస్రోకు చెందిన అహ్మదాబాద్‌, బెంగళూరు, షిల్లాంగ్‌, తిరువనంతపురం, శ్రీహరికోట, హైదరాబాద్‌ కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. శిక్షణ అనంతరం శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో ప్రముఖ శాస్త్రవేత్తలతో ముఖాముఖి, చర్చా వేదికలు, ప్రయోగాల సందర్శన, సమావేశాల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. అంతరిక్ష శాస్త్రం, రాకెట్‌ ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు.

నాలుగు దశల్లో : ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు విధానం నాలుగు దశల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ‌ www.isro.gov.in వెబ్‌సైట్‌లో యువికా అప్లికేషన్‌ ఎంచుకుని, ఈ-మెయిల్‌ ఐడీతో లాగిన్‌ అవ్వాలి. నమోదు చేసిన 48 గంటల్లో ఇస్రో ఏర్పాటు చేసే ఆన్‌లైన్‌ క్విజ్‌లో పాల్గొనాలి. తర్వాత విద్యార్థి పూర్తి వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. 8వ తరగతిలో 60 శాతం మార్కుల ప్రతిభ చూపి ఉండాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు 15 శాతం ప్రతిభ చూపాలి. జిల్లా స్థాయి వ్యాసరచన, ఉపన్యాస, క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. దరఖాస్తులను పరిశీలించి ఏప్రిల్‌ 20న అర్హుల జాబితా ప్రకటిస్తారు. ఎన్‌సీసీ, స్కౌట్‌లో సభ్యత్వం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని భూపాలపల్లి జిల్లా సైన్స్‌ అధికారి బి.స్వామి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు